ఐపీఎల్ వర్సెస్ పీఎస్ఎల్.. పాక్ అభిమానులకు దిమ్మతిరిగే లెక్కలు చూపుతున్న ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్

First Published Dec 28, 2022, 3:41 PM IST

IPL Mini Auction: ఐదు రోజుల క్రితం  కొచ్చి వేదికగా   ఐపీఎల్ మినీ వేలం జరిగింది.  ఈ వేలంలో పలువురు ఆటగాళ్లు ఊహకందని ధరను దక్కించుకున్నారు.  ఈ నేపథ్యంలో మరోసారి ఐపీఎల్ వర్సెస్ పీఎస్ఎల్  చర్చకు తెరలేచింది. 

ప్రపంచంలో అత్యంత ధనవంతమైన బోర్డుగా బీసీసీఐకి పేరుంది. ప్రపంచ క్రికెట్ పెద్దన్న  ఐసీసీ కూడా  బీసీసీఐ చెప్పినట్టే నడుచుకుంటుందని ఇతర దేశాల క్రికెట్ బోర్డులు, ఆటగాళ్లు పలుమార్లు  ఆరోపిస్తారు. అయితే  మన పొరుగుదేశం  పాకిస్తాన్ లో క్రికెటర్లు, మాజీలు,  క్రికెట్ బోర్డు సభ్యులు మాత్రం  ఐపీఎల్ కంటే తమ దేశంలో నిర్వహిస్తున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) గ్రేట్ అని గొప్పలకు పోతారు. 
 

బ్రాండ్ వాల్యూ,  లీగ్ కు ఉన్న క్రేజ్,  ఆటగాళ్ల సాలరీ, ఫ్రాంచైజీల  క్రేజ్.. ఇలా ఏ విభాగంలో చూసుకున్నా పీఎస్ఎల్.. ఐపీఎల్ కు పోటీనే కాదనేది క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం.   ఐపీఎల్ లో మీడియా హక్కుల  వేలంలో డిజిటల్ రైట్స్ కు వచ్చినంత  ఉండదు పీఎస్ఎల్ విలువ అని కూడా గతంలో  టీమిండియా ఫ్యాన్స్  కామెంట్స్ చేశారు.  

Latest Videos


తాజాగా  కొచ్చిలో జరిగిన  ఐపీఎల్ వేలంలో   పలువురు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. ఈ జాబితాలో  పీఎస్ఎల్ లో ఆడుతున్న ఆటగాళ్లు కూడా ఉన్నారు.  ఈ నేపథ్యంలో అక్కడ ఆ ఆటగాళ్లకు దక్కుతున్న మొత్తం.. ఇక్కడ దక్కుతున్న దానికి పోల్చి చూస్తే  ఆకాశం, భూమికి మధ్య  ఉన్నంత తేడా ఉందని  తెలుస్తూనే ఉంది.  
 

ఉదాహరణకు  ఐపీఎల్ మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రూ. 13.25 కోట్లను వెచ్చించి  ఇంగ్లాండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్ ను సొంతం చేసుకుంది.   ఇదే బ్రూక్ కు పీఎస్ఎల్ లో లాహోర్ ఖలందర్ తరఫున ఆడితే వచ్చేది  రూ. 82.30 లక్షలు.  

మరో ఇంగ్లాండ్ ఆటగాడు ఫిలిప్ సాల్ట్ ను  ఢిల్లీ క్యాపిటల్స్  రూ. 3 కోట్లకు  దక్కించుకుంది.  ఈ ఇంగ్లీష్ క్రికెటర్ పీఎస్ఎల్ లో కూడా ఆడతాడు.  సాల్ట్ కూడా లాహోర్ తరఫునే ఆడుతున్నాడు.  అతడికి అక్కడ దక్కేది  రూ. 41.33 లక్షలు మాత్రమే. 

బ్రూక్, సాల్ట్ మాదిరిగానే  మరో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్  విల్ జాక్స్ కూడా జాక్ పాట్ కొట్టాడు. పీఎస్ఎల్ లో ఇస్లామాబాద్ యూనైటెడ్ తరఫున ఆడే జాక్స్ కు అక్కడ రూ. 41.15 లక్షలు దక్కుతున్నాయి. ఐపీఎల్ లో అతడు ఆర్సీబీ తరఫున ఆడుబోతున్నాడు. వేలంలో ఇక్కడ  అతడు రూ. 3.20 కోట్లు దక్కించుకున్నాడు.  

దక్షిణాఫ్రికా బ్యాటర్ రిలీ రూసో కూడా పీఎస్ఎల్ లో ఆడుతున్నాడు. ముల్తాన్   సుల్తాన్స్ తరఫున  అక్కడ రూసోకు రూ. 1.40 కోట్లు వస్తుండగా  ఐపీఎల్  లో  రూ. 4.60 కోట్లు దక్కనున్నాయి.   ఇతడితో పాటు నమీబియా ఆటగాడు డేవిడ్ వీస్ కు  పీఎస్ఎల్ లో  రూ. 70.21 లక్షలు దక్కగా ఐపీఎల్ లో   కోటి రూపాయలు దక్కాయి. 

click me!