రాసిపెట్టుకోండి.. వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఓపెనర్ అతడే : బ్రెట్ లీ

First Published Dec 28, 2022, 2:34 PM IST

భారత్ వేదికగా వచ్చే ఏడాది  జరుగబోయే వన్డే ప్రపంచకప్ లో  టీమిండియా తుది జట్టు కూర్పు గురించి   ప్రస్తుతం ప్రణాళికలు సాగుతున్నాయి. ఈ క్రమంలో  భారత్ కు లెక్కకు మిక్కిలి ఆప్షన్లు  ఉన్నాయి. 
 

ఒక్క  భారీ ఇన్నింగ్స్  క్రికెటర్ల కెరీర్ ను ఊహించని మలుపులు తిప్పుతుంది.  ప్రస్తుతం టీమిండియా ఓపెనర్  ఇషాన్ కిషన్ కూడా  అదే టర్నింగ్ పాయింట్ ను ఆస్వాదిస్తున్నాడు. రాక రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సఫలమయ్యాడు ఈ జార్ఖండ్ కుర్రాడు.   

బంగ్లాదేశ్ తో మూడు వన్డేల  సిరీస్ లో భాగంగా ఆఖరి వన్డేలో వచ్చిన అవకాశాన్ని  ఇషాన్ అదరగొట్టాడు.  వన్డే క్రికెట్ చరిత్రలో  అత్యంత తక్కువ బంతులలో డబుల్ సెంచరీ బాదిన క్రికెటర్ గా ఇషాన్ ఘనత అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఇషాన్ 132 బంతులలో  24 ఫోర్లు,  10 భారీ సిక్సర్ల సాయంతో  210 పరుగులు చేశాడు. 

అయితే ఈ ఇన్నింగ్స్ తర్వాత  సెలక్టర్లు ఇషాన్ ను జట్టు నుంచి తప్పించలేని స్థితిని కల్పించాడు.  వన్డే వరల్డ్ కప్ ముందున్న నేపథ్యంలో   ఇషాన్.. రోహిత్ తో కలిసి  ఓపెనర్ గా  బరిలోకి దిగాలని ఇప్పటికే పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో తాజాగా ఆస్ట్రేలియా మాజీ  పేసర్ బ్రెట్ లీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు.  వన్డే వరల్డ్ కప్ లో  టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషనేనని  కుండబద్దలు కొట్టాడు. 

తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా   బ్రెట్ లీ మాట్లాడుతూ.. ‘డబుల్ సెంచరీ తర్వాత  ఇషాన్  2023 లో స్వదేశంలో జరిగే  వన్డే ప్రపంచకప్ లో   టీమిండియాలో ఓపెనింగ్ స్థానానికి పోటీ పడుతున్నానని చెప్పకనే చెప్పాడు.  మరి అతడు ఓపెనర్ గా  వస్తాడా..?    ఏమో మరి నాకైతే  తెలియదు.  మరి ఇది జరిగే విషయమేనా..? అంటే  మాత్రం  కచ్చితంగా  జరగాల్సిందేనని చెప్తాను.  

వన్డే చరిత్రలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన  యువ  క్రికెటర్ గురించి ఏం చెప్పగలం..? ఇషాన్ ఇదే ఫామ్ ను కొనసాగిస్తూ.. ఫిట్ గా ఉంటే మాత్రం  టీమిండియా ఓపెనర్ అతడే.  అయితే ఇషాన్   గర్వాన్ని తలకెక్కించుకోకూడదు. డబుల్ సెంచరీని, తాను సాధించిన రికార్డును గురించి మరిచిపోవాలి.   సాధించాల్సింది చాలా ఉంది కాబట్టి దాని మీద దృష్టి సారించాలి...’ అని తెలిపాడు. 

బంగ్లాదేశ్ తో  చివరి వన్డేలో  ఇషాన్.. డబుల్ సెంచరీ సాధించే క్రమంలో విరాట్ కోహ్లీ అందించిన సహకారం మరిచిపోకూడదని  బ్రెట్ లీ అన్నాడు. ఇద్దరి మధ్య సమన్వయం బాగా కుదిరిందని.. అనుభవజ్ఞుడైన కోహ్లీ మార్గదర్శకత్వంలో  ఇషాన్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు.  ఇషాన్  డబుల్ సెంచరీ చేసినప్పుడు  కోహ్లీ ఆనందం చూసి తనకు ముచ్చటేసిందని అన్నాడు. 

click me!