కొంత ఆట.. కావాల్సినంత అదృష్టం.. ఆశలే లేని పాకిస్తాన్ అవకాశాలతో సెమీస్ చేరిందిలా..!

First Published Nov 6, 2022, 5:06 PM IST

T20 World  Cup 2022: టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అసలు ఆశలే  లేని స్థితి నుంచి ఇప్పుడు ఏకంగా సెమీస్ కు అర్హత సాధించింది.

గతేడాది పొట్టి ప్రపంచకప్‌లో  అద్భుత ప్రదర్శనలతో సెమీస్ చేరిన పాకిస్తాన్ ఈ ఏడాది కూడా ఆ దశకు చేరుకుంటుందని ఎవరూ ఊహించి ఉండరు. భారత్, జింబాబ్వే చేతిలో ఓడినాక ఆ జట్టు పని అయిపోయిందని.. ఇక సెమీస్ చేరడం కలే అని  తేలిపోయింది. టోర్నీ ప్రారంభంలో ఆ జట్టు ఆట కూడా అలాగే ఉంది. 

ఈ మెగా టోర్నీలో భారత జట్టుతో తొలి మ్యాచ్ ఆడిన పాకిస్తాన్.. తొలుత బ్యాటింగ్ చేసి 159 పరుగులకే పరిమితమైంది. ప్రధాన బ్యాటర్లంతా విఫలమైనా ఇఫ్తికార్ అహ్మద్, షాన్ మసూద్ ల పోరాటంతో పాక్ ఆ మాత్రం స్కోరైనా సాధించింది.   కానీ బౌలింగ్ లో పాకిస్తాన్.. భారత్ ను వణికించింది. ఒక దశలో భారత్ స్కోరు 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 31 పరుగులు . కానీ  విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యాల భాగస్వామ్యంతో టీమిండియా ఆ మ్యాచ్ ను గెలుచుకుంది. 

ఈ భారీ షాక్ నుంచి తేలుకోకముందే పాకిస్తాన్ కు మరో ఊహించిన ఎదురుదెబ్బ తాకింది. జింబాబ్వే-పాకిస్తాన్ మ్యాచ్ లో  బాబర్ సేన.. ఒక్క పరుగు తేడాతో  దారుణ ఓటమిని మూటగట్టుకుంది.   దీంతో అసలు ఆ జట్టు  సెమీస్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. 

జింబాబ్వేతో ఓటమి తర్వాత పాకిస్తాన్.. తాను ఆడబోయే మ్యాచ్ లతో పాటు ఇతర జట్ల సమీకరణాల మీద కూడా ఆధారపడాల్సి వచ్చింది.  తర్వాత మ్యాచ్ లో నెదర్లాండ్స్ తో ఆడిన బాబర్ సేన.. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా రాణించి తొలి విజయాన్ని అందుకుంది.   

మూడు రోజుల క్రితం దక్షిణాఫ్రికా తో మ్యాచ్ లో ఆ జట్టుకు అదృష్టం కలిసొచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్..  20 ఓవర్లలో 9 వికెట్లకు 185 పరుగులు చేసింది.  అనంతరం వర్షం వల్ల  మ్యాచ్ ను 14 ఓవర్లకు కుదించారు. సఫారీ టార్గెట్ ను 30 బంతుల్లో 73 పరుగులుగా సెట్ చేశారు. వర్షం రావడానికంటే ముందు మెరుగైన  ఆట ఆడుతున్న సపారీలు భారీ లక్ష్య ఛేదనలో తడబడ్డారు. ఫలితంగా  పాకిస్తాన్.. 33 పరుగుల తేడాతో గెలిచింది. 

ఇక పాకిస్తాన్ దశ తిరిగింది మాత్రం సౌతాఫ్రికా - నెదర్లాండ్స్ మ్యాచ్ తోనే. ఈ మ్యాచ్ లో సఫారీలు దారుణ ఓటమి చెందడంతో ఆ జట్టు సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. దీంతో రాకరాక వచ్చిన అవకాశాన్ని  పాకిస్తాన్ సద్వినియోగం చేసుకుంది. బంగ్లాదేశ్ ను  చిత్తుగా ఓడించి సెమీ ఫైనల్స్ కు దూసుకెళ్లింది.  

సెమీస్ లో పాకిస్తాన్.. ఈనెల 9న న్యూజిలాండ్ తో ఫైనల్ ఆడనున్నారు.  అద్భుతాలు జరుగుతాయంటే ఇదేనేమో..  నవంబర్ 10న  భారత జట్టు ఇంగ్లాండ్ ను  ఎదుర్కోనబోతున్నది. ఈ మ్యాచ్ లో గనక భారత్ గెలిచి.. సెమీస్ లో పాకిస్తాన్ న్యూజిలాండ్ ను ఓడిస్తే  మరోసారి భారత్ - పాక్ మ్యాచ్ చూసే అవకాశముంది. అది కూడా ఫైనల్. అలా జరగాలని ఆశిద్దాం. 

click me!