మూడు రోజుల క్రితం మెల్‌బోర్న్ వేదికగా భారత్-పాకిస్తాన్ మధ్య ముగిసిన ఉత్కంఠ పోరులో టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో బ్యాటర్ గా విఫలమైన పాక్ సారథి బాబర్ ఆజమ్, కెప్టెన్ గా కూడా విఫలమయ్యాడని ఆ దేశానికి చెందిన మాజీ క్రికెటర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అతడు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటే బెటరని సూచిస్తున్నారు.
ఇదే విషయమై పాకిస్తాన్ మాజీ సారథి సలీమ్ మాలిక్ స్పందిస్తూ బాబర్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. సలీమ్ మాట్లాడుతూ.. ‘ఇటువంటి ఒత్తిడితో కూడిన మ్యాచ్ లలో జట్టులో ఉన్న సీనియర్ ప్లేయర్ల సలహాలు తీసుకోవాలి. ఒత్తిడితో కెప్టెన్ సతమతమవుతుంటే సీనియర్లు అతడికి సలహాలిస్తారు. అతడు తప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఆపుతారు.
అందుకే నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే. జట్టులో సీనియర్, జూనియర్ ప్లేయర్లు సమతూకంతో ఉండాలి. బౌలర్లకు సీనియర్ ప్లేయర్లు గైడ్ చేస్తారు. మరీ ముఖ్యంగా ఒత్తిడి ఎక్కువగా ఉండే భారత్ తో మ్యాచ్ లో వారి సలహాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ ప్రస్తుతం జట్టులో సీనియర్ ప్లేయర్లు ఎక్కడున్నారు..? అంతర్జాతీయంగా అత్యంత ఒత్తిడి మధ్య మ్యాచ్ లు ఆడిన అనుభవం వారికి ఉందా..?
పాక్ జట్టుకు బాబర్ చాలాకాలం నుంచి సారథిగా ఉన్నాడు. ఇన్ని రోజులు గడుస్తున్నా అతడు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు. కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి ఇంతకాలమైనా నువ్వు నీ తప్పుల నుంచి ఏమీ నేర్చుకోలదంటే నువ్వు ఆ పోస్టుకు అర్హుడివి కావు. బాబర్ ఆజమ్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం మంచిది. చాలా మంది కెప్టెన్సీని వదిలేశారు. దానిని పట్టుకునే వేలాడలేదు...’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
సలీమ్ మాలిక్ తో పాటు పాక్ మాజీ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ కూడా బాబర్ కెప్టెన్సీపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘బాబర్ ఆజమ్ కెప్టెన్సీ పవిత్రమైన ఆవుతో సమానంగా ఉంది. దానిని (కెప్టెన్సీ) మనం విమర్శించడానికి వీళ్లేదు. బాబర్ కెప్టెన్సీ ఎంత అధ్వాన్నంగా ఉందనేది ఈ మ్యాచ్ ద్వారా మరోసారి స్పష్టమైంది. బాబర్ కెప్టెన్సీని విమర్శిస్తే అతడు ఇంకా నేర్చుకునే దశలో ఉన్నాడని, 32 ఏండ్లు వచ్చాక నేర్చుకుంటాడని సమాధానాలు వినిపిస్తున్నాయి.
భారత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 7 నుంచి 11 ఓవర్ వరకు ఆ జట్టు పరుగులు చేయడానికే ఇబ్బంది పడింది. ఓవర్ కు కనీసం నాలుగు పరుగులు కూడా రాలేదు. మరి బాబర్ తన స్పిన్నర్లతో అప్పుడే నాలుగు ఓవర్ల కోటాను ఎందుకు పూర్తి చేయలేదు..?’ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.