MS Dhoni: నేను మ్యాథ్స్ లో వీక్.. మేం అక్కడికి వెళ్లకుంటే ప్రపంచమేమీ ఆగిపోదు కదా.. మహేంద్రుడి అసహనం

First Published May 9, 2022, 11:39 AM IST

TATA IPL 2022: ఐపీఎల్ లో తొలి అర్థభాగంలో అట్టర్ ఫ్లాఫ్ అయి తర్వాత పుంజుకుంటున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం రాత్రి  ఢిల్లీ క్యాపిటల్స్ కు షాకిచ్చింది.  ఢిల్లీపై గెలిచినా సీఎస్కే ప్లేఆఫ్స్ కు వెళ్లడం కష్టమే.. 

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ ఆశలను మరింత కఠినతరం చేస్తూ ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. 91 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసిన సీఎస్కే.. ప్లేఆఫ్స్ ఆశలను నిలుపుకుంది.  

అయితే ఢిల్లీతో పాటు మిగతా మూడు మ్యాచుల్లో గెలిచినా సీఎస్కే ప్లేఆఫ్స్ కు వెళ్లడం అసంభవం. ఇదిలాఉండగా తమ జట్టు ప్లేఆఫ్స్ అవకాశాలు, జట్టు ప్రదర్శన, ఇతర జట్లపై తమ విజయావకాశాల ప్రభావం వంటి విషయాలపై సీఎస్కే సారథి ధోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

Latest Videos


ఆదివారం సీఎస్కేతో మ్యాచ్ అనంతరం ధోని మాట్లాడుతూ.. ‘మేము ఇలాంటి విజయాలు  కాస్త ముందే సాధించి ఉంటే భాగుండేది.  ఇప్పటికైనా గెలుస్తున్నందుకు సంతోషంగా ఉంది.

ఒకవేళ మేము ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ కు వెళ్తే అది చాలా గొప్ప విషయం. మేం వెళ్లకున్నా బాధలేదు. సీఎస్కే ప్లేఆఫ్స్ కు వెళ్లకుంటే ప్రపంచమేమీ ఆగిపోదు కదా. ఇవన్నీ ఆటలో భాగం..’ అని ధోని చెప్పాడు. 

తనకు ఈ నెట్ రన్ రేట్, గణాంకాలు, ఇతర లెక్కల (ప్లేఆఫ్స్ కు చేరడానికి) మీద పెద్దగా ఆసక్తి లేదని..  తాము తర్వాత ఆడబోయే మ్యాచుల మీదే ఎప్పుడూ తన దృష్టి ఉంటుందని ధోని చెప్పుకొచ్చాడు. 

‘నేను చిన్నప్పట్నుంచీ గణితానికి పెద్ద అభిమానిని కాను.  బడిలో కూడా నాకు మ్యాథ్స్ లో ఏదో అరకొర మార్కులే వచ్చేవి. నెట్ రన్ రేట్ గురించి ఆలోచించడం వృథా ప్రయాస. మేము ఐపీఎల్ ను ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాం... 

మాకు ముందు ఎవరాడుతున్నారు. వాళ్ల విజయాలు మా జట్టు మీద ఎలా ప్రభావం చూపుతాయి.  ఎవరు ఓడితే మేము ప్లేఆఫ్స్  కు వెళ్తాం..? ఈ విషయాలన్నీ నేను  పట్టించుకోను. మాకు సంబంధం లేని రెండు ఇతర జట్లు ఆడుతుంటే  వాటి గురించి ఆలోచించే కంటే మా తదుపరి ఆట మీద దృష్టి పెట్టడమే మాకు ముఖ్యం..’ అని కుండబద్దలు కొట్టాడు. 

ప్రస్తుతం ఐపీఎల్ పాయింట్ల పట్టికలో 11 మ్యాచులాడి  4 విజయాలు, 7 ఓటములతో 8 పాయింట్లు సాధించిన సీఎస్కే.. నెట్ రన్ రేట్ (+0.028)  కూడా ఇతర జట్లతో పోల్చితే తక్కువగా ఉంది. ఈ సీజన్ లో ఆ జట్టు మరో మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది.  ఆ మూడు గెలిచినా.. నెట్ రన్ రేట్ పెంచుకున్నా సీఎస్కే ప్లేఆఫ్స్ చేరాలంటే ఏదో అద్భుతం జరగాల్సిందే.

ప్రస్తుతానికైతే ఆ అద్భుతం జరిగే అవకాశం కూడా లేదు. మొదటి మూడు స్థానాల్లో (గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాజస్తాన్ రాయల్స్) ఉన్న జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకున్నాయి. ఇక మిగిలింది నాలుగో స్థానంలోనే పోటీ. దాని కోసం ఆర్సీబీ.. ముందువరుసలో ఉండగా.. ఢిల్లీ, ఎస్ఆర్హెచ్, పంజాబ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

click me!