ఆ ఇద్దరి కథ ముగిసింది..! ఇక యువకులకే ఛాన్స్ ఇవ్వాలి : రోహిత్, కోహ్లీలపై రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్

First Published | May 15, 2023, 6:41 PM IST

గడిచిన  దశాబ్దంన్నర కాలంగా భారత క్రికెట్ బ్యాటింగ్ కు వెన్నెముకగా ఉన్న  టీమిండియా తాజా మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు  చేశాడు. 

Image credit: Getty

టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి  భారత జట్టు  స్టార్ బ్యాటర్లు  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక వాళ్లిద్దరి  టీ20 కెరీర్ ముగిసినట్టేనని చెప్పకనే చెప్పాడు.  వచ్చే ఏడాది  యూఎస్ఎ, వెస్టిండీస్  వేదికగా జరుగబోయే  టీ20 ప్రపంచకప్ లో ఈ ఇద్దరూ కాకుండా  యువకులకే అవకాశమివ్వాలని ఆయన  సూచించాడు. 

Image credit: PTI

కెరీర్ చరమాంకంలో ఉన్న కోహ్లీ, రోహిత్ లు  2007 టీ20 వరల్డ్ కప్ లో   భారత స్టార్  ఆటగాళ్లుగా ఉన్న సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్  ల మాదిరిగా వ్యవహరించాలని  శాస్త్రి తెలిపాడు.   గతేడాది టీ20 వరల్డ్ కప్ లో విఫలమైన రోహిత్.. ఐపీఎల్ లో కూడా  పేలవ ప్రదర్శనలతో జట్టుకు భారంగా మారుతున్నాడు.  కాస్తో కూస్తో రాణిస్తున్నా  కోహ్లీ   స్ట్రైక్ రేట్ దారుణంగా ఉంది. 


ఈ నేపథ్యంలో  రవిశాస్త్రి ఈఎస్పీఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం విరాట్, రోహిత్  2007 టీ20 వరల్డ్ కప్ నకు ముందు  సచిన్, ద్రావిడ్, లక్ష్మణ్  ల స్థానంలో ఉన్నారు.  ఒకవేళ   వారిద్దరూ  టీ20ల నుంచి  స్వయంగా తప్పుకోకుంటే అప్పుడు వాళ్ల ఫామ్ ను నిరూపించుకోవాలి.  అందుకు ఒక సంవత్సరం టైమ్ ఉంది. 

వరల్డ్ కప్ (2024)  కు మీరు బెస్ట్ ఆటగాళ్లను ఎంపిక చేయాలి.  అయితే ఆ టీమ్ లో అనుభవజ్ఞులు కూడా ఉండాలి.విరాట్, రోహిత్ లు ఆల్రెడీ  ఆటలో దిగ్గజాలుగా ఉన్నారు. వాళ్లు కొత్తగా ప్రూవ్ చేసుకోవడానికి ఏమీ లేదు.  కానీ  టీ20 లో యువ రక్తం నింపాలి.   ఆ ఇద్దరూ కూడా ఆ మేరకు  యువకులకు ఛాన్స్ ఇస్తూ  టీ20  నుంచి తప్పుకుంటే వన్డేలు, టెస్టులకు ఫ్రెష్ గా ఉండొచ్చు... 

ఈ ఐపీఎల్ లో సీజన్ లో కొంతమంది యువ ఆటగాళ్లు అంచనాలకు మించి రాణిస్తున్నారు.    వారిలో ఆత్మ విశ్వాసం మెండుగా ఉంది.   ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాత వచ్చే ద్వైపాక్షిక సిరీస్ లలో ఈ యువ ఆటగాళ్లను  ఎంపిక చేసి వారిని పరీక్షించాలి. వచ్చే వరల్డ్ కప్ నాటికి వారిని సిద్ధం చేయాలి..’ అని శాస్త్రి తెలిపాడు. 

ఈ సీజన్ లో తిలక్ వర్మ, రింకూ సింగ్, యశస్వి జైస్వాల్, జితేశ్ శర్మ వంటి యువకులు   అద్భుతమైన ప్రదర్శనలతో   ఆకట్టుకుంటున్నారు. వీరిని  భారత జట్టులోకి ఎంపిక చేయాలని, సీనియర్లు తప్పుకుంటేనే ఇది సాధ్యమవుతుందన్న వాదనలు చాలా కాలంగా వినబడుతున్నాయి. 

Latest Videos

click me!