ఒక్క సెంచరీ చేస్తే మరే భారత బ్యాటర్‌కు దక్కని అరుదైన ఘనత హిట్‌మ్యాన్ సొంతం.. కోహ్లీ వల్ల కూడా కాలేదు..

First Published Feb 6, 2023, 6:37 PM IST

Border Gavaskar Trophy: భారత క్రికెట్ అభిమానులకు   బోర్డర్- గవాస్కర్ ఫీవర్ పట్టింది. ఈ నెల 9 నుంచి మొదలుకాబోయే ఈ మెగా సిరీస్ లో  రాణించేందుకు  ఇరు జట్లూ తమ ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయి.  ఈ క్రమంలో   టీమిండియా సారథి రోహిత్ శర్మ  అరుదైన ఘనత సాధించేందుకు ఒక్క సెంచరీ దూరంలో నిలిచాడు. 

టీమిండియా సారథి రోహిత్ శర్మ  త్వరలో అరుదైన ఘనత సాధించేందుకు  సెంచరీ  దూరంలో నిలిచాడు.  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా  ఆసీస్ తో  రాబోయే నాలుగు టెస్టులలో ఒక్క  ఇన్నింగ్స్ లో అయినా  రోహిత్ శర్మ సెంచరీ చేస్తే  అతడు  భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలోనూ  సెంచరీ చేసిన క్రికెటర్ గా నిలుస్తాడు.  భారత్ నుంచి ఇంతవరకు ఏ ఒక్క కెప్టెన్ కూడా ఈ రికార్డు సాధించలేదు.   

కెప్టెన్ అయ్యాక రోహిత్..  సుమారు రెండున్నరేండ్ల తర్వాత  వన్డేలలో  ఇటీవలే న్యూజిలాండ్ మీద  సెంచరీ చేశాడు.    2020లో చివరిసారి సెంచరీ చేసిన  హిట్‌మ్యాన్.. ఆ తర్వాత  ఎక్కువగా టీ20లకే పరిమితమయ్యాడు. మధ్యలో  కరోనా,  గాయాలా కారణంగా చాలా మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు.  

టీ20లలో  కూడా రోహిత్ కు నాలుగు సెంచరీలున్నాయి.   రోహిత్.. 2021లో విరాట్ కోహ్లీ   తప్పుకున్నాక  అధికారికంగా సారథ్య బాధ్యతలు తీసుకున్నా  కోహ్లీ గైర్హాజరీలో పలు మ్యాచ్ లకు సారథిగా వ్యవహరించాడు.  పొట్టి ఫార్మాట్ లో  హిట్ మ్యాన్ నాలుగు సెంచరీలు చేయగా అందులో రెండు సార్లు అతడు   తాత్కాలిక కెప్టెన్ గా ఉన్నప్పుడు చేసినవే కావడం గమనార్హం.  

పూర్తిస్థాయి సారథిగా కాకముందు రోహిత్..   2017లో  శ్రీలంకతో  జరిగిన టీ20లో  కెప్టెన్ గా  ఉన్నాడు. ఈ మ్యాచ్ లో అతడు  43 బంతుల్లోనే  118 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 10 భారీ సిక్సర్లున్నాయి.  అనంతరం  వెస్టిండీస్ తో 2018లో ఓ  మ్యాచ్ లో సారథిగా ఉండి.. 61 బంతుల్లో  111 పరుగులు సాధించాడు.  

టెస్టులలో కూడా  రోహిత్ .. 8 సెంచరీలు చేశాడు. కానీ అవన్నీ బ్యాటర్ గానే.  మరి రాబోయే  నాలుగు టెస్టుల సిరీస్ లో   ఒక్క  సెంచరీ చేసినా  అన్ని ఫార్మాట్ లలో  కెప్టెన్ గా సెంచరీలు చేసిన  తొలి భారత సారథిగా  రోహిత్ రికార్డులకెక్కుతాడు. మరి  హిట్ మ్యాన్ ఈ రికార్డును సాధిస్తాడా..? లేదా..? అనేది త్వరలోనే తేలనుంది. భారత్ లో విరాట్ కోహ్లీ.. కెప్టెన్ గా  వన్డే, టెస్టులలో సెంచరీలు చేశాడు. టీ20లలో కూడా గతేడాది సెంచరీ చేసినా  అప్పటికీ కోహ్లీ సారథిగా లేడు. 

అంతర్జాతీయ క్రికెట్ లో ఈ ఘనత  ముగ్గురు ఆటగాళ్ల పేరిట ఉంది. శ్రీలంక   సారథి తిలకరత్నే దిల్షాన్.. సారథిగా మూడు ఫార్మాట్లలో  సెంచరీలు చేసిన తొలి కెప్టెన్.  దిల్షాన్ కెప్టెన్ గా టెస్టులలో ఇంగ్లాండ్, వన్డేలలో   జింబాబ్వే,  టీ20లలో ఆస్ట్రేలియాపై  సెంచరీలు బాదాడు. 

ఆ తర్వాత  సౌతాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ పేరిట ఈ రికార్డు ఉంది.  డుప్లెసిస్.. కెప్టెన్ గా టెస్టులలో న్యూజిలాండ్, వన్డేలలో  ఆస్ట్రేలియా, టీ20లలో వెస్టిండీస్ మీద సెంచరీలు సాధించాడు. 

ఈ జాబితాలో  పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్ కూడా  ఉన్నాడు. బాబర్ సారథిగా   గతేడాది ఆస్ట్రేలియాపై, వన్డేలలో జింబాబ్వేపై టీ20లలో  సౌతాఫ్రికాపై శతకాలు  చేశాడు.  ఒకవేళ  రాబోయే టెస్టు సిరీస్ లో గనక రోహిత్  సెంచరీ చేస్తే  హిట్‌మ్యాన్ వీరి సరసన చేరతాడు. 

click me!