రోహిత్ ను తొలగించే ఛాన్సే లేదు.. కానీ హిట్ మ్యాన్ లేకుంటే అతడే.. రాహుల్, పంత్ కు చెక్ పెట్టిన గుజరాత్ కెప్టెన్

First Published Jun 28, 2022, 3:45 PM IST

Hardik Pandya: టీమిండియాకు మూడు ఫార్మాట్లకు సారథ్యం వహిస్తున్న రోహిత్ శర్మకు  టీ20 లలో కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఆ స్థానంలో మరో ఆటగాడిపై దృష్టి సారించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలపై గత కొంతకాలంగా ఎన్నడూ లేనంత చర్చ జోరుగా సాగుతున్నది. పనిభారం, ఒత్తిడి తగ్గించేందుకు గాను  పొట్టి ఫార్మాట్ పగ్గాలను మరో ఆటగాడికి అప్పగించాలని గత కొంతకాలంగా క్రికెట్ పండితులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. 

Rohit Sharma

తాజాగా  భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో దీనిమీద బీసీసీఐ సెలక్టర్లు వివరణ ఇచ్చుకున్నారు. రోహిత్ శర్మను ఇప్పటికిప్పుడు టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పించేది లేదని స్పష్టం చేశారు. 

ఇదే విషయమై బీసీసీఐ సెలక్టర్ ఒకరు మాట్లాడుతూ.. ‘ఇప్పటికైతే రోహిత్ శర్మను రిప్లేస్ చేసే అవకాశమే లేదు. కానీ అదే సమయంలో అతడిపై పనిభారాన్ని తగ్గించడం ఉత్తమం. అది అతడి మానసిక సమస్యలపై కూడా ప్రభావం చూపే అంశం గనక దీనిపై కూడా మేం ఆలోచిస్తున్నాం. 

అయితే  వరుస పర్యటనలు ఉండి  తీరిక లేని క్రికెట్ ఆడాల్సి వచ్చినప్పుడు మాత్రం  అతడికి విశ్రాంతినిచ్చి  ఆ స్థానంలో హార్థిక్ పాండ్యా ను నియమించాలని మేం అనుకుంటున్నాం. టెస్టుల విషయంలో అయితే అతడి పేరు మా ప్రణాళికల్లో లేదు...’ అని పేర్కొన్నాడు. 

రోహిత్ కు పనిభారాన్ని తగ్గించేందుకని ఇటీవలే ముగిసిన దక్షిణాఫ్రికా సిరీస్ లో  కెఎల్ రాహుల్ కు ఆ పగ్గాలను అప్పజెప్పగా తొలి టీ20కి కొద్దిగంటల ముందు అతడు గాయపడటంతో ఆ బాధ్యతలను  రిషభ్ పంత్ మోశాడు.

రోహిత్ శర్మ తర్వాత ఎవరు..? అన్న చర్చ ఉత్పన్నమైనప్పుడు టీమిండియా అభిమానులు టక్కున వీరిద్దరి పేర్లే చెప్పేవాళ్లు. కానీ ఐపీఎల్-15 లో గుజరాత్ టైటాన్స్ ను విజేతగా నిలపడం.. ఆ సీజన్ లో కెప్టెన్ గానే కాక ఆటగాడిగా కూడా రాణించడంతో హార్థిక్ పాండ్యాపై సెలక్టర్ల దృష్టి పడింది. రోహిత్ లేని సమయంలో రాహుల్, రిషభ్ ల కంటే పాండ్యా నే బెస్ట్ ఆప్షన్ అని భావిస్తున్నారు. 

రాహుల్, రిషభ్ లతో పోలిస్తే అనుభవం గడించిన  పాండ్యా.. ధోనిలా కూల్ కెప్టెన్ అని పేరు తెచ్చుకున్నాడు. ఐపీఎల్ లో అతడు గుజరాత్ టైటాన్స్ ను నడిపిన విధానం అందరినీ ఆకట్టుకుంది.  

ఐర్లాండ్ టూర్ లో కూడా దాదాపు రెండో స్థాయి భారత జట్టుతో బరిలోకి దిగినా తొలి మ్యాచ్ లో అపూర్వ విజయాన్ని అందించి కెప్టెన్సీ  రేసులో తాను కూడా ఉన్నానని సెలక్టర్లకు గుర్తు చేశాడు. ఈ సిరీస్ తో పాటు రాబోయే సిరీస్ లలో కూడా పాండ్యా ఇదే విధంగా చెలరేగితే ఇక రిషభ్, రాహుల్ లకు చెక్ పెట్టినట్టే. 

click me!