నేను అలాంటోన్ని అయితే నిన్ను టీమ్‌లో ఎందుకు పెట్టుకుంటా..? అక్రమ్ కామెంట్స్‌పై మాలిక్ కౌంటర్

First Published Nov 29, 2022, 1:34 PM IST

పాకిస్తాన్ వెటరన్ పేసర్ వసీం అక్రమ్ తను పుస్తకం ‘సుల్తాన్ : ఎ మెమోయిర్’లో వెల్లడిస్తున్న  షాకింగ్ విషయాలపై పాక్ క్రికెట్ లో  జోరుగా చర్చ నడుస్తున్నది. తాజాగా  అక్రమ్.. మాజీ సారథి సలీమ్ మాలిక్ పై చేసిన వ్యాఖ్యలకు అతడు కౌంటర్ ఇచ్చాడు. 
 

పాకిస్తాన్  మాజీ సారథి, దిగ్గజ బౌలర్  వసీం అక్రమ్ తన పుస్తకం ‘సుల్తాన్ : ఎ మెమోయిర్’లో షాకుల మీద షాకులిస్తున్నాడు. రోజుకో హాట్ కామెంట్ తో తన పుస్తకంపై  విపరీతమైన క్రేజ్ తీసుకొస్తున్నాడు. తాజాగా అక్రమ్.. పాకిస్తాన్ మాజీ సారథి సలీమ్ మాలిక్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 

అక్రమ్ తన పుస్తకంలో..  సలీమ్ మాలిక్ తనను ఓ పనోడిలా  ఉపయోగించుకున్నాడని అప్పుడు తనకు  చాలా కోపంగా ఉండేదని  పుస్తకంలో పేర్కొన్నాడు.  ‘తన కంటే రెండేండ్లు జూనియర్ అయినందుకు అతడు ఆ అడ్వంటేజీని తీసుకునేవాడు. నాతో ఎప్పుడూ నెగిటివ్ గా ఉండేవాడు.  స్వార్థపరుడు. 

ఎప్పుడూ  నన్ను తనకు ఓ పనోడిలా భావించేవాడు. తనకు మసాజ్ చేయమని అడిగేవాడు. తన మాసిన బట్టలు,  బూట్లను ఉతకమనేవాడు. అప్పుడు నాకు చాలా కోపం వచ్చేది..’ అని రాసుకొచ్చాడు. ఈ ఇద్దరూ కలిసి చాలాకాలం పాటు పాకిస్తాన్ క్రికెట్  లో భాగమైన విషయం తెలిసిందే.. ఇమ్రాన్ ఖాన్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాక పాకిస్తాన్  సారథిగా సలీమ్ మాలిక్ ఎంపికయ్యాడు.  1992 నుంచి 1995 వరకు అక్రమ్.. మాలిక్ సారథ్యంలోనే ఆడాడు. 

తాజాగా  మాలిక్  అక్రమ్ కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఒకవేళ తాను అంత సెల్ఫిష్ అయ్యుంటే అక్రమ్ కు  తన జట్టులో చోటు ఎందుకిస్తానని.. అసలు లాండ్రీ మిషన్ ఉండగా అక్రమ్ బట్టలు ఉతకాల్సిన పనేముందని  అన్నాడు. 

మాలిక్ మాట్లాడుతూ.. ‘అక్రమ్ చేసిన కామెంట్స్ పై నేను అతడితో మాట్లాడదామని ఫోన్ చేశాను. కానీ నా ఫోన్ ఎత్తలేదు. పాకిస్తాన్ జట్టు తరఫున మేం విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ వాషింగ్ మిషన్స్ ఉండేవి. మేం మా చేతులతో ఉతికే అవసరమే రాలేదు. మరి  అక్రమ్ నా బట్టలు ఎప్పుడు ఉతికాడు..? 
 

మరి  నేను నిజంగా సెల్ఫిష్ అయ్యుంటే నా సారథ్యంలోనే కదా అతడు  ఆడింది. తన తొలి మ్యాచ్ ను కూడా నా నాయకత్వంలోనే  ఆడాడు.  నేను నిజంగా స్వార్థపరుడిని అయితే అక్రమ్ కు బౌలింగ్ ఎందుకిస్తా..? బట్టలు ఉతకడం,  మసాజ్ చేయడం వంటి పనికిమాలిన కామెంట్స్ చేసి అక్రమ్ తనను తానే తక్కువ చేసుకున్నాడు.  అక్రమ్ తన  పుస్తకంలో ఏ సెన్స్ లో  ఈ  రాతలు రాసుుకొచ్చాడో  అతడికే తెలియాలి..’ అని  కౌంటర్ ఇచ్చాడు. 
 

గతంలో  మాలిక్ ఓ ఇంటర్వ్యూలో  తాను సారథిగా ఉన్నప్పుడు అక్రమ్, వకార్ యూనిస్ లు తనతో మాట్లాడకపోయేవారని వ్యాఖ్యానించాడు.  ‘నేను కెప్టెన్ గా ఉన్నప్పుడు  అక్రమ్ కు బాల్ ఇవ్వడానికి వెళ్తే అతడు నా  చేతుల నుంచి బాల్ ను లాక్కునేవాడు. అక్రమ్, వకార్ లు నాతో మాట్లాడేవాళ్లు కాదు..’ అని  గతంలో వివరించాడు. తాజాగా అక్రమ్ చేసిన  కామెంట్స్.. వీళ్లిద్దరి మధ్య విభేదాలు నిజమేనని తేల్చాయి. 

click me!