ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ లో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడి సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాకిస్తాన్ జట్టు పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ టోర్నీలో అన్నింటికంటే ముఖ్యంగా పాకిస్తాన్ జట్టు సెలక్షన్ పై మాజీలు పెదవి విరుస్తున్నారు.
తాజాగా ఇదే విషయమై పాక్ మాజీ పేసర్ వహాబ్ రియాజ్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే జట్టుపై నేరుగా విమర్శలు చేయకుండా టీమిండియా సెలక్షన్ తో పోల్చి పీసీబీకి కౌంటర్ ఇచ్చాడు. ఈ సందర్భంగా రియాజ్.. టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ప్రస్తావన తీసుకొచ్చాడు.
రియాజ్ మాట్లాడుతూ.. ‘మీ సిస్టమ్ (జట్టు మేనేజ్మెంట్ ను ఉద్దేశిస్తూ) స్ట్రాంగ్ గా ఉంటే మిమ్మల్ని ఎవరూ ఏమీ అనరు. సెలక్షన్ ప్రాసెస్ బాగుంటే ఎందుకు అందరూ మీపై విమర్శలు చేస్తారు. ఉదాహరణకు మీరు షోయభ్ అక్తర్, మహ్మద్ అమీర , ఉమర్ గుల్, సోహైల్ తన్వీర్.. ఎవరైనా కావొచ్చు జట్టులోకి తీసుకోవడానికి వారికుంటే కొలమానం దేశవాళీ అయితే వాళ్లు అక్కడ ఎలా ఆడుతున్నారో చూడాలి.
వాళ్లు సరిగా ఆడితే జట్టులోకి ఎంపిక చేయాలి. లేకుంటే వదిలేయాలి. ఇందుకు నేను మీకు మంచి ఉదాహరణ చెబుతా. టీమిండియానే తీసుకోండి. మహేంద్ర సింగ్ ధోని తర్వాత ఆ జట్టులో రిషభ్ పంత్ రెగ్యులర్ వికెట్ కీపర్ గా ఉన్నాడు.
అతడికి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలలో సెంచరీలు చేసిన ఘనత ఉంది. ఒకవేళ అతడు పాకిస్తాన్ లో ఉంటే ప్రపంచకప్ టోర్నీలో అతడు బెంచ్ కే పరిమితమవుతాడా..? అసలు అలాంటి అవకాశమే లేదు. కానీ టీమిండియా మాత్రం అలా కాదు. పంత్ ను కూడా బెంచ్ లో కూర్చొబెట్టింది.
దినేశ్ కార్తీక్ కోసం టీమిండియా పంత్ ను పక్కనబెట్టింది. వాళ్లకు పంత్ మంచి క్రికెటర్ అని తెలిసి కూడా అతడిని బెంచ్ కే పరిమితం చేసింది. ఎందుకంటే వాళ్లకు ఫినిషర్ కావాలి. వాళ్ల కమిట్మెంట్ అలా ఉంది..’ అని అన్నాడు.
టీ20 ప్రపంచకప్ ఆడే టీమిండియాకు ఎంపిక చేసిన 15 మంది సభ్యులలో దినేశ్ కార్తీక్ తో పాటు రిషభ్ పంత్ కూడా ఉన్నాడు. కానీ పాకిస్తాన్, నెదర్లాండ్స్ తో మ్యాచ్ లలో పంత్ బెంచ్ కే పరిమితమయ్యాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో పెర్త్ వేదికగా ఆడుతున్న మ్యాచ్ లో కూడా పంత్ తుది జట్టులో లేడు.