కోహ్లి 30 కొడితే వంద కొట్టినట్టే.. అచ్చొచ్చిన మైదానంలో ఫామ్ అందుకుంటాడన్న ఇంగ్లాండ్ మాజీ సారథి

First Published Jul 1, 2022, 3:29 PM IST

ENG vs IND: ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లి తిరిగి తన పూర్వపు ఫామ్ ను అందుకుంటాడని.. చాలాకాలంగా అతడితో పాటు కోహ్లి అభిమానులు ఎదురుచూస్తున్న కోరిక తీరనుందని అంటున్నాడు ఇంగ్లాండ్ మాజీ సారథి.. 
 

సుమారు మూడేండ్లుగా శతక కరువులో ఉన్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి ఇంగ్లాండ్  తో జరుగుతున్న ఎడ్జబాస్టన్ టెస్టులో  దానిని తీర్చుకుంటాడని ఆ జట్టు మాజీ  కెప్టెన్ మైఖేల్ వాన్  జోస్యం చెప్పాడు. ఈ టెస్టు ద్వారా కోహ్లి మళ్లీ  పూర్వపు ఫామ్ అందుకుంటాడని తెలిపాడు.
 

ఎడ్జబాస్టన్ టెస్టుకు ముందు వాన్ క్రిక్ బజ్ తో మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లి ఆటను కచ్చితంగా చూసి తీరాలి. కొద్దిరోజులు వెనక్కి వెళ్తే కోహ్లి  బ్యాటింగ్ విధ్వంసం ఎలా ఉండేదో అందరికీ తెలుసు. ఇదే ఎడ్జబాస్టన్ టెస్టులో అతడు గతంలో జరిగిన ఓ టెస్టులో సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ చేశాడు. 

Michael Vaughan

అతడిప్పుడు భారీ ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. ఈ టెస్టులో అతడు 30 పరుగులు చేసినా చాలు.. వంద పరుగులు చేయడానికి బాటలు వేసుకున్నట్టే. ఒకసారి క్రీజులో సెట్ అయితే ఇక కోహ్లిని ఆపడం కష్టం. సెంచరీ కోసం కోహ్లి కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు..’ అని చెప్పాడు. 

కాగా 2018 లో ఎడ్జబాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన ఓ టెస్టు లో కోహ్లి తొలి  ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ కూడా సాధించాడు. కానీ ఆ టెస్టులో భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. 

ఇక 2019 ఆగస్టులో బంగ్లాదేశ్ తో ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన టెస్టులో సెంచరీ తర్వాత అతడు మళ్లీ  సెంచరీ చేయలేదు. మూడేండ్లుగా సెంచరీ కోసం ఎదురుచూస్తున్న  కోహ్లి  ఎడ్జబాస్టన్ టెస్టులో అయినా ఆ ముచ్చట తీర్చుకుంటాడో లేదో చూడాలి మరి.. 
 

ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఈ టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ గైర్హాజరీలో జస్ప్రీత్ బుమ్రా  ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో శుభమన్ గిల్, ఛటేశ్వర్ పుజారా లు ఓపెనింగ్ జోడీగా బరిలోకి దిగారు. 

click me!