ఇయాన్ మోర్గాన్‌ బాటలో మనవాళ్లు నడిస్తేనా... సరిగ్గా ఆడలేకపోతే రిటైర్ అవ్వాలంటే ఎంతమంది...

First Published Jun 27, 2022, 5:20 PM IST

క్రికెట్‌కి పుట్టినిల్లు అయినా ఒక్క వన్డే వరల్డ్ కప్ గెలవలేకపోయిందనే అపవాదును ఇంగ్లాండ్ నుంచి దూరం చేసిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. భారీ అంచనాలతో 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో అడుగుపెట్టిన ఇంగ్లాండ్, అంచనాలకు మించి రాణించి ప్రపంచ కప్ గెలిచింది...

Eoin Morgan

బెన్ స్టోక్స్ ఓవర్ త్రోకి ఆరు పరుగులు ఇవ్వడం, అంపైర్ల తప్పుడు నిర్ణయాలు... ఇలా ఛీటింగ్ చేశారని ఎన్ని ఆరోపణలు ఎదుర్కొన్నా క్రికెట్ ప్రపంచ చరిత్రలోనే  సూపర్ ఓవర్ థ్రిల్లర్ ఫైనల్ మ్యాచ్‌ని చూసే అవకాశం 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో కలిగింది...

Eoin Morgan

2015లో పరిమిత ఓవర్ల కెప్టెన్సీ తీసుకున్న ఇయాన్ మోర్గాన్, 2019లో ఇంగ్లాండ్‌కి వన్డే వరల్డ్ కప్ అందించాడు. మోర్గాన్ కెప్టెన్సీలోనే 2021 టీ20 వరల్డ్ కప్ ఆడిన ఇంగ్లాండ్ జట్టు, టేబుల్ టాపర్‌గా నిలిచినా... సెమీస్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది...

Latest Videos


విజయాలు వస్తూనే రెండున్నరేళ్లుగా సరిగ్గా పరుగులు చేయలేకపోతున్నాడు ఇయాన్ మోర్గాన్.  ఐపీఎల్ 2021 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన కేకేఆర్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన ఇయాన్ మోర్గాన్, సీజన్ మొత్తంలో 17 మ్యాచులాడి 133 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

ఇండియా, న్యూజిలాండ్ వంటి టాప్ టీమ్స్‌పై పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుంటే ఏమో అనుకోవచ్చు కానీ నెదర్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రెండు వన్డేల్లోనూ డకౌట్ అయ్యాడు ఇయాన్ మోర్గాన్. అదీకాకుండా గాయాలతో సతమవుతున్న మోర్గాన్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి...

పరుగులు రావడం లేదని రిటైర్మెంట్ తీసుకోవాలంటే టీమిండియా తరుపున ఇప్పుడు ఆడుతున్న వారిలో సగం మంది ఎప్పుడో క్రికెట్ నుంచి తప్పుకునేవారని అంటున్నారు అభిమానులు...

విరాట్ కోహ్లీ రెండున్నరేళ్లుగా సెంచరీ మార్కు అందుకోలేకపోతున్నాడు. అయితే విరాట్ బ్యాటు నుంచి పరుగులు మాత్రం వస్తూనే ఉన్నాయి. ఐపీఎల్ 2022 సీజన్‌లో విరాట్ కోహ్లీ 340+ పరుగులు చేశాడు...

కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలు బాదిన రోహిత్ శర్మ, ఆ తర్వాత అర్ధశతకం చేయలేకపోతున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో ఒక్క హాఫ్ సెంచరీ చేయలేకపోయాడు రోహిత్..

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు టీమిండియా మాజీ క్రికెటర్లు ఎమ్మెస్ ధోనీ, యువరాజ్ సింగ్, సురేష్ రైనా, వీరేంద్ర సెహ్వాగ్ వంటి ప్లేయర్లు ఒకానొక సమయంలో పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడ్డారు... ఫామ్ కోల్పోయినా ధోనీ, టెండూల్కర్ వంటి ప్లేయర్లు జట్టులో సుదీర్ఘ కాలం కొనసాగారు...

వీళ్లందరికీ తోపు ఎవరైనా ఉన్నారంటే అది భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. 2003 వన్డే వరల్డ్ కప్ తర్వాత టీమ్‌ కెప్టెన్‌గా విజయాలు అందుకుంటున్నా, బ్యాటుతో అట్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చాడు గంగూలీ. అప్పట్లో టూ మినిట్స్ మ్యాగీ బ్యాటింగ్ అంటూ గంగూలీని ట్రోల్ కూడా చేశారు అభిమానులు... 

అయినా తన బ్యాటింగ్‌ని మార్చుకోవడానికి, టెక్నిక్‌ని మెరుగుపర్చుకోవడానికి పెద్ద ఆసక్తి చూపించని గంగూలీ, హెడ్ కోచ్‌గా గ్రెగ్ ఛాపెల్ ఎంట్రీతో కెప్టెన్సీ కోల్పోయి, జట్టులో చోటు కోల్పోవాల్సి వచ్చింది...  అలాంటి వారితో పోలిస్తే తనను తప్పించకముందే, తానే తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్న ఇయాన్ మోర్గాన్ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. 

టాలీవుడ్ దివంగత నటుడు శోభన్ బాబు చెప్పినట్టు ‘పరుగు ఆపడం ఓ కళ’ అయితే, అది బాగా తెలిసిన వారిలో ఇంగ్లాండ్ వైట్ బాల్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ ఒకడని ఒప్పుకుని తీరాల్సిందే. 

click me!