అప్పుడే క్రికెట్ వదిలేద్దామనుకున్నా... లేదంటే పానీపూరీ అమ్ముకుంటూ ఉండేవాడిని...

First Published Sep 17, 2021, 9:49 AM IST

దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతున్నా, సెలక్టర్లు పట్టించుకోని టాలెంటెడ్ క్రికెటర్లలో సౌరాష్ట్ర వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్ ఒకడు. 34 ఏళ్ల వయసులోనూ టీమిండియాలో చోటు వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న జాక్సన్, ఐపీఎల్‌లో పెద్దగా అవకాశాలు పొందింది లేదు...

రెండు రంజీ ట్రోఫీ సీజన్లలో 800+ పైగా పరుగులు చేసిన షెల్డన్ జాక్సన్, 76 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 49.22 సగటుతో 5634 పరుగులు చేశాడు. దేశవాళీ క్రికెట్‌లో టాప్ ప్లేయర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నా, బీసీసీఐ సెలక్టర్లు మాత్రం అతన్ని పట్టించుకోవడం లేదు...

‘రంజీ జట్టులో నేను ఐదేళ్లు బెంచ్‌కే పరిమితమయ్యా. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా అవకాశం రాకపోవడంతో 25 ఏళ్ల వయసులో క్రికెట్‌ వదిలేద్దామనుకున్నా...

నా స్నేహితుడు ఇంకో ఏడాది వేచి చూడు, నీకు అవకాశం రాకపోతే నా కంపెనీలో నీకు ఉద్యోగం ఇస్తానని చెప్పాడు. ఆ మాటలతో నేను క్రికెట్‌లో కొనసాగాను...

అదృష్టం... ఆ తర్వాతి ఏడాదే నాకు అవకాశం వచ్చింది. లేదంటే ఇప్పటికి పానీ పూరీ అమ్ముకుంటూ ఉండేవాడిని... రంజీ ఎంట్రీ తర్వాత ఒక్క ఏడాదిలో నాలుగు సెంచరీలు చేశా, అందులో మూడు సెంచరీలు, వరుసగా బాదాను...

ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో నేను హాఫ్ సెంచరీ చేశా. అప్పుడే గౌతమ్ గంభీర్, నన్ను మెచ్చుకుని, కేకేఆర్ జట్టులో నాకు చోటు ఉంటుందని మాట ఇచ్చారు...’ అంటూ చెప్పుకొచ్చాడు షెల్డన్ జాక్సన్... 

దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతూ టీమిండియాలో చోటు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న సౌరాష్ట్ర వికెట్ కీపర్ షెల్డన్ జాక్సన్‌కి శ్రీలంక టూర్ సమయంలోనూ మరోసారి నిరాశే ఎదురైంది...

మహేంద్ర సింగ్ ధోనీ, దినేశ్ కార్తీక్, వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్ వంటి వికెట్ కీపర్ల కారణంగా తనని పక్కనబెడుతున్నారని భావించిన షెల్డన్ జాన్సన్, శ్రీలంక టూర్‌లో తనకి చోటు ఉంటుందని ఎంతగానో ఆశించాడట.

అయినా అతనికి అదృష్టం దక్కలేదు. ఇషాన్ కిషన్, సంజూ శాంసన్‌లను వికెట్ కీపర్లుగా ఎంపిక చేసిన సెలక్టర్లు, 34 ఏళ్ల షెల్డన్ జాన్సన్‌ను పక్కనబెట్టేశారు. దీంతో తన మనసు విరిగిపోయిందంటూ ట్వీట్ చేశాడు షెల్డన్ జాక్సన్..

‘అవును.. నా వయసు 34 ఏళ్లు. అయితే నేను 22, 23 ఏళ్ల కుర్రాళ్ల కంటే బాగా పర్ఫామ్ చేస్తున్నా. మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నా సరే, వయసు పెరిగితే జాతీయ జట్టుకి సెలక్ట్ చేయకూడదని ఎక్కడ రాసి ఉంది?..
నా టాలెంట్‌ని నిర్ణయించడానికి వీళ్లేవెరు? అసలు ఏ ప్రతిపాదకన వాళ్లు నన్ను తక్కువ చేస్తున్నారు? నేను రంజీల్లో స్కోరు చేయలేదా? లేక ఫిట్‌నెస్ లేదా... రెండు, మూడు సీజన్లుగా 800-900 పరుగులు చేయడమంటే అంత తేలికయ్యే పనేనా...

ఫిట్‌నెస్ లేని ప్లేయర్ ఇలా పరుగులు సాధించగలడా? నాలో నిలకడ లేదా? మరి ఎందుకు నన్ను ఎంపిక చేయలేదు. చాలాసార్లు నేను 30 ఏళ్లు దాటేశానని విన్నాను. వయసును బట్టి ప్లేయర్లను ఎంపిక చేయాలని ఎక్కడ రాసి ఉంది... ’ అంటూ సీరియస్ అయ్యాడు షెల్డన్ జాక్సన్

click me!