T20 WorldCup: రక్తపాతాలు లేని యుద్ధం.. చూడటానికి జనమంతా సిద్ధం.. మరి నేటి పోరుపై జ్యోతిష్యం ఏమంటున్నది..?

First Published Oct 24, 2021, 4:15 PM IST

India vs Pakistan Live Updates: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్ లు అతి త్వరలో హోరాహోరీ పోరుకు సిద్ధమవుతున్నాయి. తమ దేశమే గెలవాలని ఇరు దేశాల అభిమానులు ఇప్పటికే పూజలు, వ్రతాలు చేస్తున్నారు. మరి ఈ బిగ్ ఫైట్ పై జ్యోతిష్యశాస్త్రం ఏం  చెబుతున్నది..?

రక్తపాతాలు సృష్టించే ఆయుధాలు లేని యుద్ధానికి మరికొద్దిసేపట్లో దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కాబోతున్నది. గత కొన్నాళ్లుగా ఐసీసీ (ICC) టోర్నీలలో మినహా ముఖాముఖి తలపడని రెండు జట్లు ఢీ అంటే ఢీ అనబోతున్నాయి. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల్లో అభిమానులు ఇప్పటికే టీవీలకు అతుక్కుపోయారు. తమ జట్టే గెలవాలని ఇరు దేశాల అభిమానులు పూజలు, వ్రతాలు, ప్రార్థనలు చేస్తున్నారు. మరి ఈ హై ఓల్జేజీ గేమ్ లో విజయమెవరిని వరించనుంది..? జ్యోతిష్యశాస్త్రం (Astrology) ఈ మ్యాచ్ గురించి ఏం చెప్పింది..? 

ఐసీసీ టోర్నీలలో (ఛాంపియన్స్ ట్రోఫీ మినహా) పాకిస్థాన్ పై భారత్ (India vs ppakistan)దే ఆధిపత్యం. వన్డే, టీ 20 ప్రపంచకప్ లలో ఇప్పటివరకూ  రెండు దేశాలూ 12 సార్లు తలపడ్డాయి. ఇది పదమూడో పోరు. టీ20 (T20 worldcup) లలో  రెండు జట్లు ఐదు సార్లు తలపడగా భారత్ (India) నే విజయం వరించింది. 

గత రికార్డులు చూసినా.. ప్రస్తుత ఫామ్ ప్రకారం అంచనా వేసినా ఈ మ్యాచ్ లో భారత్ గెలుస్తుందనడంలో సందేహమే లేదు. అయితే  యూఏఈ  పిచ్ లు పాకిస్థాన్ కు కొట్టిన పిండి. 

ఈ మ్యాచ్ గెలవడానికి రెండు దేశాలు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. మైదానంలో వాటిని అమలుపరచడమే తరువాయి. ఈ మ్యాచ్ పై సీనియర్లు,  క్రికెట్ అభిమానులు ఎవరికి తోచినవిధంగా వారు విశ్లేషిస్తున్నారు. 

ఇక జ్యోతిష్య శాస్త్ర విశ్లేషణ విషయానికొస్తే.. గణేశాస్పీక్స్ (Ganesha Speaks)ప్రకారం.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ను కేతువు స్వల్పంగా ప్రభావితం చేస్తున్నాడు. కన్యారాశిలో బుధుడు కోహ్లి సోలార్ చార్ట్ ను ప్రభావం చూపుతున్నాడు. అదే అతడిని నిజమైన నాయకుడిగా చేస్తున్నది. ఈ మ్యాచ్ లో  విరాట్ అత్యంత ప్రభావం చూపిస్తాడని ఇది చెప్పకనే చెబుతున్నది. 

మరోవైపు పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. శుక్రుడు, శని ఆశీర్వాదాలు కలిగి ఉన్నాడు. వీనస్ అతడి కీర్తికి సాయపడుతుండగా.. శని ప్రేరణ కూడా అతడికి మెండుగా ఉంది. అంతేగాక బృహస్పతి కూడా అతడికే అనుకూలంగా ఉంది. ఇప్పుడిదే భారత్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నది. 

సారథుల జ్యోతిష్యం ఎలా ఉన్నా గత రికార్డుల పరంగా చూసినా.. ప్రస్తుత ఫామ్ చూసినా పాక్ పై భారత్ దే పై చేయిగా ఉంది. మైదానంలో ఎవరు అత్యుత్తమంగా ఆడితే వారిదే విజయమని ఇప్పటికే ఇరు జట్ల కెప్టెన్లు ప్రకటించారు. జ్యోతిష్య శాస్త్రం కూడా అదే చెబుతున్నది. ఈ సారి ఇరు జట్ల మధ్య హోరాహోరి పోరు తప్పదని అంచనా వేస్తున్నది. 

కాగా.. ఈ మ్యాచ్ లో గెలిచి పాక్ పై రికార్డును అలాగే కంటిన్యూ చేయడంతో పాటు టోర్నీలో కూడా ముందంజ వేయాలని భారత్ భావిస్తున్నది. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ దాదాపు సెమీస్ చేరినట్టే. తర్వాతి మ్యాచ్ లలో ఒక్క న్యూజిలాండ్ మినహా  తక్కిన దేశాల మీద గెలవడం భారత్ కు పెద్ద విషయమేమీ కాదు. 
 

గ్రూప్-2 లో భారత్ తో పాటు పాకిస్థాన్, న్యూజిలాండ్, అఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఏదేమైనా సుమారు రెండేండ్ల తర్వాత దాయాదుల మధ్య పోరుకు దేశం మొత్తం వేయి కండ్లతో ఎదురు చూస్తున్నది. 

click me!