
India vs Pakistan : సాధారణంగా ఇండియన్ టీం క్రికెట్ ఆడుతుందంటే అభిమానులకు టీవీలకు అతుక్కుపోతారు... అలాంటిది ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఏస్థాయిలో ఆసక్తి ఉంటుందో అర్థంచేసుకోవచ్చు. ఈ దాయాదిదేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలు నేపథ్యంలో చాలాకాలంగా ద్వైపాక్షిక సీరిస్ లు జరగడంలేదు.. కేవలం ఐసిసి మ్యాచుల్లోనే ఇండియా-పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఇలా ఎప్పుడో ఒకసారి జరుగుతున్న ఈ మ్యాచ్ కు భారీ డిమాండ్ ఉంటోంది... ఇటు భారతీయ, ఆటు పాకిస్థానీ అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాప్రియులు ఈ మ్యాచ్ వీక్షిస్తుంటారు... దీంతో ICC (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) కి కాసుల పంట పండుతోంది.
అయితే మరికొద్దిరోజుల్లో జరిగే ఐసిసి టీ20 వరల్డ్ కప్ ఐసిసికి పీడకలను మిగిల్చేలా కనిపిస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నీకి దూరమవగా ఇప్పుడు పాకిస్థాన్ అదేబాటలో నడుస్తోంది. టీ20 వరల్డ్ కప్ మొత్తాన్ని కాదుగానీ భారత్ తో ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. దీంతో వరల్డ్ కప్ నిర్వహిస్తున్న ఐసిసికి భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ వంటి ఐసిసి ఈవెంట్స్ లోనే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ను కోట్లాది మంది చూస్తారు. ఇక ప్రపంచ కప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు... ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఆఫీసులకు సెలవులు పెట్టే ఉద్యోగులు, విద్యాసంస్థలకు డుమ్మాకొట్టు విద్యార్థులు, దుకాణాలు మూసివేసే వ్యాపారులను చూస్తుంటాం. ఇలా టీవీలు, సెల్ ఫోన్లలో కోట్లాది మంది చూడటం ద్వారా ఐసిసి వందల కోట్లు ఆర్జిస్తుంది.
అయితే ఇప్పటికే ప్రకటించిన టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ పూర్తిగా మారిపోతోంది. ఇప్పటివరకు ఇండియాలో ఆడబోమని చెప్పిన పాకిస్థాన్ ఇప్పుడు స్వరం మార్చి అసలు టీమిండియాతోనే ఆడమంటోంది. ఇప్పటికే పాక్ ప్రభుత్వంతో చర్చించిన పిసిబి కొలంబోలో జరిగే టీ20 మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఐసిసి టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటాం కానీ భారత్ తో మ్యాచులు ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది.
పాకిస్థాన్ ప్రకటనతో ఐసిసి టీ20 వరల్డ్ కప్ లో ఫిబ్రవరి 15న జరిగే మ్యాచ్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. కొలంబోలో జరగాల్సిన హైవోల్జేజ్ మ్యాచ్ రద్దయితే ఐసిసికి తీవ్ర నష్టం జరుగుతుంది... భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ద్వారా లభించే వందలకోట్ల ఆదాయం దెబ్బతింటుంది.
ఓ అంచనా ప్రకారం... ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ను కోట్లాదిమంది వీక్షిస్తారు కాబట్టి ఈ సమయంలో ప్రసారంచేసే యాడ్స్ కు ఎక్కువ డబ్బులు వసూలుచేస్తాయి బ్రాడ్ కాస్టర్స్. ఇలా కేవలం 10 సెకన్ల స్పాట్ కోసం దాదాపు రూ.50 లక్షల వరకు వసూలు చేసే అవకాశాలుంటాయి. ఈ మ్యాచ్ మొత్తంలో 900 నుండి 1200 సెకన్ల యాడ్స్ ప్లే అయినా సుమారు రూ.200 నుండి రూ.300 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఈ మ్యాచ్ రద్దయితే ఈ రెవెన్యూ మొత్తం దెబ్బతింటుంది.
ఇక స్టేడియంలో టికెట్ల అమ్మకాలు కూడా ఉండవు... ఇది కూడా ఐసిసికి నష్టమే. ఇలా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దయితే ఐసిసికి వందల కోట్ల నష్టం తప్పదు... కాబట్టి ఈ ప్రభావం మొత్తం టీ20 వరల్డ్ కప్ పై పడుతుంది. ఈ ఒక్క మ్యాచ్ రద్దుతో టీ20 వరల్డ్ కప్ ఆదాయమే పడిపోతుందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగకుంటే ఐసిసికి రూ.400+ కోట్ల నష్టం తప్పదు.
ఒకవేళ ఇప్పటికే ప్రకటించినట్లు ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ రద్దయితే ఐసిసి నష్టనివారణ చర్యలు చేపడుతుంది. ఐసిసి నుండి పిసిబికి అందే వార్షిక వాటా తగ్గించవచ్చు... లేదంటే పూర్తిగా నిలిపివేయవచ్చు. దీంతో పిసిబి ప్రతిఏటా ఐసిసి నుండి పొందే రూ.300 కోట్లు దక్కవు. అంతేకాదు పిసిబిపై ఆంక్షలు విధించే అవకాశాలుంటాయి.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ రద్దు ప్రభావం బిసిసిఐపై పెద్దగా ఉండదు. ఈ మ్యాచ్ జరగకపోవడంవల్ల కొంత నష్టం జరుగుతుంది... కానీ ఇది బిసిసిఐ ఆదాయాన్ని దెబ్బతీయలేదు. ఎందుకంటే బిసిసిఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ వంటి టోర్నీ ద్వారా బాగానే ఆదాయం పొందుతోంది. కాబట్టి భారత్-పాకిస్థాన్ మ్యాచ్ రద్దు ఇటు ఐసిసి, అటు పిసిబికి పెద్ద నష్టాన్ని మిగిల్చనుంది.