టీమిండియా గురించి మాట్లాడుతానన్న మాలిక్.. అక్కర్లేదు.. పని చూసుకోమన్న పాక్.. హైదరాబాద్ అల్లుడికి ఘోర అవమానం

First Published Nov 1, 2021, 5:44 PM IST

T20 World cup: టీమిండియా ఓటములపై మాట్లాడతానని అనుకున్న పాకిస్థాన్ జట్టులోని భారత అల్లుడు షోయబ్ మాలిక్ కు మాత్రం ఘోర అవమానం ఎదురైంది.

టీ20  ప్రపంచకప్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన టీమిండియా.. కనీస స్థాయి ప్రదర్శన చేయలేక చతికిలపడుతున్నది. కారణాలేమైనా టీమిండియా  ఆటతీరుపై ఇంటా బయటా పలువురు సీనియర్ క్రికెటర్లు, తాజా మాజీలు వారికి తోచినవిధంగా  స్పందిస్తున్నారు. అయితే టీమిండియా ఓటములపై మాట్లాడతానని అనుకున్న పాకిస్థాన్ జట్టులోని భారత అల్లుడు షోయబ్ మాలిక్ కు మాత్రం ఘోర అవమానం ఎదురైంది. 

గత నెల 24న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ అనంతరం భారత్ ఓటమిపై ఇరుదేశాలకు చెందిన పలువురు క్రికెటర్లు వారికి నచ్చిన విధంగా వ్యాఖ్యలు చేశారు. పాక్ కు చెందిన షోయబ్ అక్తర్, సల్మాన్ భట్, ఇంజమామ్ ఉల్ హక్ వంటి వాళ్లు కామెంట్స్ చేశారు. 

అక్తర్.. భారత మాజీ స్పిన్నర్ టర్బోనేటర్  హర్భజన్ ను టార్గెట్ చేస్తూ కొన్ని వెకిలివేశాలు కూడా వేశాడు. కానీ హర్భజన్ మాత్రం  హుందాగా వ్యవహరించాడు.  అక్తర్ ట్వీట్ కు రిప్లై ఇవ్వలేదు. కానీ పాక్ మాజీ బౌలర్ మహ్మద్ అమీర్, ఉమర్ గుల్ చేసిన వ్యాఖ్యలపై మాత్రం హర్భజన్ స్పందించాడు. అమీర్ పై చర్యలు తీసుకోవాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను లేఖలో కోరాడు. 

ఇక న్యూజిలాండ్ తో ఓడిపోయిన తర్వాత కూడా భారత జట్టు పై పలువురు పాక్ మాజీ ఆటగాళ్లు స్పందించారు. ఈ ఓటమి అనంతరం టీమిండియా సెమీస్ కు వెళ్లడం  గగనమే అని అఫ్రిది స్పందించగా.. ఆటలో గెలుపోటములు సహజమే గానీ భారత ప్రదర్శన తనను నిరాశ కలిగించిందని ఇంజమామ్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా అన్నాడు. 

ఇదిలాఉండగా.. కివీస్ తో టీమిండియా ఓటమి అనంతరం  ప్రస్తుతం పాకిస్థాన్ జట్టులో ఆడుతున్న వెటరన్ ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ స్పందించాలనుకుంటే మాత్రం అందుకు అంగీకారం రాలేదట. పాక్ మీడియా మేనేజర్ అందుకు అనుమతులివ్వలేదట. 

ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ పై ఎలాంటి కామెంట్స్  చేయొద్దని పాక్ టీమ్ కు పై నుంచి ఆదేశాలు అందినట్టు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే.. మాలిక్ నోటికి తాళం పడిందని సమాచారం.  దానిమీద స్పందించాల్సిన అవసరం లేదని, తదుపరి గేమ్ మీద దృష్టి పెట్టాలని సున్నితంగా మందలించారట.

అంతేగాక.. మాలిక్ తో ఇదే విషయం గురించి అడగడానికి వచ్చిన కొంతమంది పాత్రికేయులను కూడా సదరు మీడియా మేనేజర్ అనుమతించలేదట.. ఏదేమైనా తర్వాత ఆన్ లైన్ వేదికగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇంత పెద్ద ఈవెంట్ లో భారత్ వంటి పెద్ద జట్టుపై గెలవడం తమకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని  అన్నాడు. 

ఇక పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ గతంలో కంటే పరిణితి చెందాడని, ఆటగాడిగానే గాక  సారథ్య బాధ్యతలు కూడా గొప్పగా నిర్వర్తిస్తున్నాడని అన్నాడు. కెప్టెన్  గా ఒత్తిడి ఉన్నా.. దాని ప్రభావం బ్యాటింగ్ పై చూపడం లేదని కొనియాడాడు. బయో బబుల్ పై ఆటగాళ్లు చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని మాలిక్ అన్నాడు. ‘బబుల్ లైఫ్ అనేది కష్టమైనదే. మరీ ప్రత్యేకించి బ్యాక్ టు బ్యాక్ సిరీస్ ఉన్నప్పుడు అది చాలా కష్టం. మన కుటుంబాలు కూడా మనతోనే ఉన్నాయి. మీరు ఏదైనా సాధించాలని గట్టిగా అనుకుంటే మీ దృష్టంతా దాని మీదే నిలపాలి.  అందుకు తగ్గ సవాళ్లను మీరు స్వీకరించాలి’ అని చెప్పాడు. 

click me!