టైం వేస్ట్ యవ్వరాలు బంద్! 90 సెకన్లలో ఆడకపోతే అవుట్... సంచలన నిర్ణయాలు తీసుకున్న ఐసీసీ..

First Published Sep 20, 2022, 12:50 PM IST

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంది అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ). సౌరవ్ గంగూలీ అధ్యక్షతన మెన్స్ క్రికెట్ కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా ‘2017 కోడ్ ఆఫ్ క్రికెట్ లా’లో కొన్ని మార్పులు చేసింది ఐసీసీ. అక్టోబర్ 1, 2022 నుంచి ఈ కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. అంటే టీ20 వరల్డ్ కప్‌ 2022లోనూ కొత్త రూల్స్‌ని అమలుచేయబోతున్నారు...
 

ఏ బ్యాటర్ అయినా క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే ఆ తర్వాత వచ్చే బ్యాటర్ స్ట్రైయికర్‌గానే ఉంటాడు. ఫీల్డర్ క్యాచ్ అందుకునే సమయంలో ఆ బ్యాటర్ క్రీజు సగం దాటినా, దాటలేదా అనే విషయంతో సంబంధం లేదు. క్యాచ్ఇచ్చి అవుట్ అయితే తర్వాత వచ్చే బ్యాటర్ స్ట్రైయిక్ తీసుకోవాల్సి ఉంటుంది.

ఇంతకుముందు ఏ బ్యాటర్ అయినా క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే, ఫీల్డర్ క్యాచ్ అందుకునేలోపు ఆ బ్యాటర్ సగం క్రీజు దాటితే... తర్వాత వచ్చే బ్యాటర్ నాన్‌ స్ట్రైయికింగ్ ఎండ్‌లో ఉండేవాడు. సగం క్రీజు దాటిన స్ట్రైయికర్‌కి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కేది. అయితే కొత్త రూల్ అమలులోకి రావడంతో ఇకపై ఈ సౌకర్యం ఉండదు...

అలాగే బంతిపై ఉమ్మి రాయడాన్ని శాశ్వతంగా నిషేధించింది ఐసీసీ. కరోనా నిబంధనలు వచ్చిన తర్వాత వైరస్ వ్యాప్తిని నివారించేందుకు బంతిపై ఉమ్మి రాయడాన్ని నిషేధించింది ఐసీసీ. ఇప్పుడు కరోనా కేసులు తగ్గినా ఇకపై ఇలాంటివి వచ్చే ముప్పు ఉన్నందున.. ఈ చర్యను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది ఐసీసీ...

అలాగే వన్డే, టెస్టుల్లో టైమ్ వేస్ట్ కాకుండా ఉండేందుకు కొత్త బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చేందుకు నిర్ధిష్ట సమయాన్ని నిర్ణయించింది ఐసీసీ. టీ20ల్లో బ్యాటర్ అవుటైన 90 సెకన్లలో కొత్త బ్యాటర్ క్రీజులోకి రావాల్సి ఉంటుంది. ఆలస్యమైతే అతన్ని అవుట్‌గా ప్రకటిస్తారు అంపైర్లు. ఈ రూల్‌ని అలాగే ఉంచిన ఐసీసీ, వన్డే, టెస్టుల్లో కొత్త బ్యాటర్ క్రీజులోకి రావడానికి 2 నిమిషాల టైమ్ లిమిట్ పెట్టింది...

ఇంతకుముందు వన్డే, టెస్టుల్లో బ్యాటర్ క్రీజులోకి రావడానికి 3 నిమిషాలకు పైగా సమయం ఇచ్చేవాళ్లు. అయితే స్లో ఓవర్ రేట్ సమస్య పెరుగుతూ పోతుండడంతో టైమ్ వేస్టేజీని తగ్గించేందుకు ఈ సమయాన్ని తగ్గించింది ఐసీసీ...

బౌలర్ బౌలింగ్ చేయడానికి రన్నింగ్ చేస్తున్నప్పుడు ఫీల్డింగ్ చేస్తున్న టీమ్‌లో ఎవ్వరైనా బ్యాటర్ ఏకాగ్రతను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే... దాన్ని డెడ్ బాల్‌గా ప్రకటించి, బ్యాటింగ్ టీమ్‌కి ఐదు పరుగులను పెనాల్టీగా జోడిస్తారు.

బౌలర్ బంతి వేయడానికి ముందు క్రీజు దాటిన నాన్‌స్ట్రైయికర్ రనౌట్ చేయొచ్చు. దీన్ని ‘మన్కడింగ్’ అని పిలిచేవాళ్లు. అయితే ఇకపై అలా పిలవడానికి వీల్లేదని, ఇది కూడా సాధారణ రనౌట్‌గానే పరిగణించాలని తెలిపింది ఐసీసీ. అలాగే బౌలర్, బంతి వేయకుండా స్ట్రైయికింగ్‌లో బ్యాటర్‌ని రనౌట్ చేసే అవకాశం లేదు. అలా ప్రయత్నిస్తే ఆ బంతిని డెడ్ బాల్‌గా పరిగణిస్తారు...

నిర్ధిష్ట సమయంలోగా ఓవర్ల కోటా పూర్తి చేయలేకపోతే ఇన్‌ మ్యాచ్ పెనాల్టీ విధానాన్ని టీ20ల్లో ప్రవేశపెట్టింది ఐసీసీ. ఈ రూల్ ప్రకారం సమయం ముగిసిన తర్వాత వేసే ఓవర్లలో పవర్ ప్లే ఫీల్డింగ్‌ అమలులో ఉంటుంది. ఈ నిబంధనను వన్డేల్లో కూడా తీసుకురానుంది ఐసీసీ. అయితే 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత వన్డేల్లో ఈ రూల్ తీసుకురాబోతున్నారు.. 

click me!