నేను ఆ మ్యాచ్ ఆడుంటే ఇండియా ప్రపంచకప్ గెలవకపోయేది : అయిపోయిన మ్యాచ్ గురించి అక్తర్ పగటి కలలు

First Published Jun 11, 2022, 5:41 PM IST

ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎప్పుడూ రసవత్తరమే. మరీ ముఖ్యంగా ఐసీసీ టోర్నీలో అయితే అది పీక్స్.  2011 వన్డే ప్రపంచకప్ లో సెమీస్ లో భారత్-పాక్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో విజయం భారత్ దే. అయితే అక్తర్ మాత్రం....!!
 

తెలంగాణలోని ఊళ్లల్లో ఒక నాటు సామెత ఇప్పటికీ మనుగడలో ఉంది. ‘నేను లేకుంటే నీతోని ఏంగాదు పో..’ అని భార్యాభర్త, అన్నాతమ్ముళ్లు, అక్కా చెల్లెల్లు, స్నేహితులు.. బంధాలు ఏవైనా ఈ సామెతను వాడటం ఇప్పటికీ మామూలు విషయమే. ఇందుకు కాస్త భిన్నంగా  ‘నేను ఆడుంటే ఇండియా 2011 ప్రపంచకప్ గెలిచేది కాదు..’ అంటున్నాడు పాకిస్తాన్ మాజీ పేసర్ షోయభ్ అక్తర్. ఆయన కథెందో.. వెలగబెట్టిన ముచ్చటేందో ఇక్కడ చూద్దాం. 

అది 2011 వన్డే వరల్డ్ కప్ రెండో సెమీస్. దాయాది (ఇండియా-పాకిస్తాన్)  దేశాల మధ్య మ్యాచ్. వేదిక మొహాలీ. మ్యాచ్ కు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా అప్పటి ఇరు దేశాల ప్రధానమంత్రులు మొహాలీకి తరలివచ్చారు.  ఎంఎస్ ధోని సారథ్యంలోని టీమిండియా  టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. 

Latest Videos


తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (85), వీరేంద్ర సెహ్వాగ్ (38), సురేశ్ రైనా (36) రాణించారు. పాక్ తరఫున వహాబ్ రియాజ్ 5 వికెట్లు తీశాడు. 

అయితే లక్ష్య ఛేదనలో పాక్.. 49.5 ఓవర్లలో 231 పరుగుల వద్దే ఆలౌట్ అయింది. మిస్బా ఉల్ హక్ (56), మహ్మద్ హఫీజ్ (43) లు  పాక్ ను ఆదుకున్నారు. భారత బౌలర్లు (జహీర్ ఖాన్, ఆశిష్ నెహ్రా, మునాఫ్ పటేల్, హర్భజన్ సింగ్, యువరాజ్) లు సమిష్టిగా రాణించి తలా రెండు వికెట్లు తీసి భారత్ కు విజయాన్ని అందించారు.  

ఇప్పుడు అక్తర్ బాధేంటయ్యా అంటే.. ఈ మ్యాచ్ లో తాను ఆడి ఉంటే భారత్ తక్కువ స్కోరుకే ఆలౌట్ అయ్యేదని.. ప్రపంచకప్ ఫైనల్  కు పాకిస్తాన్ వెళ్లేదని గోడు వెళ్లబోసుకుంటున్నాడు. 

అక్తర్ మాట్లాడుతూ.. ‘మొహాలీ జ్ఞాపకాలు నన్ను తీవ్రంగా వెంటాడుతున్నాయి. 2011 వరల్డ్ కప్ సెమీస్ లో నేను ఆడి ఉండాల్సింది.  కానీ మా టీమ్ మేనేజ్మెంట్ నేను మ్యాచ్ కు ఫిట్ గా లేనని నన్ను పక్కనబెట్టింది. ఇది దారుణం.  నేను భారత్ ను ఓడించి పాక్  ను వాంఖెడే (పైనల్ జరిగిన స్టేడియం) కు తీసుకెళ్లాలని భావించా.  

స్వదేశంలో మాతో మ్యాచ్ అంటే భారత్ పై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. దేశ ప్రజలు, మీడియా అంతా మ్యాచ్ గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు మమ్మల్ని పరిగణనలోకి తీసుకోలేదు. దాంతో మాపై ఒత్తిడి లేదు.  ఆ మ్యాచ్ లో గనక నేను ఆడి ఉంటే  సచిన్, సెహ్వాగ్ లను  ముందే ఔట్ చేసేవాడిని. దాంతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయేది. దాంతో మేం మ్యాచ్ ను ఈజీగా నెగ్గేవాళ్లం. 

ఆ మ్యాచ్ లో నన్ను డగౌట్ లో కూర్చోబెట్టి పాక్  ఓడిపోతుంటే చూడటం నేను తట్టుకోలేకపోయా. అంత కీలక మ్యాచ్ లో ఓడితే చాలా మంది ఏడుస్తారు. కానీ నేను అలా కాదు.  ఏడ్వడం కంటే నా చుట్టు పక్కల ఉన్న వస్తువులను పగలగొడతా. మేం ఓడిపోతున్నప్పుడు కూడా చాలా వస్తువులు పగలగొట్టా. నేను చాలా నిరాశకు గురయ్యా.  ఆ వేదన ఇప్పటికీ నన్ను వెంటాడుతుంది..’ అని  తెలిపాడు.     అదండి అక్తర్ బాధ..!

click me!