సెమీస్‌లో ఇండియాకు షాక్ తప్పదు.. కారణాలివే.. పాకిస్తాన్ మాజీ సారథి కామెంట్స్

First Published | Nov 9, 2022, 3:16 PM IST

టీ20 ప్రపంచకప్ లో గురువారం భారత్-ఇంగ్లాండ్ మధ్య  కీలక సెమీస్ మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ లో  భారత్ కు భంగపాటు తప్పదని, ఇంగ్లాండ్ ఘన విజయం సాధించడం ఖాయమని అంటున్నాడు పాకిస్తాన్ మాజీ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది. 

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య గురువారం అడిలైడ్ వేదికగా జరుగబోయే రెండో సెమీస్ లో ఇంగ్లీష్ జట్టు చేతిలో రోహిత్ సేనకు  షాకులు తప్పవంటున్నాడు పాక్ మాజీ సారథి షాహిద్ అఫ్రిది.  ఈ మ్యాచ్ లో ఇండియా కంటే ఇంగ్లాండ్ కే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జోస్యం చెప్పాడు. 

పాకిస్తాన్ కు చెందిన సామా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్రిది మాట్లాడుతూ.. ‘సెమీస్ కు చేరుకున్న ఇండియా, ఇంగ్లాండ్ రెండూ బలంగానే కనిపిస్తున్నాయి.   ఈ టోర్నీలో ఇరు జట్లూ  మెరుగైన ఆటతో సెమీస్ చేరాయి.  కానీ  నా అభిప్రాయం ప్రకారం.. ఈ మ్యాచ్ లో ఇండియా కంటే ఇంగ్లాండ్ కే గెలిచే అవకాశాలున్నాయి.  


భారత్ తో పోల్చితే పాకిస్తాన్ కు 60 -65 శాతం  విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.   అందుకు కారణాలు కూడా ఉన్నాయి.  ఇంగ్లాండ్ ఆటగాళ్ల కాంబినేషన్ బాగుంది.  బౌలింగ్, బ్యాటింగ్, స్పిన్, ఫీల్డింగ్.. ఇలా ఏ విభాగంలో చూసుకున్నా  భారత్ కంటే ఇంగ్లాండ్ మెరుగ్గా ఉంది.  

అయితే ఇది చాలా పెద్ద మ్యాచ్. ఆటలో  తప్పులేమీ చేయకుండా, ఒత్తిడికి తట్టుకుని ఆడినవారిదే విజయం అవుతుంది.  ఫీల్డ్ లో 11 మంది ఆటగాళ్లు తమ సామర్థ్యం మేరకు ఆడితేనే విజయం సొంతమవుతుంది..’  అని తెలిపాడు. 
 

ఇక ఈ మ్యాచ్ కు ముందు ఇరు జట్లనూ గాయాలు వేధిస్తున్నాయి.  రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా నెట్స్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు  గాయపడ్డారు. అయితే ఈ ఇద్దరిదీ పెద్ద గాయం కానప్పటికీ  రేపటి మ్యాచ్ వరకు ఫిట్ గా ఉంటారా..? లేదా..? అనేది అనుమానంగా మారింది.  

ఇంగ్లాండ్ జట్టునూ గాయాలు వేధిస్తున్నాయి.  ఆ జట్టులో డేవిడ్ మలన్, మార్క్ వుడ్ కూడా గాయాల బాధితులే. ఈ ఇద్దరూ రేపటి మ్యాచ్ లో ఆడతారా..? లేదా..? అనేది ఇంకా అనుమానమే. గురవారం  అడిలైడ్ ఓవల్ వేదికగా ఇండియా-ఇంగ్లాండ్ లు సెమీస్ ఆడనున్నాయి. 

Latest Videos

click me!