నీకు కోట్లకు కోట్లు ఇచ్చేది ఆడటానికి.. డకౌట్ అవడానికి కాదంటూ రాజస్తాన్ ఓనర్ నన్ను కొట్టాడు: టేలర్

First Published Aug 14, 2022, 10:38 AM IST

Ross Taylor: రిటైర్మెంట్ తర్వాత ‘బ్లాక్ అండ్ వైట్’ పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడిస్తున్న  న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ మరో బాంబు పేల్చాడు. 
 

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ మరో బాంబు పేల్చాడు. కొద్దికాలం క్రితమే రిటైర్మెంట్ ప్రకటించిన ఈ  కివీస్ దిగ్గజం ఇటీవలే తాను రాసిన ‘బ్లాక్ అండ్ వైట్’ పుస్తకంలో సంచలన విషయాలు వెల్లడిస్తున్నాడు. న్యూజిలాండ్ క్రికెట్ లో కనిపించేదంత నిజం కాదని అక్కడ కూడా వివక్ష సర్వ సాధారణమని, అందుకు తానే ఒక ఉదాహరణ అని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. 

తాజాగా టేలర్ ఐపీఎల్ లో తాను గతంలో ఆడిన రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. రాజస్తాన్ కు చెందిన ఓ యజమాని (పేరు వెల్లడించలేదు) తనను  చెంపపై  నాలుగైదుసార్లు కొట్టాడని టేలర్  తెలిపాడు.   ఓ మ్యాచ్ లో తాను పరుగులేమీ చేయకుండా ఔట్ అయి వచ్చినందుకు అలా చేశారని వెల్లడించాడు. 

తన పుస్తకానికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో టేలర్ మాట్లాడుతూ.. ‘మొహాలీ వేదికగా రాజస్తాన్ రాయల్స్ - కింగ్స్ ఎలెవన్ మధ్య మ్యాచ్ జరిగింది. మేము 195 పరుగుల లక్ష్య ఛేదనలో దారుణంగా ఓడిపోయాం. నేను  పరుగులేమీ చేయలేదు. డకౌట్ అయి పెవిలియన్ కు వెళ్లా. ఆ మ్యాచ్ ముగిశాక  మేమంతా హోటల్ లోని పై అంతస్తుకు వెళ్లాం. 

పై అంతస్తులోని బార్ కు వెళ్లిన నాకు ఊహించని ఘటన ఎదురైంది. అక్కడ షేన్ వార్న్ తో పాటు  మిగతా ఆటగాళ్లు కూడా ఉన్నారు. రాజస్తాన్ రాయల్స్ ఓనర్ ఒకరు నా దగ్గరకు వచ్చాడు. రాస్  నీకు కోట్లకు కోట్లు డబ్బులు పెట్టి  దక్కించుకున్నది నువ్వు డకౌట్లు అయి వచ్చేందుకు కాదు అని అనుకుంటూ నా చెంపమీద నాలుగైదు సార్లు కొట్టాడు. 

అయితే అతడు నన్ను కొడుతున్నప్పుడు నవ్వుకుంటూ ఉన్నాడు. కానీ అతడు సరదాగా కొట్టాడో లేదా ఉద్దేశపూర్వకంగానే కొట్టాడో నాకు తెలియదు. కానీ అప్పుడు నేను ఆ సమస్యను పెద్దది చేయదలుచుకోలేదు. కానీ జెంటిల్మెన్ గేమ్ గా పేరున్న క్రికెట్ లో ఇలాంటిది జరుగుతుందని నేను ఊహించలేదు. కానీ ఆ సీజన్ లో రాజస్తాన్ రాయల్స్ నన్ను కొనుగోలు  చేసినప్పటికీ.. నేను ఆర్సీబీ తరఫున ఆడినా బాగుండు అని అనిపించింది..’ అని కామెంట్స్ చేశాడు. 


ఐపీఎల్ లో తొలి మూడు సీజన్ల పాటు టేలర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు.   2011  వేలంలో టేలర్ ను రాజస్తాన్ రాయల్స్ దక్కించుకుంది. ఆ సీజన్ లో అతడికి రూ. 4 కోట్లు పెట్టి రాజస్తాన్ కొనుక్కుంది. 2011 లో టేలర్.. 11 ఇన్నింగ్స్ లో 181 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో అతడిని తర్వాత సీజన్ లో రాజస్తాన్ పట్టించుకోలేదు. దీంతో అతడు ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఆడాడు. 

click me!