అది నోరా.. మూసీ నదా..? గాయపడుతావని చెప్పిన గంటనరకే కతం.. పాండ్యాకు గాయమవుద్దని అక్తర్ కు ముందే తెలుసా..?

First Published Dec 12, 2021, 1:00 PM IST

Hardik Pandya: 'అది నోరా.. మూసీ నదారా.. ఏదంటే అది జరిగిపోతుంది...!!' నువ్వే నువ్వే సినిమాలో సునీల్ ను తిడుతూ తరుణ్ చెప్పే డైలాగిది. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా,  పాకిస్థాన్ మాజీ పేసర్  షోయబ్ అక్తర్ విషయంలో కూడా ఈ డైలాగ్ కరెక్ట్ గా సరిపోతుందేమో.. 
 

టీమిండియా ఆల్ రౌండర్  కెరీర్.. వెన్నెముక శస్త్ర చికిత్సకు ముందు ఆ తర్వాత అని చెప్పుకోవాల్సి వస్తుంది. అప్పటిదాకా ఒక వెలుగు వెలిగిన ఈ క్రికెటర్.. 2019 లో వెన్నెముక గాయం తర్వాత ఆపరేషన్ చేయించుకుని టీమ్ తో చేరినా ఫామ్ కోల్పోయి ఇప్పుడు జట్టులో చేరడానికి నానా కష్టాలు పడుతున్నాడు. 

అయితే పాండ్యా గాయపడుతాడని పాకిస్థాన్ మాజీ  క్రికెటర్ షోయబ్ అక్తర్ కు ముందే తెలుసా..? ఎందుకంటే అక్తర్ చెప్పిన గంటనరకే  హార్ధిక్ గాయపడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా  అక్తరే తన యూట్యూబ్ ఛానెల్ లో తెలిపాడు. 

అక్తర్ మాట్లాడుతూ.. ‘దుబాయ్ లో నేను హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రాను కలిశాను. వాళ్లను చూస్తే బక్కపలచగా ఉన్నారు.  వాళ్ల  వెన్నెముకలు కూడా లేవని అనిపించింది. అప్పుడు పాండ్యా తాను తీరికలేని క్రికెట్ ఆడుతున్నట్టు నాకు చెప్పాడు. అయితే నేను అతడికి.. నువ్వు త్వరలోనే గాయపడుతావని హెచ్చరించా. నేనలా చెప్పిన గంటన్నరకే అతడు గాయపడ్డాడు..’ అని చెప్పాడు. 
 

2018 ఆసియా కప్ సందర్భంగా జరిగిన ఈ ఘటనను అక్తర్ ఇప్పుడు చెప్పుకొచ్చాడు. అయితే అదే సిరీస్ లో అక్తర్  ను కలిసిన రోజే  పాకిస్థాన్ తో మ్యాచ్ ఆడిన హార్ధిక్.. అదే మ్యాచులో గాయపడ్డాడు. ఆ తర్వాత అతడిని వెన్నెముక సమస్య సుమారు ఏడాదికాలం వేధించింది. 

అయితే తర్వాత ఏడాదే  వన్డే ప్రపంచకప్  ఉండటంతో  ఆ బాధను ఓర్చుకుంటూ మరీ పాండ్యా అందులో ఆడాడు. 2019  వన్డే వరల్డ్ కప్ తర్వాత అతడు వెన్నెముక శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. 

కానీ ఆ తర్వాత జట్టులోకి వచ్చినా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించడంలో విఫలమవుతున్నాడు. అంతేగాక గతంలో మాదిరి బౌలింగ్ కూడా చేయడం లేదు. ఈ ఏడాది శ్రీలంక టూర్ కు ఎంపికైన అతడు.. బౌలింగ్ చేయడానికి నానా తంటాలు పడ్డాడు. 

ఇక ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ లో ఆల్ రౌండర్ కోటాలో జట్టులోకి వచ్చినా బౌలింగ్ చేయలేదు. బ్యాటింగ్ లో కూడా మునపటి పదును తగ్గింది. ఈ నేపథ్యంలో అతడిని ఆ తర్వాత జరిగిన న్యూజిలాండ్ సిరీస్ తో పాటు త్వరలో జరిగే దక్షిణాఫ్రికా పర్యటనకు కూడా సెలెక్టర్లు పట్టించుకోలేదు. 

పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించుకుని రావాలని అతడిని బీసీసీఐ ఆదేశించింది. పాండ్యా ప్రస్తుతం ఇదే పని మీద ఉన్నాడు. కాగా, ఇక వైట్ బాల్ మీద క్రికెట్ పై దృష్టి సారించడానికి త్వరలోనే టెస్టులకు గుడ్ బై చెప్పే యోచనలో పాండ్యా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 

click me!