గడిచిన దశాబ్దకాలంగా టీమిండియాకు ఆడుతూ ఇప్పటికీ పరుగుల దాహం తీరని ఆటగాడిలా ఆడుతున్న మాజీ సారథి విరాట్ కోహ్లీకి ఇదే చివరి టీ20 ప్రపంచకప్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోహ్లీ.. తనను అచ్చొచ్చిన టెస్టు, వన్డే ఫార్మాట్ లపై దృష్టి సారించేందుకు గాను పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకుంటాడని క్రికెట్ వర్గాలలో జోరుగా చర్చ నడుస్తున్నది.
ఇంగ్లాండ్ టెస్టు సారథి బెన్ స్టోక్స్ సుదీర్ఘ ఫార్మాట్ కు ప్రాధాన్యం ఇవ్వడానికి వన్డేలను వదిలేశాడు. ఆసీస్ టీ20 సారథి ఆరోన్ ఫించ్ వన్డేల నుంచి తప్పుకుంటే కోహ్లీ మాత్రం టీ20లను వదిలేస్తాడని బీసీసీఐ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చర్చ జరుగుతున్నది.
ఈ నేపథ్యంలో కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ దీనిపై స్పందించాడు. కోహ్లీ అభిమానులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. బయట వినిపించేవన్నీ వదంతులేనని కొట్టిపారేశాడు. ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడిన ఆయన కోహ్లీకి ఇది కచ్చితంగా చివరి టీ20 ప్రపంచకప్ కాదని అన్నాడు.
రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘టీమిండియాకు సుదీర్ఘకాలంగా ఆడుతున్న ఘనత కోహ్లీది. అతడి ఫామ్, ఫిట్నెస్, పరుగుల దాహం కోసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. కోహ్లీకి ఇది కచ్చితంగా చివరి టీ20 ప్రపంచకప్ అయితే కాదు. వచ్చే పొట్టి ప్రపంచకప్ (2024)లో కూడా కోహ్లీ ఆడే అవకాశముంది.
కోహ్లీ ఇటీవలే తన పేలవ ఫామ్ దశను దాటాడు. తిరిగి మునపటి ఫామ్ ను అందుకున్నాడు. ఇప్పుడు కోహ్లీ చాలా ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు. ఆసియా కప్ లో కొత్త కోహ్లీని చూశాం. ఇక ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో కోహ్లీ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాడు..’ అని తెలిపాడు.
టీ20 ప్రపంచకప్ ప్రారంభం నుంచి ఇప్పటివరకూ ఆడుతున్న రోహిత్ శర్మతో పాటు ఈ మెగా టోర్నీ తర్వాత కోహ్లీ కూడా టీ20లకు గుడ్ బై చెబుతారని గత కొంతకాలంగా భారత క్రికెట్ లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.
వన్డే ప్రపంచకప్ (2023) తర్వాత రోహిత్ వన్డేల నుంచి తప్పుకున్నా కోహ్లీ మాత్రం వన్డే,టెస్టులలో కొనసాగే అవకాశముందని సోషల్ మీడియాలో ఈ ఇద్దరి ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. మరి వాళ్లిద్దరి మనుసులో ఏముందో..? అనేది మాత్రం సస్పెన్స్.