దేశవాళీ, ఐపీఎల్ తో పాటు ఇండియా-ఏ తరఫున ఎన్ని గొప్ప ప్రదర్శనలు చేసినా టీమిండియాలో చోటు దక్కించుకుని తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంలో యువ ఆటగాడు, రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ విఫలమవుతూనే ఉన్నాడు. కొద్దిరోజుల క్రితమే విడుదల చేసిన టీ20 ప్రపంచకప్ జట్టులో కూడా అతడి పేరు లేదు.
ఈ నేపథ్యంలో కేరళతో పాటు టీమిండియా ఫ్యాన్స్ చాలా మంది శాంసన్ కు మద్దతుగా నిలుస్తున్నారు. శాంసన్ కు బీసీసీఐ అన్యాయం చేస్తుందని విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. కనీసం స్టాండ్ బై ప్లేయర్ గా కూడా సంజూ పనికిరాడా..? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేరళలో సంజూ ఫ్యాన్స్ అయితే తిరువనంతపురంలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ జరగనివ్వమని హెచ్చరించారు.
దీంతో ప్రమాదాన్ని గమనించిన బీసీసీఐ.. సంజూను భారత - ఏ జట్టుకు సారథిగా నియమించింది. స్వదేశంలో న్యూజిలాండ్ - ఏ తో జరిగిన వన్డే సిరీస్ కు అతడే సారథిగా ఉన్నాడు. ఆ సిరీస్ లో సంజూ సారథిగానే గాక బ్యాటర్ గా కూడా ఆకట్టుకున్నాడు. అయితే సంజూకు ఇదొక్కటే గాక త్వరలో టీమిండియాలోకి రెగ్యులర్ ఆటగాడిగా కూడా చూస్తారని హింట్ ఇచ్చాడు బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ.
దాదా మీడియాతో మాట్లాడుతూ.. ‘అతడు (శాంసన్) కొద్దిరోజులుగా బాగా ఆడుతున్నాడు. ఇండియా తరఫున కూడా ఆడాడు. ఐపీఎల్ లో తన ఫ్రాంచైజీ తరఫున మెరుగ్గా ఆడుతున్నాడు. ప్రపంచకప్ జట్టులో కొంచెంలో స్థానం దక్కించుకోలేకపోయాడు. కానీ అతడు త్వరలోనే భారత జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా మారతాడు. దక్షిణాఫ్రికా తో జరుగబోయే వన్డే సిరీస్ లో అతడు ఆడతాడు..’ అని తెలిపాడు.
అంతేగాక కేరళలో మెరుగైన ఆటగాళ్లు ఉన్నారని గంగూలీ అన్నాడు. ‘శాంసన్ త్రివేండ్రం నుంచే అనుకుంటా. త్రివేండ్రంలో మంచి క్రికెటర్లు తయారవుతున్నారు. గతేడాది రంజీ సీజన్ లో రోహన్ కన్నుమ్మల్ మూడు సెంచరీలు చేశాడు. బాసిల్ తంపీ కూడా ఇక్కడి కుర్రాడే. ఈ రాష్ట్రంలో ఫుట్‌బాల్ ఒక్కటే ప్రధాన క్రీడ కాదు...’ అని తెలిపాడు.
కాగా దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ముగిశాక రోహిత్ సేన ఆస్ట్రేలియా వెళ్లనుంది. ఆ తర్వాత శిఖర్ ధావన్ సారథ్యంలోని భారత జట్టు.. సఫారీలతో మూడు వన్డేలు ఆడనుంది. వన్డే జట్టుకు సంజూ శాంసన్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నట్టు వార్తలు వస్తున్నాయి..