ధోని నా ఆరాధ్య క్రికెటర్.. ఇప్పటికీ అతడు చెప్పిన టిప్స్ పాటిస్తున్నా : ఆఫ్గాన్ స్టార్ బ్యాటర్

First Published Jan 29, 2023, 3:42 PM IST

‘ధోని నా ఆరాధ్య క్రికెటర్. అతడిలా మరెవరూ మ్యాచ్ ను ఫినిష్ చేయలేరు. నేను అతడి నుంచి చాలా నేర్చుకున్నా. 2015లో ధోనితో మాట్లాడా..’ అని  అంటున్నాడు  ఆఫ్గాన్ క్రికెటర్ నజీబుల్లా జద్రాన్..  

టీమిండియా మాజీ సారథి, భారత్ కు రెండు  ప్రపంచకప్ లు అందించిన  మహేంద్ర సింగ్ ధోనికి  మనదేశంలోనే కాదు  ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.  గత దశాబ్దంలో  ప్రపంచ క్రికెట్ మీద ధోని వేసిన ముద్ర అంతా ఇంతా కాదు. ధోని స్ఫూర్తితో  చాలామంది  క్రికెట్ ను తమ కెరీర్ గా కూడా ఎంచుకున్నారు.  

తాజాగా ఆఫ్గానిస్తాన్ స్టార్ బ్యాటర్  నజీబుల్లా జద్రాన్   కూడా తానూ  ధోని ఫ్యాన్ నే అని  చెప్పాడు. ధోనిని ఆరాధిస్తానని, అటువంటి ఫినిషర్  మరొకరు ఉండరని   జార్ఖండ్ డైనమైట్ పై ప్రశంసలు కురిపించాడు.   ధోనిని చూసి చాలా విషయాలు నేర్చుకున్నానని  అన్నాడు.  2015 వన్డే వరల్డ్ కప్ లో  ధోని ఇచ్చిన  సలహాలను ఇప్పటికీ పాటిస్తున్నానని  చెప్పాడు. 

ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న ఇంటర్నేషనల్  టీ20 లీగ్ (ఐఎల్ టీ20) లో  ఆడుతున్న  జద్రాన్.. ఈ లీగ్ లో ఎంఐ ఎమిరేట్స్ తరఫున  ఆడుతున్నాడు. జద్రాన్ మాట్లాడుతూ.. ‘ధోని నా ఆరాధ్య క్రికెటర్. అతడిలా  మరెవరూ మ్యాచ్ ను ఫినిష్ చేయలేరు.  నేను అతడి నుంచి చాలా నేర్చుకున్నా.. 

ms dhoni

2015 వన్డే వరల్డ్ కప్ లో  నేను తొలిసారి ధోనితో మాట్లాడాను.  అప్పుడు  ధోని నాకు విలువైన సలహాలు ఇచ్చాడు. ‘తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు  కూడా  ప్రశాంతంగా ఉండు. నిన్ను నువ్వు నమ్ము..’అని నాతో చెప్పాడు.  నేను ఇప్పటికీ  ఆ సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నా..’ అని  తెలిపాడు. 

2015 వన్డే వరల్డ్ కప్ నుంచే  ఆఫ్గానిస్తాన్  ప్రపంచకప్ లలో ఆడుతున్నది. ఆ టోర్నీలో  ఆఫ్గాన్  ఆరు మ్యాచ్ లు ఆడి ఒక విజయంతో గ్రూప్ లో ఐదో స్థానంతో నిలిచింది.   ఆ టోర్నీలో ఆఫ్గాన్.. స్కాట్లాండ్ ను ఓడించింది. 

ఇక 29 ఏండ్ల ఈ ఆఫ్గాన్ క్రికెటర్..  2012 నుంచి  జాతీయ జట్టుకు ఆడుతున్నాడు.  ఆఫ్గాన్ తరఫున  82 వన్డేలు,  86 టీ20లు ఆడాడు.  రెండు ఫార్మాట్లలో కలిపి 3 వేలకు పైగా పరుగులు చేశాడు. వన్డేలలో ఒక సెంచరీ కూడా బాదాడు.  జాతీయ జట్టుతో పాటు పలు లీగ్ లలో కూడా  జద్రాన్ ఆడుతున్నాడు. 

click me!