ఇంకా రాని మెడికల్ రిపోర్టులు.. నాగ్‌పూర్ టెస్టులో ఆ ఆల్ రౌండర్ ఆడేది అనుమానమే..? ఆసీస్‌కు తప్పని తిప్పలు

First Published Jan 29, 2023, 3:02 PM IST

IND vs AUS Test: వచ్చే నెల 9 నుంచి ఆస్ట్రేలియా జట్టు టీమిండియాతో ప్రతిష్టాత్మక బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా  తొలి టెస్టు ఆడనుంది. త్వరలోనే ఆ జట్టు  భారత్ కు రానుంది.  

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియాతో నాలుగు టెస్టులు ఆడేందుకు భారత్ కు రానున్న ఆస్ట్రేలియాకు ఇక్కడకు రాకముందే  షాకులు తప్పేట్టు లేవు.  ఇప్పటికే  చేతి వేలి గాయంతో తొలి టెస్టుకు  ఆ జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ దూరమైన విషయం తెలిసిందే.  తాజా రిపోర్టుల ప్రకారం ఆ జట్టు ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్  కూడా  నాగ్‌పూర్ టెస్టులో ఆడేది అనుమానమే అని తెలుస్తున్నది. 

భారత్ తో టెస్టు సిరీస్ ప్రారంభానికి సన్నాహకంగా ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు..  ప్రస్తుతం సిడ్నీ లో ట్రైనింగ్ సెషన్ లో పాల్గొంటున్నది.  ఇదివరకే ప్రకటించిన జట్టులోని ఆటగాళ్లు ప్రస్తుతం ట్రైనింగ్ క్యాంప్ లో పాల్గొంటున్నారు. ఈ  క్యాంప్‌నకు గ్రీన్ కూడా  హాజరవుతున్నాడు. 

అయితే ఈ ఆల్ రౌండర్  ప్రస్తుతానికి బ్యాటింగ్  మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నాడు. మీడియం పేసర్ అయిన గ్రీన్‌ను  తుది జట్టులోకి తీసుకుంటే మరో ఎక్స్‌ట్రా స్పిన్నర్ ను జట్టులోకి   ఎంపిక చేసుకోవచ్చని ఆస్ట్రేలియా భావిస్తున్నది.  కానీ  గ్రీన్  బౌలింగ్ చేస్తాడా..? చేయడా..? అన్నది ఇంకా తేలలేదు. 

కొద్దిరోజుల క్రితం దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ లో భాగంగా  రెండో టెస్టులో  గ్రీన్ చేతి వేలికి గాయమైంది.   వేలి ఎముక  దెబ్బతినడంతో అతడికి   సర్జరీ కూడా జరిగింది.  గాయం నేపథ్యంలో  అతడు నాలుగైదు వారాలు బౌలింగ్ చేయకూడటమే మంచిదని వైద్యులు సూచించారు.  ఇందుకు సంబంధించిన తుది నివేదిక  ఇంకా రావాల్సి ఉంది.  వాస్తవానికి గత వారమే నివేదిక రావాల్సి ఉన్నా అది సోమవారానికి (జనవరి 30)  వాయిదా పడింది.   సోమవారం నాటి నివేదికను బట్టి గ్రీన్ బౌలింగ్ చేస్తాడా..? చేయడా..? అన్నది తేలనుంది. 

ఒకవేళ రిపోర్టులో  ఏదైనా తేడా వస్తే మాత్రం  గ్రీన్ ను స్పెషలిస్టు బ్యాటర్ కే పరిమితం చేస్తారా..? లేక  మొత్తం టెస్టుకు దూరంగా ఉంచుతారా..? అన్నది  మరో రెండు మూడు రోజుల్లో తేలనుంది.  ఇక రిపోర్టు గనక లేట్ వస్తే  త్వరలో భారత్ కు రాబోయే  కంగారు జట్టుతో గ్రీన్ వచ్చేది కూడా అనుమానమే అని క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగ్‌పూర్ టెస్టులో గ్రీన్ ఆడతాడా..? లేదా..? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

ఫిబ్రవరి 9 నుంచి నాగ్‌పూర్  వేదికగా  భారత్ తో ఆస్ట్రేలియా తొలి టెస్టు ఆడనుంది.  2004 నుంచి భారత్ లో భారత్ ను ఓడించలేక  తంటాలు పడుతున్న ఆసీస్.. ఈసారి ఆ లోటును పూరించడానికి   పూర్తి ప్రణాళికతో ఇక్కడకు వస్తున్నది.  భారత్ లో అనుకూలించే  స్పిన్ కు అనుకూలించే  ఇక్కడి పిచ్ లకు అనుగుణంగా టీమ్ లో ఏకంగా ముగ్గురు ప్రధాన స్పిన్నర్లు, ఇద్దరు పార్ట్ టైమ్ స్పిన్నర్లను జట్టులోకి తీసుకుంది. 
 

click me!