ఐసీసీ ఇండియాకు అనుకూలంగా వ్యవహరిస్తుంది.. అందుకు నిన్నటి మ్యాచ్ సాక్ష్యం: పాకిస్తాన్ మాజీ సారథి వ్యాఖ్యలు

First Published Nov 3, 2022, 5:28 PM IST

T20 World Cup 2022: బంగ్లాదేశ్ తో బుధవారం ముగిసిన కీలక మ్యాచ్ లో భారత్ ఐదు పరుగుల తేడా (డక్‌వర్త్ లూయిస్)తో విజయాన్ని అందుకుంది.   అయితే ఈ మ్యాచ్ లో వర్షం పడ్డా ఐసీసీ మాత్రం ఇండియాకు అనుకూలంగా వ్యవహరించిందని పాకిస్తాన్ మాజీ సారథి షాహిద్ అఫ్రిది మండిపడ్డాడు. 
 

బంగ్లాదేశ్‌పై భారత్ విజయం సాధించడంపై దాయాది దేశం  పాకిస్తాన్  మాజీలు ఓర్వలేకపోతున్నారు. ఈ మ్యాచ్ లో  వర్షం అనంతరం మ్యాచ్  ప్రారంభించడంపై వాళ్లు అవాకులు చెవాకులు పేలుతూనే ఉన్నారు. ఐసీసీ.. ఇండియా (బీసీసీఐ)కు అనుకూలంగా వ్యవహరిస్తుందని మరోసారి ఈ మ్యాచ్ ద్వారా నిరూపితమైందని పాక్ మాజీ సారథి  షాహిద్ అఫ్రిది సంచలన కామెంట్స్ చేశాడు. 

మ్యాచ్ ముగిశాక సామా టీవీతో అఫ్రిది మాట్లాడుతూ.. ‘అవును.. ఈ మ్యాచ్ లో షకిబ్ అల్ హసన్ కూడా అదే చెప్పాడు.   వర్షం ముగిశాక గ్రౌండ్ ఎంత తడిగా ఉందో చూశారు కదా. అయినా కూడా మ్యాచ్ కొనసాగేలా చేశారు. నా అభిప్రాయం మేరకైతే  ఐసీసీ భారత్ కు అనుకూలంగా వ్యవహరిస్తుందని అనిపిస్తున్నది. 

వాళ్ల (బీసీసీఐ)కు ఇండియా గెలవడం కావాలి. భారత్ ఎలాగైనా సెమీస్ చేరాలి. అందుకే అంపైర్లు కూడా భారత్- పాకిస్తాన్ తో మ్యాచ్ లో వ్యవహరించినట్టే  ఇక్కడా చేశారు.  ఇందుకు గాను వాళ్లకు ప్రపంచంలో బెస్ట్ అంపైర్ అవార్డ్స్ కూడా దక్కుతాయని అందరికీ తెలుసు..’ అని  అన్నాడు. 

ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ చూపిన తెగువకు షాహిద్ అఫ్రిది ప్రశంసలు కురిపించాడు. లిటన్ దాస్ ఆటకు అఫ్రిది ఫిదా అయ్యాడు.  ‘వర్షం వల్ల  ఏం జరిగిందో అందరికీ తెలుసు. నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. వర్షం తర్వాత సాధారణంగానే రెండో సారి బ్యాటింగ్ చేసే జట్టు మీద ఒత్తిడి ఉంటుంది. 
 

ఈ మ్యాచ్ లో  పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నా ద లిటన్ దాస్ బ్యాటింగ్ మాత్రం అద్భుతం. అతడు సానుకూల దృక్పథంతో ఆడాడు. ఆరు ఓవర్ల తర్వాత  వర్షం రాకుంటే  మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేది. మరో రెండు మూడు ఓవర్లు ఆట ఇలాగే కొనసాగితే  బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ లో గెలిచే స్థితికి వచ్చేది. మొత్తానికి ఈ మ్యాచ్ లో బంగ్లాదేశ్ చూపిన పోరాటం మెచ్చుకోదగినది..’ అని వ్యాఖ్యానించాడు. 

కాగా  బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో  విరాట్ కోహ్లీ ఓ బంతికి  హైట్ నోబాల్ అని అప్పీల్ చేయగానే అంపైర్ దానికి ఓకే చెప్పడం.. అదే కోహ్లీ ఫేక్ ఫీల్డొంగ్ చేశాడని ఆరోపించడం.. వర్షం పడ్డా మ్యాచ్ కు సహకరించడం వంటి విషయాలు వివాదాస్పదమయ్యాయి. 

click me!