అబ్బే.. నాకేం ఆశ్చర్యంగా అనిపించలేదు.. ఎందుకంటే..! కోహ్లి నిర్ణయంపై గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

First Published Jan 16, 2022, 1:07 PM IST

Sunil Gavaskar Comments On Virat Kohli: టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పకుంటున్నట్టు ప్రకటించి అందరినీ దిగ్బ్రాంతికి గురి చేసిన కోహ్లి నిర్ణయం తనకేమీ ఆశ్చర్యానికి గురి చేయలేదంటున్నాడు గవాస్కర్.. 

టీమిండియా టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు  పలికిన విరాట్ కోహ్లి నిర్ణయం యావత్ భారత క్రికెట్ అభిమానులతో పాటు  ప్రపంచ క్రికెట్ లోకాన్ని కూడా దిగ్బ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. 
 

విరాట్ కోహ్లి తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయంపై టీమిండియా తాజా, మాజీ క్రికెటర్లు  సైతం ‘షాక్’ కు గురవుతుంటే దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మాత్రం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 
 

కోహ్లి టెస్టు సారథ్యం  నుంచి తప్పుకోవడం తనకేమీ ఆశ్చర్యమనిపించలేదని, ఇది తాను ఊహించిందేనని  సన్నీ అన్నాడు. గతంలో తాను కెప్టెన్ గా ఉన్న సమయంలో దానిని అనుభవించానని తెలిపాడు. 

గవాస్కర్ మాట్లాడుతూ.. ‘కోహ్లి నిర్ణయంపై నేనేమీ ఆశ్చర్యానికి గురికాలేదు. అతడు ఈ ప్రకటన దక్షిణాఫ్రికాతో మూడో టెస్టు అనంతరం ప్రెజెంటేషన్ సందర్భంగానే  చెబుతాడని భావించాను. కానీ తర్వాత చెప్పాడు. 

కొంత గ్యాప్ తర్వాత కోహ్లి ఈ నిర్ణయం ప్రకటించినా అది నేను ఊహించిందే. మ్యాచ్ ప్రెజెంటేషన్ సందర్భంగా చెబితే సిరీస్ కోల్పోయిన కోపంలో చెప్పాడని అనుకునే ప్రమాదం ఉందని అతడు గ్రహించి ఉండవచ్చు.. 
 

ఒక కెప్టెన్ గా విదేశాలలో ఓటములను బీసీసీఐ గానీ, బోర్డు సభ్యులు గానీ, అభిమానులు గానీ అంత తేలికగా తీసుకోరనే విషయం నాకు తెలుసు.  ఓవర్సీస్ లో ఓటముల పట్ల వాళ్లు ఏమాత్రం దయ చూపించరు. దానిని నేను సారథిగా ఉన్నప్పుడు ప్రత్యక్షంగా అనుభవించాను కూడా.. 

ఆ సమయంలో కెప్టెన్ ప్రమాదంలో ఉంటాడు. అది గతంలో ఎన్నో సార్లు జరిగింది.  ఈసారి మాత్రం భారత్ ఈజీగా గెలవగలిగే సిరీస్ ఇది. అయినా కూడా  మనం గెలవలేకపోయాం...’ అని సన్నీ వ్యాఖ్యానించాడు. 
 

ఇంకా సన్నీ మాట్లాడుతూ.. ‘ఇంతకుముందు ఏం జరిగిందో చూస్తే మీకు అన్నీ అవగతమౌతాయి. కోహ్లి వన్డే సిరీస్ సారథిగా  తొలగించబడిన వాస్తవాన్ని మీరు చూస్తూ.. ఈ సీరిస్ (దక్షిణాఫ్రికా) కోల్పోతే టెస్టు  కెప్టెన్సీకి కూడా ఎసరు వచ్చినట్టే అని అర్థమవుతుంది. కోహ్లి వ్యక్తిగతంగా విజయం సాధించినా అందుకు మినహాయింపు ఏమీ ఉండకపోవచ్చు..’అని అన్నాడు. 
 

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, బోర్డు తో విబేధాల కారణంగానే విరాట్ కోహ్లి టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో తనను కలిసిన విలేకరులతో గంగూలీ.. ‘నో కామెంట్స్’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.

అంతకుముందు గంగూలీ.. ఇది కోహ్లి వ్యక్తిగత నిర్ణయమని, దానిని బీసీసీఐ గౌరవిస్తుందని ట్వీట్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. 

click me!