నేను పాకిస్తాన్‌కి వెళ్తున్నా... ఐపీఎల్ 2021 ప్రారంభానికి ముందు క్రిస్ గేల్ షాకింగ్ ట్వీట్ వైరల్...

First Published Sep 19, 2021, 5:35 PM IST

‘యూనివర్సల్ బాస్’ క్రిస్‌గేల్ ఆటతీరే కాదు, చర్యలు కూడా ఊహాతీతం. అప్పుడప్పుతూ క్రీజులో క్రేజీగా ప్రవర్తించే క్రిస్ గేల్, ఈసారి సోషల్ మీడియాలో ఓ ట్వీట్‌తో అందర్నీ అయోమయానికి గురి చేశాడు...

కొన్నిరోజుల క్రితమే కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో బ్రావో టీమ్ తరుపున ఆడి, టైటిల్ గెలిచిన క్రిస్ గేల్, ఐపీఎల్ 2021 ఫేజ్ 2 కోసం యూఏఈ చేరుకుని, పంజాబ్ కింగ్స్ జట్టుతో చేరాడు.

పంజాబ్ కింగ్స్ ప్రాక్టీస్ సెషన్స్‌లో బిజీగా ఉన్న క్రిస్ గేల్... ‘నేను రేపు పాకిస్తాన్‌కి వెళ్తున్నా, నాతో ఎవరు వస్తారు?’ అంటూ ట్వీట్ చేసి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు...

ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్‌ 2లో భాగంగా పంజాబ్ కింగ్స్, మంగళవారం సెప్టెంబర్ 21న రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ఆడనుంది. ఈలోపు క్రిస్ గేల్, పాకిస్తాన్‌కి వెళ్లడం ఏంటి? అంటూ అనుమానిస్తున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్...

వాస్తవానికి క్రిస్ గేల్, పాక్‌కి వెళ్లడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను పాక్‌కి వెళ్లాలనుకున్నా, వీలయ్యే పరిస్థితి కాదు. ఇప్పటికే సీపీఎల్ పూర్తిచేసుకుని వచ్చిన క్రిస్ గేల్, బయో బబుల్ టు బయో బబుల్ ట్రాన్స్‌ఫర్ ఉన్నా కొన్ని గంటల పాటు తప్పనిసరి క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది...

అయితే పాక్ పర్యటనకు వెళ్లిన న్యూజిలాండ్ జట్టు, మొదటి వన్డే ఆరంభానికి ముందు టూర్‌ మొత్తాన్ని రద్దు చేసుకుని, స్వదేశానికి తిరుగు పయనమైన విషయం తెలిసిందే... ఈ సంఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కి గురి చేసింది...

‘సెక్యూరిటీ రీజన్స్’ కారణంగా చూపించి, పాక్ టూర్‌ను రద్దు చేసుకున్న న్యూజిలాండ్ టీమ్‌ను ట్రోల్ చేసేందుకు... తాను పాకిస్తాన్‌కు వెళ్తున్నట్టుగా ట్వీట్ చేశాడు క్రిస్‌గేల్...

క్రిస్‌గేల్‌, పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ‘ది క్వెట్టా గ్లాడియేటర్స్’ జట్టు తరుపున ఆడుతూ అక్కడి జనాలకు బాగా దగ్గరయ్యాడు. అందుకే పాకిస్తాన్‌లో తనకి ఎలాంటి అభద్రతా భావం కలగలేదనే ఉద్దేశంతో ఇలా ట్వీట్ చేశాడు క్రిస్‌ గేల్...

పాక్ టూర్‌ను రద్దు చేసుకుంటూ న్యూజిలాండ్ ప్రకటించిన తర్వాత సౌతాఫ్రికా క్రికెటర్ డేవిడ్ వీస్ ఖాతా పేరుతో ఓ ఫేక్ అకౌంట్ ద్వారా వేసిన ట్వీట్, సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది...

‘నేను చాలా దేశాలు తిరిగినా, అందులో పాకిస్తాన్ చాలా అందమైన, శాంతియుతమైన దేశం. పాక్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ప్రపంచంలోనే ది బెస్ట్.. న్యూజిలాండ్ తమ నిర్ణయాన్ని మరోసారి ఆలోచించాలని కోరుకుంటున్నా’ అంటూ వేసిన ట్వీట్‌ తెగ వైరల్ అయ్యింది...

అయితే దీనిపై స్పందించిన డేవిడ్ వీస్... ‘పాకిస్తాన్‌లో క్రికెట్ ఆడడం నేను ఎంజాయ్ చేశా... అక్కడే సెక్యూరిటీ ఎప్పుడూ నాకు సమస్య కాలేదు... అయితే ఇది నా ట్వీట్ కాదు, ఇది ఫేక్ అకౌంట్’ అంటూ కామెంట్ చేయడం విశేషం...

పాక్ అభిమాని ఎవరో సౌతాఫ్రికా క్రికెటర్ పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి, ఇలాంటి ట్వీట్ చేశారని తెలిసింది. అయితే డేవిడ్ వీస్ స్పందించి, ఫేక్ అకౌంట్ అనడంతో సదరు ఖాతా పేరును కిరన్ పోలార్డ్‌గా మార్చేశాడు సదరు పాక్ వీరాభిమాని...

click me!