
ఐపీఎల్-15 తుది అంకానికి చేరుకున్నది. లీగ్ దశ ముగించుకుని నాలుగు జట్లు ప్లేఆఫ్స్ కు చేరగా ఆరు ఫ్రాంచైజీలు బ్యాగ్ సర్దుకుని ఇంటికెళ్లాయి. మరి ఈ 70 మ్యాచులలో పది మంది సారథులు ఎలా ఆడారు..? ఆటగాళ్లగా, సారథిగా వారి ప్రదర్శన ఎలా ఉంది..? అనేది ఇక్కడ చూద్దాం.
1. హార్థిక్ పాండ్యా (గుజరాత్ టైటాన్స్) : ఐపీఎల్ లో ఈ ఏడాదే లీగ్ కు ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ను పాండ్యా అద్భుతంగా నడిపించాడు. గతంలో కెప్టెన్సీ అనుభవం లేకున్నా పాండ్యా జట్టును నడిపిన తీరు విమర్శకుల ప్రశంసలందుకుంటున్నది. సారథిగా అతడికి పదికి పది మార్కులు పడ్డాయి. సారథిగా నడిపిస్తూనే ఆటగాడిగా కూడా హార్ధిక్ రాణించాడు. బ్యాటింగ్ లో తనను తాను ప్రమోట్ చేసుకుని కీలక ఇన్నింగ్స్ ఆడి ఆ జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్ లో గుజరాత్ తరఫున 13 మ్యాచులాడిన పాండ్యా.. 413 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫిఫ్టీలు కూడా ఉన్నాయి. ఇక బౌలింగ్ లో పెద్దగా రాణించకపోయినా.. నాలుగు వికెట్లు కూడా పడగొట్టాడు.
2. రోహిత్ శర్మ (ముంబై ఇండియన్స్) : ఈ సీజన్ లో మునుపెన్నడూ లేనంతగా లీగ్ లో చిట్ట చివర నిలిచింది ముంబై. సారథిగానే గాక ఆటగాడి గా కూడా హిట్ మ్యాన్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన ముంబై ఈ సీజన్ లో నాలుగు మ్యాచుల్లో గెలిచి.. పది మ్యాచుల్లో ఓడింది. వరుసగా 8 మ్యాచుల్లో పరాజయం పాలైంది. జట్టును నడిపించడంలో, ఉన్న వనరులను ఉపయోగించుకోవడంలో హిట్ మ్యాన్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. ఇక ఆటగాడిగా కూడా రోహిత్ కు ఇది దారుణమైన సీజన్. తన ఐపీఎల్ కెరీర్ లో కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయని సీజన్ గా ఇది మిగిలింది. 14 మ్యాచులాడిన రోహిత్.. 268 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 48.
3. సంజూ శాంసన్ (రాజస్తాన్ రాయల్స్) : రాజస్తాన్ సారథిగా ఉన్న సంజూ ఆటగాడిగా కాస్త అటూ ఇటూ అయినా సారథిగా మాత్రం ఫుల్ మార్కులు కొట్టేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ వనరులను అతడు ఉపయోగించుకున్న తీరు అమోఘం. ప్రధాన బ్యాటర్లను ఔట్ చేయడానికి అతడు పన్నిన వ్యూహాలు, అటాకింగ్ ఫీల్డింగ్, బ్యాటింగ్ లైనప్ లో ప్రయోగాలు ఇవన్నీ సక్సెస్ అయ్యాయి. కెప్టెన్ గానే గాక ఆటగాడిగా కూడా శాంసన్ బాగానే రాణించాడు. 14 మ్యాచులాడి 374 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
4. కెఎల్ రాహుల్ (లక్నో సూపర్ జెయింట్స్) : ఈ సీజన్ లో గుజరాత్ తో పాటు ఎంట్రీ ఇచ్చి ఏకంగా ప్లేఆఫ్ చేరిన రెండో జట్టు లక్నో. ఆ జట్టు సారథి కెఎల్ రాహుల్.. గతంలో కెప్టెన్ గా చేసినా అంతగా సక్సెస్ కాలేదు. అయితే ఈ సీజన్ లో మాత్రం అతడు ఆటగాడిగానే గాక కెప్టెన్ గా కూడా మెరుగయ్యాడు. జట్టు తక్కువ స్కోర్లు చేసినప్పుడు రక్షించుకోవడం.. భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఆడటం.. ఫీల్డింగ్ వ్యూహాలు.. అన్నింటికీ మించి గౌతం గంభీర్ తో సమన్వయం చేసుకుంటూ సీజన్ లో లక్నోను ప్లేఆఫ్ కు చేర్చాడు. ఈ సీజన్ లో అతడు ఆడిన 14 మ్యాచుల్లో ఏకంగా 537 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్ లో రాహుల్ రెండు సెంచరీలతో పాటు 3 హాఫ్ పెంచరీలు కూడా చేయడం విశేషం.
5. ఫాఫ్ డుప్లెసిస్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) : ఆర్సీబీ కొత్త కెప్టెన్ డుప్లెసిస్ ఈ సీజన్ లో కొంత చేదు, కొంత తీపి అన్నట్టుగా ఆడాడు. ఆటగాడిగా ఓ మ్యాచ్ లో ఆడి మరో మ్యాచ్ లో విఫలమయ్యాడు. సారథిగా కూడా దాదాపు అదే పరిస్థితి. ఈ సీజన్ లో 8 మ్యాచులు గెలిచినా ప్లేఆఫ్ వేరే జట్లపై ఆధారపడాల్సి వచ్చింది. కెప్టెన్ గా డుప్లెసిస్ ఉన్నా పలు మార్లు ఫీల్డింగ్ మార్పులు విరాట్ కోహ్లి కూడా చేస్తూ కనిపించడంతో అసలు సారథి డుప్లెసిసా లేక కోహ్లినా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. కాగా ఈ సీజన్ లో 14 మ్యాచులాడిన డుప్లెసిస్.. 443 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలున్నాయి.
6. శ్రేయస్ అయ్యర్ (కోల్కతా నైట్ రైడర్స్) : ఈ సీజన్ కు ముందు సాగిన వేలంలో రూ. 12 కోట్లకు కేకేఆర్ దక్కించుకున్న ఆటగాడు శ్రేయస్. అయ్యర్ తమ జట్టు రాత మారుస్తాడని కేకేఆర్ భావించింది. కానీ సీజన్ ప్రారంభంలో తొలుత రెండు మూడు మ్యాచులు బాగానే ఆడిన కేకేఆర్ తర్వాత చేతులెత్తేసింది. ఆటగాడిగా అయ్యర్ రాణించినా.. అవి కోల్కతాకు విజయాలు అందించలేదు. ఈ సీజన్ లో 14 మ్యాచులాడిన కేకేఆర్.. 8 ఓడి ఆరింటిలో నెగ్గింది. ఇక బ్యాటర్ గా 14 మ్యాచులలో 401 పరుగులు సాధించాడు అయ్యర్. ఇందులో 3 ఫిఫ్టీలు కూడా ఉన్నాయి.
7. మయాంక్ అగర్వాల్ (పంజాబ్ కింగ్స్) : సీజన్ కో సారథి మారే పంజాబ్ లో ఈసారి ఆ అదృష్టం మయాంక్ ను వరించింది. ఆటగాడిగానే గాక సారథిగా కూడా మయాంక్ అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. సీజన్ లో తాము ఆడిన తొలి మ్యాచ్ (ఆర్సీబీతో) లో దుమ్మురేపిన పంజాబ్.. ఆ తర్వాత చతికిలపడింది. మయాంక్ బ్యాటర్ గా కూడా విఫలమయ్యాడు. ఓపెనర్ గా వచ్చిన అతడు.. అక్కడ విఫలమై తర్వాత మిడిలార్డర్ కు మారినా ఫలితం మారలేదు. ఈ సీజన్ లో మయాంక్.. 13 మ్యాచులలో 196 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఐపీఎల్-15 లో పంజాబ్ ఏడు మ్యాచుల్లో గెలిచి అన్నే మ్యాచుల్లో ఓడింది.
8. ఎంఎస్ ధోని (చెన్నై సూపర్ కింగ్స్) : ఈసారి సీఎస్కే లో ఊహించని మార్పులు జరుగడంతో ఇద్దరు కెప్టెన్లు మారారు. తొలి 8 మ్యాచులకు రవీంద్ర జడేజా సారథిగా ఉన్నాడు. తర్వాత అతడు ఒత్తిడి తట్టుకోలేక (అని సీఎస్కే చెప్పింది) ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. తిరిగి ఆరు మ్యాచులకు ధోని నే సారథిగా వ్యవహరించాడు. ఈ సీజన్ లో సీఎస్కే 14 మ్యాచుల్లో పది మ్యాచుల్లో ఓడి 8వ స్థానంలో నిలిచింది. ఇక సారథులుగా రవీంద్ర జడేజా.. 10 మ్యాచుల్లో (8 మ్యాచుల్లో కెప్టెన్) 116 పరుగులు చేశాడు. ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక ధోని.. 14 మ్యాచులలో 232 రన్స్ చేశాడు. ఇందులో ఒక ఫిఫ్టీ కూడా ఉంది.
9. రిషభ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్) : ఈ సీజన్ లో పడుతూ లేస్తూ వచ్చిన జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. ఒక మ్యాచ్ గెలిస్తే మరో మ్యాచ్ ఓడటం.. ఇది దాని ఆనవాయితీ. ఆఖరి లీగ్ మ్యాచ్ లో ముంబైతో తప్పక నెగ్గాల్సిన పోరులో అనూహ్యంగా ఓడి ప్లేఆఫ్స్ వెళ్లకుండా ఆగిపోయింది. కెప్టెన్ గా పంత్ తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. రాజస్తాన్ తో మ్యాచ్ లో అంపైర్ నిర్ణయం తో ఏకీభవించకపోవడం.. ముంబైతో ఆఖరి లీగ్ మ్యాచ్ లో టిమ్ డేవిడ్ ఔట్ ను డీఆర్ఎస్ తీసుకోకపోవడం తో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక ఈ సీజన్ లో బ్యాట్ తో కూడా పంత్ పెద్దగా ఆకట్టుకోలేదు. 14 మ్యాచులలో అతడు 340 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 43.
10. కేన్ విలియమ్సన్ (సన్ రైజర్స్ హైదరాబాద్) : ఈ సీజన్ మొత్తమ్మీద అత్యంత చెత్త ఆటతో తీవ్ర విమర్శల పాలైన ఆటగాడు కేన్ మామ. టీ20 లలో టెస్టుల మాదిరి ఆడి విమర్శల పాలయ్యాడు. కెప్టెన్ గా కొన్నిసార్లు ఫర్వాలేదనిపించినా.. గుజరాత్ టైటాన్స్ తో ఆఖరి ఓవర్ ను జాన్సేన్ కు ఇవ్వడం.. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో వ్యూహాల వైఫల్యం.. బౌలర్లను సరిగా ఉపయోగించుకోకపోవడంతో పాటు బ్యాటర్ గా తాను కూడా అట్టర్ ఫ్లాఫ్ అయ్యాడు. 13మ్యాచుల్లో 216 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్కటే హాఫ్ పెంచరీ ఉంది.