ప్రపంచ క్రీడా రంగంలో ఒక వ్యక్తి తాను పుట్టిన దేశానికే ప్రాతినిథ్యం వహించాలి తప్ప ఇతర దేశాల తరఫున ఆడటానికి లేదన్న నిబంధన లేదు. తమకు నచ్చిన చోటకు వెళ్లి అక్కడ నిబంధనలను పాటిస్తూ తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు. మిగతా క్రీడల మాదిరిగానే ఇది క్రికెట్ లో కూడా వర్తిస్తుంది. ఒక దేశానికి చెందిన క్రికెటర్ మరో దేశానికి వెళ్లి అక్కడ పౌరసత్వం పొంది తద్వారా ఆ దేశానికి ప్రాతినిథ్యం వహించడం కొత్తేమీ కాదు.
అలా నెదర్లాండ్స్ (డచ్) పౌరసత్వం పొందిన పలువురు ఆటగాళ్లే ఇప్పుడు దక్షిణాఫ్రికా పాలిట విలన్లుగా మారారు. టీ20 ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా-నెదర్లాండ్స్ మధ్య ముగిసిన మ్యాచ్ లో సఫారీల ఓటమిలో కీలక పాత్ర పోషించింది సౌతాఫ్రికాలో పుట్టి ఇక్కడే క్రికెట్ లో ఓనమాలు దిద్ది తర్వాత ఇక్కడ అవకాశాలు లేక నెదర్లాండ్స్ కు వెళ్లి అక్కడ క్రికెట్ ఆడుతున్నవారే కావడం గమనార్హం. వారి వివరాలు ఇక్కడ చూద్దాం.
నెదర్లాండ్స్ జట్టులో ఉన్న స్టీఫెన్ మైబర్గ్, కొలిన్ అకర్మన్, రొయిల్ఫ్ వన్ డర్ మెర్వ్, బ్రాండన్ గ్లోవర్ లు నిన్నటి మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓటమిలో కీలక పాత్ర పోషించారు. ఈ నలుగురు డచ్ ఆటగాళ్లు పుట్టి పెరిగిందంతా దక్షిణాఫ్రికాలోనే కావడం గమనార్హం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
స్టీఫెన్ మైబర్గ్ : దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టిన ఈ 38 ఏండ్ల బ్యాటర్ సౌతాఫ్రికాలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. సౌతాఫ్రికాలోని నార్తర్న్స్ టీమ్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు. మైబర్గ్ విధ్వంసం 2014లో ప్రపంచానికి తెలిసొచ్చింది. బంగ్లాదేశ్ లో ఆ ఏడాది జరిగిన ప్రపంచకప్ లో మైబర్గ్.. ఐర్లాండ్ మీద 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. నిన్నటి దక్షిణాఫ్రికా మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగి 30 బంతుల్లో 7 ఫోర్లతో 37 పరుగులు చేసి ఆ జట్టు స్కోరుకు పునాది వేశాడు.
కొలిన్ అకర్మన్ : సౌతాఫ్రికాలోని జార్జ్ పట్టణంలో జన్మించిన అకర్మన్ అక్కడ దేశవాళీలో ఈస్టర్న్ ప్రావిన్స్ తరఫున ఆడాడు. 2016-17లో సౌతాఫ్రికా తరఫున అండర్ - 19 ప్రపంచకప్ లో పాల్గొన్నాడు. కానీ జాతీయ జట్టులో అవకాశాలు రాక నెదర్లాండ్స్ కు మారాడు. నిన్నటి మ్యాచ్ లో చివర్లో నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చిందే అకర్మనే. అతడు 26 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో 41 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
రొయిల్ఫ్ వన్ డర్ మెర్వ్ : వన్ డర్ మెర్వ్ జోహెన్నస్‌బర్గ్ లో జన్మించాడు. సౌతాఫ్రికా అండర్ - 19 జట్టుకు ఆడాడు. గతంలో దక్షిణాఫ్రికా సీనియర్ జట్టుకు కూడా సెలక్ట్ అయ్యాడు. 2009లో అతడు ఆస్ట్రేలియాతో మ్యాచ్ ద్వారా తొలి టీ20 కూడా ఆడాడు. కానీ 2015లో డచ్ జట్టుకు మారి అక్కడ రాణిస్తున్నాడు. ఈ టోర్నీలో వన్ డర్ మెర్వ్ బౌలింగ్ లో రాణించాడు. నిన్నటి మ్యాచ్ లో బ్రాండన్ గ్లోవర్ వేసిన బంతికి భారీ షాట్ ఆడిన డేవిడ్ మిల్లర్ ఇచ్చిన క్యాచ్ ను ముందుకు పరిగెత్తుతూ అద్భుతంగా అందుకున్నాడు. ఆ క్యాచ్ తర్వాత సఫారీ ఇన్నింగ్స్ కుదేలైంది.
బ్రాండన్ గ్లోవర్ : దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ను కకావికలం చేయడంలో ఈ యువ పేసర్ సఫలీకృతుడయ్యాడు. జోహన్నస్‌బర్గ్ లోనే పుట్టిన గ్లోవర్.. సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్ తో పాటు అండర్-19 జట్టు సభ్యుడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే ఈ యువ పేసర్.. నిన్నటి మ్యాచ్ లో 2 ఓవర్లు వేసి 9 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. రొసో, డేవిడ్ మిల్లర్, పార్నెల్ ను ఔట్ చేసింది గ్లోవరే కావడం గమనార్హం.