అతడిని ఆల్ రౌండర్ అని ఎలా అంటారు..? హార్ధిక్ పాండ్యాపై ప్రశ్నలు సందించిన దిగ్గజ క్రికెటర్

First Published Nov 26, 2021, 4:32 PM IST

Hardik Pandya: భారత జట్టులో చోటు కోల్పోయి తంటాలు పడుతున్న హార్ధిక్ పాండ్యా  ఫామ్ పై అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మాజీ ఆల్ రౌండర్, దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ కూడా పాండ్యా ఫామ్ పై ప్రశ్నలు సందించాడు. 

టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా  తన కెరీర్ లో అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. వెన్నునొప్పికి గాయం తర్వాత శస్త్ర చికిత్స చేసుకుని ఫీల్డ్ లోకి దిగినా అతడికి విమర్శల గాయాలు మాత్రం బలంగా తాకుతున్నాయి.

శస్త్ర చికిత్స తర్వాత హార్ధిక్ అనుకున్నంత స్థాయిలో రాణించడం లేదు. ఐపీఎల్  రెండో దశలో అతడు  రాణించలేదు. అయినా కూడా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పాండ్యాపై నమ్మకముంచి టీ20 ప్రపంచకప్ కు ఎంపిక చేసింది. కానీ  అక్కడ కూడా పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. దీంతో అతడిపై సర్వత్రా విమర్శలు  వెల్లువెత్తాయి.

అభిమానులే కాదు.. మాజీ క్రికెటర్లు సైతం అతడి ఆటతీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇక తాజాగా ఇదే విషయమై దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్  స్పందించాడు.   బౌలింగ్ చేయని పాండ్యాను ఆల్ రౌండర్ అని ఎలా అంటారని కపిల్  ప్రశ్నించాడు.

కోల్కతాలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న కపిల్ మాట్లాడుతూ.. ‘ఆల్ రౌండర్ అనిపించుకోవాలంటే బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయాలి. కానీ అతడు (పాండ్యా) ఇప్పుడు బౌలింగ్ చేయడం లేదు కదా. 

అలాంటి సమయంలో  హార్ధిక్ ను ఆల్ రౌండర్ అని ఎలా అంటారు...? అతడు గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలి. బ్యాటింగ్ లో అతడు భారత జట్టు తరఫున కచ్చితంగా నైపుణ్యమున్న బ్యాటర్.  కానీ బౌలింగ్ లో మాత్రం అతడింకా నిరూపించుకోవాల్సింది చాలా ఉంది. అతడింకా చాలా మ్యాచులాడాలి. బౌలింగ్ చేయాలి.  మంచి ప్రదర్శనలు చేయాలి..’ అని అన్నాడు. 

టీ20 ప్రపంచకప్ లో రాణించకపోవడంతో  హార్ధిక్ కు ఇటీవల న్యూజిలాండ్ తో ముగిసిన మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో చోటు దక్కలేదు. టెస్టు జట్టులో కూడా స్థానం సంపాదించలేదు. అయితే  త్వరలో జరిగే దక్షిణాఫ్రికా టూర్ కు ఎంపికవ్వాలంటే అంతకంటే ముందు  జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకుని రావాలని బీసీసీఐ అతడికి సూచించింది. 

కాగా.. టీమిండియాకు కొత్త కోచ్ గా నియమితుడైన రాహుల్ ద్రావిడ్ పై కపిల్ దేవ్  ప్రశంసలు కురిపంచాడు. అతడు క్రికెటర్ గా సాధించదానికంటే  టీమిండియా ప్రధాన శిక్షకుడిగా ఎక్కువ సక్సెస్ అవుతాడని కపిల్ అభిప్రాయపడ్డాడు. 

‘అతడు (ద్రావిడ్) మంచి వ్యక్తి. మంచి క్రికెటర్. ఒక క్రికెటర్ గా కంటే కూడా కోచ్ గా అతడింకా ఎక్కువ సక్సెస్ అవుతాడు.  ఎందుకంటే క్రికెట్ లో అతడికంటే మెరుగ్గా ఎవరూ ఆడలేరు...’ అని కపిల్ అన్నాడు. 

click me!