ఆడేది లేదు.. చేసేది లేదు.. ఆసియా కప్‌‌లో అతడిని ఎందుకు ఎంపికచేశారు..? అశ్విన్ ఎంపికపై మాజీ సెలక్టర్ ఆగ్రహం

First Published Aug 10, 2022, 12:53 PM IST

Asia Cup 2022: ఈనెల 27 నుంచి యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ లో భాగంగా పాల్గొనబోయే భారత జట్టును ఇటీవలే ప్రకటించారు. ఈ జట్టులో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు  చోటు దక్కింది. 

ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో రవిచంద్రన్ అశ్విన్ ను చేర్చడంపై  టీమిండియా మాజీ ఆటగాడు,  సెలక్షన్ కమిటీ మాజీ చైర్మెన్ కిరణ్ మోరె విస్మయం వ్యక్తం చేశాడు. అతడిని ఎందుకు ఎంపిక చేశారో తనకైతే అర్థం కావడం లేదని వ్యాఖ్యానించాడు. 
 

ఇదే విషయమై ఓ క్రీడా ఛానెల్ తో మోరె మాట్లాడుతూ.. ‘ఈ జట్టును చూసి నేనైతే ఆశ్చర్యానికి గురయ్యాను.  అశ్విన్ ను జట్టులోకి ఎలా తీసుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు. సెలక్టర్లు ఇలా చేయడం ఇదేం కొత్త కాదు.. 

గతంలో టీ20 ప్రపంచకప్ సమయంలో కూడా ఇలాగే చేశారు. అశ్విన్ ను ఎంపిక చేసినా అతడిని ఆడించలేదు. తర్వాత కూడా అంతే.  ఆసియా కప్ ను అతడిని ఎంపిక చేయడం సరైన సెలక్షన్ కాదు. మీరు ఒకసారి ఐపీఎల్ లో అతడి రికార్డును చూడండి. టీ20లో అతడికి గొప్ప రికార్డేమీ లేదు. గత ప్రపంచకప్ లో అతడిని ఎంపికచేసినా ఆడించకుండా  బెంచ్ కే పరిమితం చేశారు. ఇప్పుడూ అంతే.. అలాంటప్పుడు టీమ్ లోకి తీసుకోవడమెందుకు..? 

అశ్విన్ కు బదులుగా మహ్మద్ షమీని తీసుకుంటే బాగుండేది. షమీ వికెట్లు తీయగల సత్తా ఉన్న బౌలర్. ఆట ప్రారంభంలో అయినా మిడిల్ ఓవర్లు, స్లాగ్ ఓవర్లలో అతడు వికెట్ తీయగలడు. అదీగాక అతడు ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న  ప్రపంచకప్ ఆడాల్సినోడు. బుమ్రా గైర్హాజరీలో షమీని ఎంపిక చేయాల్సింది..’ అని అన్నాడు. 

అశ్విన్ కంటే అక్షర్ పటేల్ ను ఎంపిక చేస్తే బాగుండేదని మోరె అన్నాడు. ‘స్పిన్ ఆల్ రౌండర్ ను తీసుకోవాల్సి వస్తే అశ్విన్ స్థానంలో  అక్షర్ పటేల్ ను ఎంపిక  చేస్తే బాగుండేది. ఇటీవల ముగిసిన వెస్టిండీస్ సిరీస్ లో  అక్షర్ బాగా రాణించాడు.  అశ్విన్ కంటే అతడే బెస్ట్ ఛాయిస్..’ అని అన్నాడు. 

ఆసియా కప్ లో షమీని ఎంపిక చేయకపోవడంపై షమీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘నా జట్టులో అయితే షమీకి కచ్చితంగా చోటిస్తా. నేనే గనక ప్రస్తుత సెలక్టర్ అయ్యుంటే అతడిని ఎంపికచేసేవాడిని. బిష్ణోయ్ ను పక్కనబెట్టి  షమీకి తీసుకునేవాడిని. కానీ నలుగురు స్పిన్నర్లు ఎందుకు..? వారి బదులు షమీని తుది జట్టులోకి ఎంపిక చేసి ఉంటే బాగుండేది..’ అని అన్నాడు. 

ఆసియా కప్‌-2022కు భారత జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), కెఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), దినేశ్‌ కార్తిక్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, యజ్వేంద్ర చహల్‌, రవి బిష్ణోయ్, భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేశ్‌ ఖాన్‌

click me!