గాయపడ్డాడా..? వేటు వేసారా..? పంత్‌ను ఎందుకు పక్కనబెట్టినట్టు..?

First Published Dec 28, 2022, 12:09 PM IST

BCCI: సొంతగడ్డపై  శ్రీలంకతో  పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో రెండు సిరీస్ లు ఆడనున్న టీమిండియా  జట్టును మంగళవారం ప్రకటించింది బీసీసీఐ. అయితే అటు టీ20లతో పాటు  వన్డే జట్టులో కూడా టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు చోటు దక్కలేదు. 
 

స్వదేశంలో శ్రీలంకతో  భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ నేపథ్యంలో ఆలిండియా సెలక్షన్ కమిటీ  మంగళవారం రెండు ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది. అయితే అటు టీ20లలో గానీ ఇటు వన్డేలలో గానీ   టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ కు చోటు దక్కలేదు. 

ఇటీవలే ముగిసిన బంగ్లాదేశ్  పర్యటనలో కూడా పంత్ కు ఇలాగే జరిగింది. సరిగ్గా వన్డే సిరీస్ కు ముందు కారణమేమీ చెప్పకుండా  పంత్ ను తొలగించింది బీసీసీఐ.  తర్వాత  టెస్టు సిరీస్ లో మాత్రం ఆడించింది. వన్డేలలో చోటు దక్కకపోయినా  టెస్టులలో మాత్రం పంత్  ఫర్వాలేదనిపించాడు. 
 

మళ్లీ శ్రీలంకతో సిరీస్ లో పంత్ ను పక్కనబెట్టడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.  పంత్ కు గాయమైందా..? లేక పేలవ ఫామ్ కారణంగానే అతడిని పక్కనబెట్టారా..? అన్న  ప్రశ్నలు ఎదురవుతున్నాయి.  మరి  పంత్ ను ఎందుకు పక్కనబెట్టినట్టు..?  వన్డే  ప్రపంచకప్ సన్నాహకాల్లో పంత్ లేడా..?  ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ కు జట్టులో చోటిచ్చిన సెలక్టర్లు పంత్ ను ఎందుకు పక్కనబెట్టారు..? 

టెస్టులలో పరుగులు చేస్తున్న పంత్.. అదే జోరును  పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో మాత్రం చూపలేకపోతున్నాడు. మరీ ముఖ్యంగా ఈ ఏడాది పంత్ ప్రదర్శన నానాటికీ తీసికట్టుగా మారుతోంది.    2022లో  పంత్ అటు టీ20లలో గానీ ఇటు వన్డేలలో గానీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ లు ఏవీలేవంటే అతిశయెక్తే లేదు. ఇక టీ20 ప్రపంచకప్ లో చోటు దక్కించుకున్నా  దినేశ్ కార్తీక్ కారణంగా  పంత్ కు తుది జట్టులో ప్లేస్ దక్కలేదు. 

ఈ మెగా టోర్నీకి ముందు  గానీ, తర్వాత గానీ జరిగిన సిరీస్ లలో పంత్ విఫలమయ్యాడు. న్యూజిలాండ్ తో టీ20, వన్డే జట్టులో ఆడినా  పరుగులు చేయడంలో  దారుణంగా  ఫెయిల్ అయ్యాడు.  సంజూ శాంసన్ ను కాదని పంత్ ను తుది జట్టులో చేర్చడం వివాదాలకు దారి తీసింది.  కివీస్ పర్యటనలో   పంత్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతడిని తప్పించాలని  అటు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ తో పాటు   టీమిండియా ఫ్యాన్స్ కూడా డిమాండ్ చేశారు. 

ఇందులో భాగంగానే బంగ్లాతో వన్డే సిరీస్ లో పంత్ ను తప్పించిన యాజమాన్యం తాజాగా లంకతో వన్డే, టీ20లలో అతడిని పక్కనబెట్టింది.  టీ20లలో ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ లకు అవకాశమిచ్చిన  సెలక్టర్లు.. వన్డేలలో  ఇషాన్, రాహుల్ కు ఆ ఛాన్స్ ఇచ్చారు.   ఈ   రెండు సిరీస్ లలో సంజూ, ఇషాన్ లు సత్తా చాటితే  పంత్ కు కష్టకాలం తప్పదు.  

లంకతో టీ20 సిరీస్ కు భారత జట్టు : హార్ధిక్  పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుభమన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్,  యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివమ్ మావి, ముకేశ్ కుమార్ 

లంకతో వన్డేలకు భారత జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ,  సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ,  మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ 

click me!