ఆసీస్‌లో బ్యాటర్ల కాళ్లు విరగ్గొట్టడానికి బుమ్రా వస్తున్నాడు.. ప్రత్యర్థులకు పాకిస్తాన్ మాజీ బౌలర్ హెచ్చరిక

First Published Sep 24, 2022, 5:15 PM IST

Jasprit Bumrah: టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా  సుమారు రెండు నెలల  విరామం తర్వాత  జట్టులోకి వచ్చాడు. నాగ్‌పూర్ మ్యాచ్ లో ఆడిన బుమ్రా.. ఆస్ట్రేలియా సారథి ఆరోన్ ఫించ్ ను యార్కర్ తో క్లీన్ బౌల్డ్ చేశాడు.  

ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా జులై 14న భారత్ తరఫున మ్యాచ్ ఆడిన తర్వాత టీమిండియా  స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. మళ్లీ జాతీయ జట్టులో ఆడలేదు.  వెన్నునొప్పి కారణంగా బుమ్రా కొన్నిరోజులు జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో చికిత్స పొందాడు. ఆసియా కప్ లో మిస్ అయినా ప్రపంచకప్ లో ఆడాలనే కృత నిశ్చయంతో స్వదేశంలో జరుగుతున్న ఆస్ట్రేలియా సిరీస్ లో ఆడుతున్నాడు. 

తొలి మ్యాచ్ లో ఆడకపోయిన అతడు..శుక్రవారం నాగ్‌పూర్ లో ముగిసిన రెండో మ్యాచ్ లో మాత్రం ఆడాడు. వర్షం వల్ల 8 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్ లో బుమ్రా రెండు ఓవర్లు బౌలింగ్ చేసి ఫర్వాలేదనిపించాడు. తన తొలి ఓవర్లోనే ఫించ్ ను అద్భుత యార్కర్ తో బోల్తా కొట్టించిన బుమ్రా.. రెండో ఓవర్లో  పరుగులిచ్చినా స్మిత్ ను మాత్రం భయపెట్టాడు. 

Jasprit Bumrah Yorkers

బుమ్రా వేసిన  లో యార్కర్.. స్మిత్  కాలును తాకడంతో అతడు అక్కేడే కింద పడిపోయాడు. అయితే ప్యాడ్ ఉండటంతో స్మిత్ కు గాయమేమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ ఆ బంతి నేరుగా తాకి ఉంటే మాత్రం కథ మరో విధంగా ఉండేది. 

ఇదిలాఉండగా రాబోయే టీ20 ప్రపంచకప్ లో బుమ్రా.. ఆస్ట్రేలియాలో బ్యాటర్ల కాళ్లు విరగ్గొడతాడని అంటున్నాడు పాకిస్తాన్ మాజీ ఆటగాడు డానిష్ కనేరియా.  ఫించ్ యార్కర్,  స్మిత్ కు విసిరిన బంతే ఇందుకు సాక్ష్యమంటున్నాడు. 

నాగ్‌పూర్ మ్యాచ్ ముగిశాక తన యూట్యూబ్  ఛానెల్ లో మాట్లాడిన కనేరియా.. ‘బుమ్రా ఈజ్ బ్యాక్ ఆన్ ట్రాక్. రాబోయే టీ20 ప్రపంచకప్ లో ప్రత్యర్థి జట్లు బుమ్రా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బుమ్రా తన రిథమ్ ను ఇంకా పూర్తిగా అందుకోలేదు. కానీ రాబోయే రెండు మూడు మ్యాచ్ లలో అది అతడికి పెద్ద విషయమేమీ కాదు. 

ఈ మ్యాచ్ లో ఫించ్ ను బౌల్డ్ చేసిన యార్కర్ ఒక అద్భుతం. ఆ బంతికి ఫించ్ వద్ద సమాధానం లేదు. ఒక ఆటగాడు గాయం తర్వాత తిరిగి జట్టులో మెరుగైన ప్రదర్శన చేయడం మాములు విషయం కాదు. కానీ నిన్నటి మ్యాచ్ లో వేసింది రెండు ఓవర్లే అయినా బుమ్రా బాగా బౌలింగ్ చేశాడు. రాబోయే టీ20 ప్రపంచకప్ లో బుమ్రా.. ప్రత్యర్థి ఆటగాళ్ల కాళ్లు విరగ్గొట్టడం ఖాయం..’ అని  వ్యాఖ్యానించాడు. 

click me!