పేలవ బౌలింగ్‌తో ముప్పేటదాడి ఎదుర్కుంటున్నా.. భువీకి మద్దతుగా నిలిచిన ఆస్ట్రేలియా దిగ్గజం

First Published Sep 22, 2022, 12:38 PM IST

Bhuvneshwar Kumar: టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఫామ్ పై విమర్శలు వెళ్లువెత్తుతున్న తరుణంలో ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్ అతడికి మద్దతుగా నిలిచాడు. 

ఒకప్పుడు డెత్ ఓవర్లలో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ చేశాడంటే ఆ మ్యాచ్ లో పరుగులు తీయడానికి ప్రత్యర్థి బ్యాటర్లు నానా తంటాలు పడేవారు. బంతికి ఒక్క పరుగు కూడా రాకపోయేది. కానీ గత నాలుగైదు మ్యాచ్ ల నుంచి భువీలో ఆ మ్యాజిక్ కనిపించడం లేదు.

మరీ ముఖ్యంగా ఆసియా కప్ నుంచి  డెత్ ఓవర్లలో భువీ బౌలింగ్ కు ఇస్తే మ్యాచ్ గోవిందా అనే పరిస్థితి వచ్చింది.  ఆ టోర్నీలో పాకిస్తాన్, శ్రీలంకతో పాటు తాజగా ఆస్ట్రేలియాతో తొలి టీ20లో కూడా భువీ ధారాళంగా పరుగలివ్వడమే గాక భారత ఓటమికి ప్రధాన కారణమయ్యాడు. 

ఆసీస్‌తో మ్యాచ్ లో 19వ ఓవర్లో బౌలింగ్ చేసిన భువీ.. 16 పరుగులిచ్చాడు.  అంతమకుందు ఆసియా కప్ లో పాకిస్తాన్, శ్రీలంక పైనా 16, 14 పరుగులు సమర్పించుకున్నాడు.  మొత్తంగా  గత మూడు మ్యాచ్ లలో  19వ ఓవర్లో బౌలింగ్ చేసిన అతడు.. 18 బంతుల్లో ఏకంగా 49 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో  డెత్ ఓవర్లలో భువీకి బౌలింగ్ ఇవ్వకపోవడమే మంచిది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆసీస్ దిగ్గజ ఆటగాడు మాథ్యూ హేడెన్.. భువీకి మద్ధతుగా నిలిచాడు. భువీకి డెత్ ఓవర్లలో బౌలింగ్ ఇవ్వొద్దన్న విమర్శలపై స్పందిస్తూ.. ‘నేను అందుకు అంగీకరించను. చివరి ఓవర్లలో భువనేశ్వర్ కీలకమైన బౌలర్. అంతేగాక భువీ మంచి ఫినిషర్. జట్టులో భువీ పాత్ర కూడా అదే.
 

Image credit: PTI

ఇన్నింగ్స్ ప్రారంభంలో వికెట్లను తీయడంతో పాటు చివర్లో కెప్టెన్ అతడికి ఒకటో లేదా రెండు ఓవర్లు ఇస్తే ఆ పాత్రకూ న్యాయం చేయాలి. ఈ రెంటినీ చేయగల సమర్థుడు భువీ..’ అని మద్దతుగా నిలిచాడు. 

మొహాలీ మ్యాచ్ లో ఓడాక సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. మన బౌలర్లు సరిగా బౌలింగ్ చేయలేదు. అదే ఓటమికి ప్రధాన కారణం.  ఉదాహరణకు 19వ ఓవర్లో భారత్ దారుణంగా విఫలమైంది. ఆ ఓవర్ వేసిన భువీ..  16 పరుగులిచ్చాడు. ఒక్క ఈ మ్యాచ్ లోనే కాదు. గత మూడు మ్యాచ్ లలో కూడా  డెత్ ఓవర్లలో భువీ బౌలింగ్ ఆందోళనకరంగా ఉంది. 

భువనేశ్వర్ అనుభవం కలిగిన బౌలర్.  అటువంటివాడు ప్రత్యర్థులను ఇబ్బందుల్లోకి నెట్టాలి గానీ అతడే ఇలా బౌలింగ్ చేస్తే  ఎలా..?’ అని సన్నీ చెప్పాడు. 
 

click me!