అతడికి ఇంకా వన్డేలు ఆడే మెచ్యూరిటీ రాలేదు.. వెనక్కి పంపేయండి.. టీమిండియా ఆల్ రౌండర్ పై గంభీర్ సంచలన వ్యాఖ్యలు

First Published Jan 25, 2022, 3:58 PM IST

Gautam Gambhir Comments On Venkatesh Iyer: టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్ జట్టులో హార్థిక్ పాండ్యా స్థానాన్ని భర్తీ చేస్తాడని భావిస్తున్న యువ  క్రికెటర్  వెంకటేశ్ అయ్యర్ పై అతడు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

టీమిండియా యువ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కు ఇంకా వన్డేలు ఆడేంత  మెచ్యూరిటీ రాలేదని, అతడిని  వెనక్కి పంపించడం బెటరని గంభీర్ వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ లో ఏడెనిమిది మ్యాచుల   ప్రదర్శన చూసి అవకాశాలిస్తే ఇలాగే ఉంటుందని వ్యాఖ్యానించాడు. 

గంభీర్ స్పందిస్తూ...‘నేను అతడి (వెంకటేశ్ అయ్యర్) ని టీ20 క్రికెటర్ గానే భావిస్తాను.  ఎందుకంటే అతడికి  వన్డేలు  ఆడేంత స్థాయి మెచ్యూరిటీ రాలేదు.  ఐపీఎల్ లో 7-8 మ్యాచులలో అతడి ప్రదర్శన చూసి అయ్యర్ కు భారత జట్టులో అవకాశం కల్పించారు. ఒకవేళ మీరు ఐపీఎల్ ప్రదర్శనలను పరిగణనలోకి తీసుకుని జట్టులోకి ఎంపిక చేస్తే అతడిని టీ20ల వరకే పరిమితం చెయ్యండి. టీ20లతో పోల్చితే వన్డేలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. 

ఐపీఎల్ లో అయ్యర్ కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతూ ఓపెనింగ్ చేశాడు. కానీ ఇప్పుడేమో అతడిని మిడిలార్డర్ లో ఆడిస్తున్నారు. ఒకవేళ అతడిని మీరు వన్డే క్రికెట్ కు తీసుకుని ఉంటే ఇప్పుడే  అయ్యర్ ను వెనక్కి పంపించేయండి.
 

అంతేగాక అతడి  ఐపీఎల్ ఫ్రాంచైజీ (కేకేఆర్) కు కూడా అతడిని అక్కడే ఆడించమని  చెప్పండి (బీసీసీఐని ఉద్దేశిస్తూ..). అతడు టీ20లలో అదీ ఓపెనర్ గానే కరెక్ట్ అని నా అభిప్రాయం’ అని గంభీర్  తెలిపాడు. 
 

ఐపీఎల్-2021  సీజన్ లో భాగంగా యూఏఈ లో జరిగిన రెండో అంచెలో కోల్కతా తరఫున ఓపెనింగ్ ఆడుతూ మెరుపులు మెరిపించాడు  అయ్యర్. పది ఇన్నింగ్సులలో 370 పరుగులు చేసి ఆ జట్టు ఫైనల్ కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శన చూసిన బీసీసీఐ.. అతడిని గతేడాది స్వదేశంలో  న్యూజిలాండ్ తో జరిగిన  మూడు మ్యాచుల టీ 20 సిరీస్ కు ఎంపిక చేసింది. 
 

కానీ ఆ సిరీస్ లో అయ్యర్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక అనంతరం దేశవాళీ క్రికెట్ లో భాగంగా విజయ్ హజారే ట్రోఫీలో రాణించిన వెంకటేశ్ కు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ లో ఆడే అవకాశం వచ్చింది.
 

దక్షిణాఫ్రికాతో రెండు వన్డేలలో కలిసి అతడు 24 పరుగులే చేశాడు.  మీడియం పేసర్ అయిన  అయ్యర్ కు తొలి మ్యాచులో బౌలింగ్ చేసే అవకాశం కూడా ఇవ్వలేదు. వరుసగా రెండు మ్యాచులలో విఫలం కావడంతో అతడికి మూడో వన్డేలో ఛాన్సు రాలేదు. 
 

టీ20లతో పాటు వన్డేలలో కూడా నిరూపించుకోని  అయ్యర్.. త్వరలో వెస్టిండీస్ తో జరిగే  వన్డే, టీ20 సిరీస్ లో అవకాశం దక్కించుకుంటాడా..? అనేది అనుమానంగానే ఉందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. 

click me!