పాండ్యాకు ప్రమోషన్..? కెఎల్ రాహుల్‌కు షాక్.. కీలక ప్రకటన చేయనున్న బీసీసీఐ..?

First Published Aug 4, 2022, 12:14 PM IST

Hardik Pandya: టీమిండియాలో సారథుల సంగతి  ఒకలా ఉంటే వైస్ కెప్టెన్ల కథ మరోలా ఉంది. రోహిత్ శర్మకు డిప్యూటీగా కెఎల్ రాహుల్ ను నియమించినా.. అతడూ కెప్టెన్ బాటలోనే నడుస్తున్నాడు. ఓ సిరీస్ లో ఆడటం.. గాయంతో మరో రెండు సిరీస్ లకు దూరంగా ఉండటం.. ఇలాగే సాగుతుంది  అతడి ప్రయాణం.

టీమిండియాలో విరాట్ కోహ్లీ  సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాక మొదలైన నాయకత్వ సమస్య ప్రతీ సిరీస్ కు వెంటాడుతూనే ఉంది.  మూడు ఫార్మాట్లకూ రోహిత్ శర్మను రెగ్యులర్ సారథిగా నియమించినా అతడు ఓ సిరీస్ కు ప్రజెంట్, మరో సిరీస్ కు ఆప్సెంట్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు.  దీంతో ఏడాది కాలంలోనే భారత్ కు సుమారు 8 మంది సారథులు మారారు. 
 

రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్,  హార్ధిక్ పాండ్యా.. ఈ జాబితాలో  రాబోయే రోజుల్లో ఎవరి పేరు చేరనుందో గానీ ఈ ప్రయోగాలకు ముగింపు ఎక్కడో కూడా తెలియడం లేదు.

అయితే సారథుల సంగతి ఇలా ఉంటే వైస్ కెప్టెన్ల కథ మరోలా ఉంది. రోహిత్ శర్మ ను కెప్టెన్ చేశాక  అతడికి వన్డే, టీ20లలో కెఎల్ రాహుల్ ను వైస్ కెప్టెన్ గా నియమించింది బీసీసీఐ. టెస్టులలో మాత్రం ఆ అవకాశం  బుమ్రాకు  వచ్చింది.  

కానీ రాహుల్ మాత్రం కెప్టెన్ బాటలోనే నడుస్తున్నాడు. ఓ సిరీస్ లో ఆడటం.. గాయంతో మరో రెండు సిరీస్ లకు దూరంగా ఉండటం.. ఇలాగే సాగుతుంది  అతడి ప్రయాణం. దీంతో టీ20, వన్డే జట్లకు రోహిత్ లేని పక్షంలో బీసీసీఐకి కెప్టెన్ తో పాటు వైస్ కెప్టెన్ ను కూడా మార్చాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. 

Image credit: PTI

ఇకనుంచి ఈ చిక్కులకు చెక్ పెట్టాలని  బీసీసీఐ భావిస్తున్నది. పరిమిత ఓవర్ల క్రికెట్ లో రాహుల్ ను రోహిత్ డిప్యూటీగా తప్పించి  ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పజెప్పాలని బీసీసీఐ యోచిస్తున్నది. రీఎంట్రీ తర్వాత అద్భుతాలు చేస్తున్న పాండ్యా.. రోహిత్ డిప్యూటీగా పనికొస్తాడని సెలక్టర్లు నమ్ముతున్నారు. 
 

అదీగాక అతడిలో సారథ్య లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయని సెలక్టర్లు నమ్ముతున్నారు.ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ కు సారథిగా వ్యవహరించిన హార్ధిక్.. తానేంటో నిరూపించుకున్నాడు. కానీ కెఎల్ రాహుల్ మాత్రం సారథిగా ఇంకా  పూర్తిస్థాయిలో నిరూపించుకోలేదు. 
 

రోహిత్ లేని సందర్భాల్లో టీమిండియాకు కెప్టెన్ (దక్షిణాఫ్రికా సిరీస్ లో) గా వ్యవహరించిన రాహుల్ సారథ్యంలో భారత్.. 0-3తేడాతో ఓడింది. ఒక టెస్టులో సారథిగా ఉన్నా అందులోనూ పరాజయం తప్పలేదు. కెప్టెన్సీ వైఫల్యాలతో పాటు ఫిట్నెస్ సమస్యలతో రాహుల్ సతమతమవుతున్నాడు. గడిచిన ఏడాదిలో అతడు  జాతీయ జట్టుకు ఆడినదానికంటే విరామాలు తీసుకున్నదే ఎక్కువ. 

ఈ నేపథ్యంలో సెలక్టర్లు రాహుల్ ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించి ఆ బాధ్యతలు హార్ధిక్ పాండ్యాకు అప్పజెప్పనున్నట్టు తెలుస్తున్నది. ఆసియా కప్ లోనే ఈ నిర్ణయం ప్రకటించే అవకాశముంది. ఆసియా కప్-2022 కోసం భారత జట్టును  సోమవారం ప్రకటించనున్నారు.  ఈ టోర్నీకి కూడా రాహుల్ ఆడే అవకాశాలు తక్కువే ఉన్నాయి. 

ఇంకా అతడు ఫిట్నెస్ టెస్టు లో నిరూపించుకోవాల్సి ఉన్న నేపథ్యంలో సెలక్టర్లు పాండ్యాను రోహిత్ డిప్యూటీగా నియమించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పాండ్యాను ఆసియా కప్ ఒక్కదానికే కాకుండా తదుపరి కూడా కొనసాగించాలని, టీ20 ప్రపంచకప్ -2022లో కూడా అతడినే రోహిత్ డిప్యూటీగా నియమించే దిశగా సెలక్టర్లు ప్రణాళికలు రచిస్తున్నారు. 

click me!