పంజాబ్ క్రికెట్ అసోసియేషన్‌లో అక్రమాలు..! చూస్తూ ఊరుకోనంటున్న భజ్జీ

First Published Oct 7, 2022, 7:54 PM IST

Harbhajan Singh: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) పై  టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత  ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ  హర్భజన్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. పీసీఏ చీఫ్ అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించాడు. 

బీసీసీఐ రాజ్యాంగాన్ని కూడా ఖాతరు చేయకుండా  పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ గుల్జారీందర్ చాహల్  అక్రమాలకు పాల్పడుతున్నాడని   టీమిండియా మాజీ  క్రికెటర్ హర్భజన్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. అధికారాన్ని గుప్పిట్లో ఉంచుకుని  అక్రమాలకు పాల్పడితే వదిలేది లేదని హెచ్చరించాడు. 

ఈ మేరకు పీసీఏకు బహిరంగ లేఖ రాస్తూ.. ‘ప్రస్తుత పీసీఏ అధ్యక్షుడు  అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నాడని  గడిచిన వారం పది రోజులుగా పంజాబ్ క్రికెట్ ప్రేమికులు, స్టేక్ హోల్డర్ల నుంచి పలు ఫిర్యాదులు అందుకుంటున్నా. ఇది  పారదర్శకత, క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. 

ఓటింగ్ హక్కులతో దాదాపు 150 మంది సభ్యులను చేర్చుకోవడానికి పీసీఏ తీవ్రంగా ప్రయత్నిస్తుందని తెలుస్తున్నది. ఇది బీసీసీఐ రాజ్యాంగానికి విరుద్ధం. అంతేగాక పీసీఏ మార్గదర్శకాలు, పారదర్శకత ఉల్లంఘన కిందికే వస్తుంది.. ఈ వ్యవహారానికి సంబంధించి ఇదివరకే బీసీసీఐ అంబుడ్స్‌మెన్ కు ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తున్నది. 

పీసీఏలో ఉన్నత స్థాయిలో ఉన్న  వ్యక్తులు తమపై వచ్చిన ఆరోపణలను కప్పిపుచ్చుకోవడానికి, అక్రమాలను దాచడానికి కనీసం సాధారణ సమావేశాలకు కూడా పిలవకుండా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వారి స్వప్రయోజనాల కోసం  క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు..’అని పేర్కొన్నాడు. 

పంజాబ్ క్రికెట్ అసోసియేషన్.. పంజాబ్, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ లకు గవర్నింగ్ బాడీగా వ్యవహరిస్తున్నది. మాజీ క్రికెటర్, నటుడు గుల్జారీందర్ చాహల్ పీసీఏ చీఫ్ కాగా ఇంద్రజిత్ సింగ్ బింద్రా చైర్మెన్ గా ఉన్నాడు. హర్భజన్ సింగ్ పీసీఏలో చీఫ్ అడ్వైజర్ గా ఉన్నాడు. 

click me!