హ్యాపీ బర్త్‌డే రాహుల్ ద్రవిడ్: బౌలర్లకు దడపుట్టించిన 'ది వాల్' టాప్ 5 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఇవి

First Published | Jan 11, 2025, 11:57 AM IST

Happy Birthday Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ ప్రస్తుతం టెస్టుల్లో నాల్గవ అత్యధిక పరుగులు చేసిన భారత లెజెండరీ కెప్టెన్. 164 మ్యాచ్‌లలో 52.31 సగటుతో 36 సెంచరీలు, 63 అర్ధ సెంచరీలతో 13288 పరుగులు చేశాడు. 

భారత మాజీ కెప్టెన్, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ జనవరి 11న 52 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు సాధించిన రాహుల్ ద్రవిడ్ ను క్రికెట్ వరల్డ్ ది వాల్ అంటూ ముద్దుగా పిలుచుకుంటుంది. 1996లో సింగర్ కప్‌లో శ్రీలంకతో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసిన తర్వాత, ద్రవిడ్ అన్ని ఫార్మాట్లలో అద్భతమైన ఇన్నింగ్స్ లను ఆడుతూ భారత జట్టులో స్థిరపడ్డారు. టీమిండియాకు అనేక విజయాలు అందించి క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 

రాహుల్ ద్రవిడ్ రెండు ఫార్మాట్లలోనూ అసాధారణంగా రాణించారు, కానీ టెస్ట్ క్రికెట్‌లో ఆయన ప్రదర్శన ఎల్లప్పుడూ అత్యుత్తమంగా ఉండేది. అందుకే అతను ‘ద వాల్’ అనే గుర్తింపును పొందాడు. ద్రవిడ్ కెరీర్‌లోని టాప్ 5 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఇలా ఉన్నాయి..

అడిలైడ్‌లో లో భారత్ కు అద్భుత విజయం అందించిన రాహుల్ ద్రవిడ్

2003లో అడిలైడ్‌లో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని రెండో టెస్టులో రాహుల్ ద్రవిడ్ 233 పరుగులు ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చాడు. ఈ ఇన్నింగ్స్ భారత్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగులకు 33 పరుగుల వెనుకంజలో ఉండగా 523 పరుగులు చేయడంలో సహాయపడింది. వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి ఆరో వికెట్‌కు 303 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. లక్ష్మణ్ 148 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో రాహుల్ ద్రవిడ్ 72 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సహాయపడ్డాడు.


కోల్‌కతాలో భారత్ ను ఫాలోఆన్ నుంచి తప్పించి విజయాన్ని అందించిన రాహుల్ ద్రవిడ్ 

2001లో కోల్‌కతాలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ ద్రవిడ్ 180 పరుగుల ఇన్నింగ్స్ తో భారత్ కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. హైదరాబాద్ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌తో కలిసి ఐదో వికెట్‌కు 376 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ భాగస్వామ్యం భారత్ ఫాలోఆన్ ఆడకుండా, చివరికి చారిత్రాత్మక విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ గెలుపుతో టెస్టుల్లో ఆస్ట్రేలియా 16 మ్యాచ్‌ల విజయ పరంపరకు భారత్  బ్రేకులు వేసింది.

పాకిస్తాన్ భయంకర బౌలర్లు రాహుల్ ద్రవిడ్ ను వేడుకున్నవేళ ! 

2004లో రావల్పిండిలో పాకిస్తాన్‌పై 270 పరుగుల ఇన్నింగ్స్ రాహుల్ ద్రవిడ్ కెరీర్ లో గొప్ప ఇన్నింగ్స్ అని చెప్పాలి. భయంకరమైన బౌలర్లు రాహుల్ ద్రవిడ్ ముందు క్రీజు వదలమని వేడుకున్నారు.  షోయబ్ అక్తర్, మహ్మద్ సమీ, దానిష్ కనేరియా వంటి బౌలర్లను ఎదుర్కొంటూ ద్రవిడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ద్రావిడ్ ఆటతో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 600 పరుగులు చేసింది. ఒక ఇన్నింగ్స్ తేడాతో భారత్ మ్యాచ్ ను గెలుచుకోగా, పాకిస్తాన్‌లో భారత్ తొలి టెస్ట్ సిరీస్ విజయాన్ని కూడా అందుకుంది.

భారత జట్టును వైట్ వాష్ నుంచి తప్పించిన రాహుల్ ద్రవిడ్ 

దక్షిణాఫ్రికాలో తన తొలి టెస్ట్ పర్యటనలో రాహుల్ ద్రవిడ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడాడు. మూడు టెస్టుల్లో 277 పరుగులు చేశాడు. మూడో టెస్టులో 148, 81 పరుగుల ఇన్నింగ్స్‌లు భారత్ సిరీస్ వైట్‌వాష్‌ను తప్పించుకోవడంలో కీలక పాత్ర పోషించాయి. ద్రవిడ్ 148 పరుగుల ఇన్నింగ్స్, అతని తొలి టెస్ట్ సెంచరీ, భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 410 పరుగులు చేయడంలో సహాయపడింది. రెండో ఇన్నింగ్స్‌లో ద్రవిడ్ 81 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. 

గెట్టి ఇమేజెస్

భారత జట్టు కష్టసమయంలో అండగా నిలిచిన రాహుల్ ద్రవిడ్

భారత జట్టు కష్టసమయంలో ఉన్నప్పుడు రాహుల్ ద్రావిడ్ అద్భుమైన ఇన్నింగ్స్ లతో ఆదుకున్నాడు. జట్టుకు అవసరమైన సమయంలో ద్రవిడ్ భారత్‌కు అండగా నిలవడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాదించాడు. 2006లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో నాల్గవ టెస్ట్‌లో అలాంటి ఇన్నింగ్స్ ఒకటి. వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో ద్రవిడ్ 215 బంతుల్లో 81 పరుగులు చేసి మొదటి ఇన్నింగ్స్‌లో 200 పరుగుల మార్కును అందుకునేలా చేశాడు.

రెండో ఇన్నింగ్స్‌లో ద్రవిడ్ 166 బంతుల్లో 68 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ రెండో ఇన్నింగ్స్ లో 171 పరుగులకు ఆలౌట్ అయ్యాడు. దీంతో భారత జట్టు వెస్టిండీస్‌కు 269 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 49 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. 

2012లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ద్రవిడ్ చివరి టెస్ట్. ప్రస్తుతం టెస్టుల్లో నాల్గవ అత్యధిక పరుగుల చేసిన ప్లేయర్ గా ఉన్నాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా, కెప్టెన్ గా భారత జట్టుకు అనేక అద్భుతమైన విజయాలు అందించాడు. కష్టసమయంలో భారత్ ను అదుకునే ఇన్నింగ్స్ లను ఆడాడు. 

164 మ్యాచ్‌లలో 52.31 సగటుతో 36 సెంచరీలు, 63 అర్ధ సెంచరీలతో 13288 పరుగులు చేశాడు రాహుల్ ద్రవిడ్. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక బంతులు (31,258 బంతులు), అత్యధిక నిమిషాలు (44,152 నిమిషాలు) ఆడిన రికార్డును సాధించాడు. 

Latest Videos

click me!