‘మీకు వికెట్లు తీసే స్పిన్నర్ కావాలంటే జడేజా, అశ్విన్‌లు వేస్ట్.. వాళ్లు ముగ్గురే బెస్ట్’

First Published Aug 14, 2022, 11:43 AM IST

T20 World Cup 2022: ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఆసీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. ఈ మేరకు వచ్చే నెలలో  బీసీసీఐ  సెప్టెంబర్ మూడో వారంలో జట్టును ప్రకటించనుంది. 

టీమిండియా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనకు వెళ్లింది. అక్కడ మూడు వన్డేలు ఆడిన తర్వాత నేరుగా ఆసియా కప్ కోసం దుబాయ్ వెళ్లనుంది. ఆసియా కప్ అనంతరం భారత జట్టు అక్టోబర్ లో ఆస్ట్రేలియాలో జరుగబోయే 8వ టీ20   ప్రపంచకప్ ఆడే జట్టును సెప్టెంబర్ లో ప్రకటించనున్నారు. మూడో వారంలో జట్టును ప్రకటించే అవకాశముంది. 

అయితే ఆస్ట్రేలియాకు ఏ ఏ ఆటగాళ్లను పంపించాలి..? అనేదానిమీద ఇప్పటికే జోరుగా చర్చలు సాగుతున్నాయి. క్రికెట్ పండితులు, విశ్లేషకులు, విమర్శకులు ఎవరికి తోచిన విధంగా వాళ్లు సూచనలు చేస్తున్నారు. తాజాగా టీ20  ప్రపంచకప్ లో ఆడబోయే స్పిన్నర్లపై టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుతం కామెంటేటర్ గా వ్యవహరిస్తున్న ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

టీ20  ప్రపంచకప్ లో ఆడబోయే జట్టులో  వికెట్లు తీసే స్పిన్నర్లు  కావాలంటే వాళ్లు (సెలక్టర్లు) టీమిండియా వెటరన్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అశ్విన్ లతో పాటు స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను తీసుకుంటే ఉపయోగమేమీ లేదని చోప్రా అంటున్నాడు. 

తాజాగా అతడు తన యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ‘టీ20 ప్రపంచకప్ లో వికెట్లు తీసే స్పిన్నర్ల కోసం చూస్తే మాత్రం  రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్,  అక్షర్ పటేల్ లను తీసుకుంటే ఏం ఉపయోగం లేదు. వాళ్ల బౌలింగ్ లో వేరియేషన్ ఉండదు. 

కానీ యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ లను తుది జట్టులోకి తీసుకుంటే టీమిండియాకు మంచిది.  ఈ ముగ్గురి బౌలింగ్ లో  వైవిధ్యం ఉంటుంది. అంతేగాక వాళ్లు వికెట్లు తీయగలరు.

గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసినప్పట్నుంచి కుల్దీప్ యాదవ్ రెండు టీ20లు మాత్రమే ఆడాడు. అతడు మూడు వికెట్లు తీశాడు. కానీ ఐపీఎల్ లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతూ 14 మ్యాచులలో 21 వికెట్లు పడగొట్టాడు. 

మూస బౌలింగ్ కంటే బౌలింగ్ లో వైవిధ్యమున్న బౌలర్ ఎక్కువ వికెట్లు తీసే అవాకశముంటుంది. ఇక కుల్దీప్-బిష్ణోయ్ ల మధ్య పోటీ ఎదురైతే నేను మాత్రం చైనామెన్ బౌలర్ (కుల్దీప్) వైపునకే మొగ్గుచూపుతా..’ అని అన్నాడు. 

click me!