నీ భార్యాపిల్లల గురించి మరిచిపో.. పదేండ్లు వెనక్కి వెళ్లు : కోహ్లికి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ సూచన

First Published May 13, 2022, 6:06 PM IST

Michael Vaughan Advice to Virat Kohli: గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న విరాట్ కోహ్లికి సలహాలు ఇచ్చేవాళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. తాజాగా ఆ  జాబితాలో ఇంగ్లాండ్ మాజీ సారథి  మైఖెల్ వాన్ కూడా చేరాడు. 

ఫామ్ కోల్పోయి ఈ ఐపీఎల్ సీజన్ లో దారుణంగా విఫలమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లి.. నేడు పంజాబ్ కింగ్స్ తో జరుగబోయే మ్యాచ్ లో అయినా రాణించాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు.  

అయితే ఫామ్ లేమితో  ఇబ్బందులు పడుతూ వరుసగా విఫలమవుతున్న కోహ్లికి ఇటీవల సలహాలు ఇచ్చేవారి సంఖ్య ఎక్కువైంది.  టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మొదలుకుని  చాలా మంది క్రికెటర్లు కోహ్లి కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోని తిరిగి గ్రౌండ్ లోకి అడుగుపెడితే  మళ్లీ మునపటి విరాట్ ను చూస్తామని సూచిస్తున్నారు. 

Michael Vaughan

తాజాగా ఆ జాబితాలో   మైఖెల్ వాన్ కూడా చేరాడు.  వాన్ మాట్లాడుతూ.. ‘‘ఫామ్ కోల్పోయిన కోహ్లి తో ఆర్సీబీ సారథి డుప్లెసిస్  మాట్లాడి ఉంటాడు. డుప్లెసిస్ కోహ్లితో.. ‘నువ్ పదేండ్లు వెనక్కి వెళ్లు.  నీకు ఈ పేరు, ప్రతిష్ట, ఇమేజ్ లేనప్పుడు ఎలా ఉండేవాడివో అలా ఉండు... 

నీకు పెళ్లైన సంగతి, నీ భార్యాపిల్లల గురించి కూడా మరిచిపో.. నీ వయసును మరిచిపో. ఈ విమర్శలేవీ పట్టించుకోకు. నువ్వు ఇన్నాళ్లు ఏం సాధించావన్నది కూడా పక్కనబెట్టు.. అలా చేస్తే నువ్వు మళ్లీ మునపటి ఆట ఆడతావ్.. తిరిగి ఫామ్ ను పొందుతావు..’ అని చెప్పుంటాడు..’ అని వాన్ తెలిపాడు. 

అంతేగాక  కోహ్లి ఒకవేళ మంచి ఆరంభాలను సద్వినియోగం  చేసుకుని అతడు 35-40 పరుగులు చేస్తే అతడు మరింత ప్రమాదకారి అవుతాడని, ఇక అతడిని ఆపడం ఎవరి తరమూ కాదని  వాన్ అన్నాడు. 

‘విరాట్ గనక 35-40 పరుగులు చేస్తే అతడు మరింత  ప్రమాదకారి. పది లోపు అతడిని ఒత్తిడికి గురిచేస్తేనే తప్ప  40 పరుగులకు చేరాడంటే ఇక బౌలర్లకు అది పీడకలే.. ఇక అప్పుడు విరాట్ ను ఆపడం ఎవరితరమూ కాదు..’ అని వాన్ వివరించాడు.

Virat Kohli

ఈ ఐపీఎల్ సీజన్ లో కోహ్లి.. 12 మ్యాచులాడి 19.64 సగటుతో 216 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో అతడు మునుపెన్నడూ లేనంతగా  3 సార్లు గోల్డెన్ డకౌట్ అయ్యాడు.  12 మ్యాచుల్లో ఒక్కటే హాఫ్ సెంచరీ సాధించాడు.  

ఇక ఆర్సీబీ నేడు పంజాబ్ కింగ్స్ తో తలపడుతున్నది. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న ఈ రెండు జట్లకూ ఈ మ్యాచ్ ఎంతో కీలకం. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో (12 మ్యాచులు.. 7 విజయాలు, 5 ఓటములు, 14 పాయింట్లు) లో ఉన్న ఆర్సీబీ ప్లేఆఫ్ చేరాలంటే ఈ మ్యాచ్ ఘన విజయం సాధించాలి. తద్వారా ఆ జట్టు రన్ రేట్ కూడా పెరుగుతుంది. ఇక పంజాబ్ (11 మ్యాచులు 5 గెలుపు, 6 ఓటమి.. 10 పాయింట్లు) పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్ గెలిస్తేనే పంజాబ్ కు ప్లేఆఫ్ అవకాశాలుంటాయి. 

click me!