రోహిత్ - రాహుల్ వద్దు.. వెంటనే కోచ్, కెప్టెన్‌ను మార్చండి..

First Published | Nov 11, 2022, 2:44 PM IST

టీ20 ప్రపంచకప్ లో భారత్ సెమీస్ లో ఇంటి ముఖం పట్టిన నేపథ్యంలో  జట్టులో ప్రక్షాళన చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ లను తప్పించడమే మంచిదన్న వాదనలూ  వెల్లువెత్తుతున్నాయి. 

‘బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయి..’ అని తెలుగులో ఓ పాత సామెత మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు  ఈ సామెత  టీమిండియా సారథి రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ లకు చాలా అవసరం ఉన్నట్టుంది.   ఎందుకంటే టీమిండియాలో రోహిత్ శర్మ కెప్టెన్సీ, రాహుల్ ద్రావిడ్ కోచింగ్ బాధ్యతలు ఒకేసారిగా మొదలయ్యాయి.  

ఈ ఇద్దరి నియామకం జరిగినప్పుడు భారత మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ పండితులు, విశ్లేషకులు కూడా వీళ్లిద్దరి జోడీ అదుర్స్ అని.. ఇద్దరిలోనూ కామన్ గా ఉన్న  లక్షణం   ఎటువంటి పరిస్థితుల్లో అయినా కామ్ గా ఉండటమని.. ఇద్దరూ  చడీ చప్పుడు కాకుండా పని చేసుకుపోతారని, ఇక భారత్ కు ఐసీసీ ట్రోఫీల బెంగ తీరినట్టేనని ప్రశంసలు కురిశాయి. 

Latest Videos


అందుకు సాక్ష్యాలుగా భారత జట్టు ద్వైపాక్షిక సిరీస్ లలో అప్రతీహాత విజయాలు  సాధించింది. అపజయమన్నదే లేకుండా ముందుకు సాగింది. కానీ   కాలం ఎప్పటికీ మనకు అనుకూలంగా ఉండదు.  ఈ ఇద్దరూ కలిసి  ఈ ఏడాది ఆగస్టులో ముగిసిన ఆసియాకప్ వంటి మెగా  టోర్నీలో అద్భుతాలు చేస్తారని ఫ్యాన్స్ ఆశించారు. కానీ అదేం జరగలేదు. 

పోన్లే ఆసియా కప్ ది ఏముంది..? టీ20 ప్రపంచకప్  మనదే అనుకున్నారంతా. అంతకుముందు భారత్.. స్వదేశంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలను ఓడించింది.  ఇది మంచీ శకునమే అనుకున్నారు. టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్జేజ్ లో ఆడిన ఐదు మ్యాచ్ లలో నాలుగింటిలో గెలిచి అదరగొట్టడంతో ఇక ఫైనల్ లో గెలవడమే తరువాయి అని అంచనాలు వేశారు. 

కానీ ఒక్క మ్యాచ్  తో అంతా తలకిందులైంది. ఇంగ్లాండ్ చేతిలో ఓడిన తర్వాత భారత జట్టుపై ఇన్నాళ్లు ప్రశంసలు కురిపించినవాళ్లు ఇప్పుడు దుమ్మెత్తిపోస్తున్నారు. జట్టును మార్చేయాలని.. సీనియర్లను తొలగించడంతో పాటు రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ లను టీ20ల నుంచి తప్పించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

ఇదే విషయమై ఫ్యాన్స్ తో పాటు  టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా స్పందించాడు.  ఈ ద్వయం స్థానాన్ని  హార్ధిక్ పాండ్యా - ఆశిష్ నెహ్రాతో భర్తీ చేయాలని భజ్జీ  సూచించాడు. ఓ జాతీయ ఛానెల్ తో భజ్జీ మాట్లాడుతూ.. ‘టీ20లలో  ఇటీవలే క్రికెట్  కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాడికి హెడ్ కోచ్ బాధ్యతలు అప్పజెప్పండి.

ఆశిష్ నెహ్రా కు హెడ్ కోచ్, హార్ధిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పజెప్పాలి...’అని డిమాండ్ చేశాడు. ఇదే భజ్జీ రోహిత్ కెప్టెన్ అయి, ద్రావిడ్ హెడ్ కోచ్ అయినప్పుడూ ఈ ద్వయం అద్భుతాలు చేస్తుందని వ్యాఖ్యానించడం గమనార్హం. 

ఈ జోడీ ఈ ఏడాది  తాము ప్రాతినిథ్యం వహించిన ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ కు టైటిల్ అందించడం విశేషం. కెప్టెన్ గా  పాండ్యాకు, హెడ్ కోచ్ గా నెహ్రాకు ఇదే ఫస్ట్ సీజన్ కావడం గమనార్హం. అయినా ఈ ద్వయం ఎంతో కూల్ గా పనికానిచ్చేసింది. దీంతో   రాహుల్ - రోహిత్ జోడీని పక్కనబెట్టి   టీ20ల వరకు నెహ్రా - పాండ్యాలను ఎంపిక చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.   

click me!