ధోని, కోహ్లీలను ఆరాధించడం దేనికి..? వాళ్లేమైనా దేవుళ్లా..? గౌతం గంభీర్ షాకింగ్ కామెంట్స్

First Published Sep 19, 2022, 4:27 PM IST

Indian Cricket Heroes: నాటి కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ ల నుంచి మొదలు నిన్నటితరం సచిన్ టెండూల్కర్ లపై టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్  వారి అభిమాన క్రికెటర్లను దేవుళ్ల కంటే ఎక్కువగా  కొలిచారు.

భారత్ లో క్రికెట్‌ను ఓ మతంగా పరిగణిస్తే క్రికెటర్లను దేవుళ్లుగా పూజించే దేశం మనది. నాటి కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ ల నుంచి మొదలు నిన్నటితరం సచిన్ టెండూల్కర్ లపై టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్  వారి అభిమాన క్రికెటర్లను దేవుళ్ల కంటే ఎక్కువగా  కొలిచారు. ఇండ్లల్లో వారి ఫోటోలను పెట్టుకుని ఆరాధించారు. 
 

ఆ కోవలో నేటి తరంలో వినిపించే క్రికెటర్ల పేర్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ. భారత క్రికెట్ లో ఈ ఇద్దరూ సాధించిన ఘనతలు అంతా ఇంతా కావు.  ఆటగాడిగానే గాక  కెప్టెన్ గా ధోని భారత క్రికెట్ లో ఆరాధ్య దైవంగా కీర్తించబడుతున్నాడు.

ఇక గడిచిన దశాబ్దకాలంగా ప్రపంచ క్రికెట్ ను మకుటం లేని మహారాజులా ఏలుతున్న విరాట్ కోహ్లీ కూడా సచిన్  వారసుడిగా మన్ననలు అందుకుంటున్నాడు. కెప్టెన్సీ లేకున్నా.. ఫామ్ కోల్పోయినా భారత క్రికెట్ లో ప్రస్తుతం విరాట్ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ మరో క్రికెటర్ కు లేదంటే అతిశయోక్తి కాదు. 

అయితే క్రికెటర్లను ఇలా ఆరాధించడం టీమిండియా మాజీ ఆటగాడు, ప్రస్తుతం ఎంపీగా ఉన్న గౌతం గంభీర్ కు నచ్చడం లేదు. ఆటగాళ్లేం దేవుళ్లు కాదని..  జట్టు ముఖ్యమని వ్యాఖ్యానించాడు.  ధోని, కోహ్లీ వంటి ఆటగాళ్లను  దైవాలుగా మారుస్తున్న ఫ్యాన్స్, సోషల్ మీడియా, ప్రసారకర్తల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. 

తాజాగా గంభీర్ ఇదే విషయమై ఓ జాతీయ పత్రికతో మాట్లాడుతూ.. ‘భారత్ ఇప్పటికైనా ఈ  ఆరాధన భావం నుంచి బయటకు రావాలి. వ్యక్తి ఆరాధన  క్రికెట్ లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా.. ఏ రంగంలో ఉన్నా ప్రమాదకరమే. క్రికెట్ హీరోలపై భక్తి, ఆరాధన కురిపించాల్సిన అవసరం లేదు. ఇండియా క్రికెట్ అనేది ముఖ్యం తప్ప క్రికెటర్లు కాదు. 

అసలు ఈ  హీరో ఆరాధన అనేది ఎవరు సృష్టించారు..? అనే ప్రశ్నకు రెండు సమాధానాలు చెప్పొచ్చు. అందులో ఒకటి సోషల్ మీడియా. అసలు ఇందులో ఉండేదంతా ఫేక్ సమాచారమే. కానీ సోషల్ మీడియాలో ఉండే ఫాలోవర్లను బట్టి  క్రికెటర్ల విలువ లెక్కించబడుతున్నది. తద్వారా వాళ్లకు ఒక బ్రాండ్ ఏర్పడుతున్నది. 
 

ఇక రెండోది బ్రాడ్కాస్టర్లు (ప్రసారకర్తలు), మీడియా.  మీడియాలో ఒక వ్యక్తి గురించి అదే పనిగా ఊదరగొడుతుంటే  అతడి బ్రాండ్ పెరుగుతున్నది. అసలు ఇండియా క్రికెట్ అంటే  2007 నుంచే అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ అంతకంటే ముందు 1983లో ఇండియా  వన్డే ప్రపంచకప్ గెలిచింది. అయితే భారత్ అప్పుడు ప్రపంచకప్ గెలిచినప్పుడు కపిల్ దేవ్ హీరో అయ్యాడు. 

ఇక 2007, 2011లో భారత్ టీ20, వన్డే ప్రపంచకప్ లు గెలిచినప్పుడు ధోని హీరో అయ్యాడు. అసలు దానిని ఎవరు సృష్టించారు..? ప్లేయర్లు ఎవరూ అలా చేయరు.. బీసీసీఐ కూడా అలా చేయదు. అంతా మీడియా మహిమ. 
 

భారత క్రికెట్ అంటే ఇద్దరో ముగ్గురో కాదు. వాళ్ల వల్లే అంతా నడుస్తుందనుకుంటే పొరపాటు. భారత క్రికెట్ మనుగడ సాగించేది డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చునే  15 మంది ఆటగాళ్ల వల్ల.. ఏ  ఇద్దరు ముగ్గురి వల్లో కాదు..’ అని ఘాటు కామెంట్స్ చేశాడు.  

click me!