కిల్లర్ మిల్లర్‌కే పగ్గాలు అప్పజెప్పిన రాజస్తాన్ రాయల్స్.. పార్ల్ ఫ్రాంచైజీకి అతడే సారథి

First Published Sep 19, 2022, 3:44 PM IST

SA T20: వచ్చే ఏడాది జనవరి నుంచి  దక్షిణాఫ్రికా వేదికగా ప్రారంభం కానున్న ఎస్ఎటీ20 లీగ్ లో రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసిన పార్ల్ రాయల్స్ కు సారథి దొరికేశాడు. 
 

David Miller

మినీ ఐపీఎల్ గా పిలువబడుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్ లో  పెట్టుబడులు పెట్టిన రాజస్తాన్ రాయల్స్.. తాము కొనుగోలు చేసిన పార్ల్ రాయల్స్ కు  సారథిని నియమించుకుంది.  ఐపీఎల్ లో గతంలో తమతో ఆడిన సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ కే ఆ పగ్గాలు అప్పజెప్పింది. 
 

ఈ మేరకు ఆదివారం పార్ల్ రాయల్స్ ట్విటర్ ఖాతా వేదికగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.  ఎస్ఎటీ20 తొలి ఎడిషన్ లో తమ జట్టుకు మిల్లర్ సారథ్య బాధ్యతలను మోస్తాడని  తెలిపింది. 

David Miller

ఇందుకు సంబంధించి మిల్లర్ తో ఓ చిన్న వీడియో బైట్ ను కూడా విడుదల చేసింది. వీడియోలో మిల్లర్.. ‘హలో.. నేను డేవిడ్ మిల్లర్. పార్ల్ రాయల్స్ కెప్టెన్ ను..’ అంటూ ఫోన్ లో మాట్లాడినట్టుగా ఉంది. 
 

పార్ల్ రాయల్స్ కు కెప్టెన్ గా వ్యవహరించనున్న  మిల్లర్ కు రాజస్తాన్ తో గతంలోనే అనుబంధం ఉంది. 2020, 2021 ఐపీఎల్ సీజన్లలో మిల్లర్.. రాజస్తాన్ తరఫునే ఆడాడు. అయితే  రెండు సీజన్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దీంతో అతడిని వేలానికి వదిలేసింది రాజస్తాన్. 

వేలంలో మిల్లర్ ను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది.  ఈ సీజన్ లో గుజరాత్ విజయాల్లో మిల్లర్ కీలక పాత్ర పోషించాడు. 2022 సీజన్ లో 16 మ్యాచ్ లు ఆడి 481 పరుగులు చేశాడు.  

కాగా ఐపీఎల్ తర్వాత ఇటీవలే ముగిసిన ఇంగ్లాండ్ పర్యటనలో సౌతాఫ్రికా రెగ్యులర్ సారథి టెంబ బవుమా గాయపడటంతో టీ20లకు మిల్లర్ సారథిగా వ్యవహరించాడు. ఈ సిరీస్ ను సఫారీ జట్టు 2-1 తేడాతో గెలుచుకుంది.  మిల్లర్ ప్రస్తుతం కరేబియన్  ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) లో బార్బోడస్ రాయల్స్ కు సారథిగా ఉన్నాడు.  

ఇక పార్ల్ రాయల్స్ జట్టులో ఇప్పటికే  జోస్ బట్లర్, ఒబెడ్ మెక్ కాయ్ వంటి అంతర్జాతీయ స్టార్లు కూడా ఉన్నారు. ఈ ఇద్దరూ ఐపీఎల్ లో  రాజస్తాన్ రాయల్స్ కు ఆడేవాళ్లే. ఈ జట్టుకు  దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు జేపీ డుమిని హెడ్ కోచ్ గా వ్యవహరించనున్నాడు. 

click me!