కోహ్లీ అక్కడున్నది కఠిన పరిస్థితుల్లో రన్స్ చేయడానికి.. ఇలా ఆడితే..! గంభీర్ షాకింగ్ కామెంట్స్

First Published Jan 13, 2023, 3:22 PM IST

INDvsSL: తొలి వన్డేలో రోహిత్, శుభమన్ గిల్ తో పాటు కోహ్లీ  అద్భుతమైన రీతిలో ఆడగా రెండో వన్డేలో ఈ  ముగ్గురూ దారుణంగా విఫలమయ్యారు. అయితే కోహ్లీ నిష్క్రమించిన తీరుపై సోషల్ మీడియాలో అతడి ఫ్యాన్స్ తో పాటు టీమిండియా అభిమానులు కూడా నిరాశ  వ్యక్తం చేశారు.   

టీమిండియా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ  మూడేండ్ల తర్వాత గతేడాది మునపటి ఫామ్ ను అందుకున్నాడు. గతేడాది ఆసియా కప్ లో  ఆఫ్గానిస్తాన్ పై  సెంచరీ చేసిన అతడు..  డిసెంబర్ లో  బంగ్లాదేశ్ తో ముగిసిన చివరి వన్డేలో సైతం  సెంచరీ బాదాడు.  ఆ తర్వాత నేరుగా  శ్రీలంకతో తొలి వన్డేలో కూడా  మూడంకెల స్కోరుకు చేరాడు. 

కానీ రెండో వన్డేలో కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు.  ఈడెన్ గార్డెన్స్ లో  నాలుగు పరుగులే చేసి   లాహిరు  కుమార బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.  ఛేదనలో మొనగాడుగా పేరున్న కోహ్లీ..  కీలక మ్యాచ్ లో  అలా వికెట్ చేజార్చుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.  

చేయాల్సింది స్వల్ప లక్ష్యమే అయినా ఈ మ్యాచ్ లో టీమిండియా వరుసబెట్టి వికెట్లను కోల్పోయింది.  తొలి వన్డేలో రోహిత్, శుభమన్ గిల్ తో పాటు కోహ్లీ  అద్భుతమైన రీతిలో ఆడగా రెండో వన్డేలో ఈ  ముగ్గురూ దారుణంగా విఫలమయ్యారు. అయితే కోహ్లీ నిష్క్రమించిన తీరుపై సోషల్ మీడియాలో అతడి ఫ్యాన్స్ తో పాటు టీమిండియా అభిమానులు కూడా నిరాశ  వ్యక్తం చేశారు.   

సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో తాము  కోహ్లీ వైపు చూస్తామని, కానీ  అతడే ఇలా వికెట్ చేజార్చుకుంటే ఎలాగని  కామెంట్లు వినిపించాయి.  ఈ నేపథ్యంలో  టీమిండియా ఓపెనర్ గౌతం గంభీర్ అతడికి మద్దతుగా  నిలిచాడు. మాములుగా  కోహ్లీని గంభీర్ పొగడటం, అతడికి మద్దతుగా నిలవడం చాలా అరుదు. నిత్యం  కోహ్లీని   విమర్శించడం పనిగా పెట్టుకున్నాడని గంభీర్ మీద విమర్శలు కూడా వస్తాయి. మరీ ముఖ్యంగా కోహ్లీ ఫ్యాన్స్  గంభీర్ కామెంట్స్ కు రెస్పాండ్ అవడం కూడా మానేశారు.   కానీ ఉన్నఫళంగా గంభీర్.. కోహ్లీకి మద్దతుగా నిలవడం గమనార్హం. 

కోహ్లీ ప్రదర్శనపై గంభీర్   స్టార్ స్పోర్ట్స్ లో  మ్యాచ్ అనంతరం నిర్వహించిన చర్చా కార్యక్రమంలో మాట్లాడాడు.  ‘విరాట్ కోహ్లీ అక్కడ (జట్టులో) ఉన్నది ఎందుకంటే అతడు విరాట్ కోహ్లీ కాబట్టి.  ఇలాంటి కఠిన పరిస్థితుల్లో   కోహ్లీ టీమిండియాకు ఒంటిచేత్తో విజయాలు అందించాడు. టన్నుల కొద్దీ పరుగులు చేశాడు.  కానీ అన్నిసార్లు మ్యాచ్ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు..’అని అన్నాడు. 

మొన్నటికి మొన్న తొలి వన్డే ముగిసిన తర్వాత  కోహ్లీని చాలా మంది సచిన్ తో పోల్చడం..  టెండూల్కర్ రికార్డులను కోహ్లీ బద్దలుకొడతాడని   చర్చ జరిగినప్పుడు  గంభీర్ స్పందించిన తీరు వివాదాస్పదమైంది. 

గంభీర్ మాట్లాడుతూ.. ‘కోహ్లీని సచిన్ తో పోల్చడం  సరికాదు. సచిన్ క్రికెట్ ఆడేప్పుడు  నిబంధనలు వేరు. ఇప్పుడున్నవి వేరు.  సచిన్ ఆడినప్పుడు   30 యార్డ్ సర్కిల్ లో ఐదుగురు ఫీల్డర్ల నిబంధన అమల్లో లేదు. ఇప్పుడు క్రికెట్ లో నిబంధనలు  బ్యాటర్లకు  అనుకూలంగా ఉంటాయి.  అప్పుడు కూడా ఇలాగే ఉండి ఉంటే సచిన్ మరిన్ని పరుగులు చేసి ఉండేవాడు...’ అని వ్యాఖ్యానించాడు. 
 

click me!