IPL2021: 2008 నుంచి 2020 దాకా ఐపీఎల్ ఫైనల్లో ఇరగదీసిన మొనగాళ్లు వీళ్లే.. రేపటి వీరుడు ఎవరో మరి..?

First Published Oct 14, 2021, 6:20 PM IST

Player Of The Match in Ipl Finals: ఐపీఎల్ లీగ్ మ్యాచ్ లంటేనే డూ ఆర్ డై అన్నట్టుగా ఆడే ఆటగాళ్లు ఫైనల్స్ లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు. తమలోని అత్యుత్తమ ఆటను బయటపెట్టాలని అనుకుంటారు. ఐపీఎల్ ఆరంభం నుంచి గత సీజన్ దాకా ఈ ధనాధన్ గేమ్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఎవరు సొంతం చేసుకున్నారో చూద్దాం. 

ఇంగ్లండ్ లో  పుట్టి అక్కడ విజయవంతమైన  పొట్టి క్రికెట్ కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చింది నిస్సందేహంగా ఐపీఎల్ అనేది ఎవ్వరూ కాదనలేని అంశం. అయితే 2008 నుంచి 2020 దాకా జరిగిన ఐపీఎల్ సీజన్లలో చాలా మంది మ్యాచ్ విన్నర్లను మనం చూశాం. ఇక ఫైనల్ పోరు అంటే కొదమసింహాల్లా పోరాడే ఆటగాళ్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసినవాళ్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యారు. అలా 2008 నుంచి ప్రతి ఫైనల్లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరో ఒకసారి చూద్దాం. 

యూసుఫ్ పఠాన్: 2008 లో జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్ రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్తాన్ తరఫున ఆడిన యూసుఫ్ పఠాన్ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ముందు బౌలింగ్ లో  22 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన YUSUF PATHAN.. బ్యాటింగ్ లో 39 బంతుల్లోనే 56 పరుగులు చేసి తన జట్టును గెలిపించుకున్నాడు. దీంతో అతడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

అనిల్ కుంబ్లే: 2009 సీజన్ లో వెటరన్ ఇండియా స్పిన్నర్ ANIL KUMBLEకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఫైనల్ మ్యాచ్ లో డెక్కన్ చార్జర్స్ (ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్) తో పోటీ పడిన ROYAL CHALLENGERS BANGLORE ఆ పోటీలో 6 పరుగుల తేడాతో ఓడింది. కానీ ఆ మ్యాచ్ లో కుంబ్లే 16 పరుగులిచ్చి నాలుగు వికెట్లు  తీశాడు.
 

సురేశ్ రైనా: 2010 సీజన్ లో CHENNAI SUPER KINGS-MUMBAI INDIANS మధ్య ఫైనల్ జరిగింది. ఈ మ్యచ్ లో చెన్నై తరఫున ఆడిన SURESH RAINA.. 35 బంతుల్లో 57 రన్స్ చేశాడు. అంతేగాక ఆ బౌలింగ్ లో ఒక వికెట్ కూడా తీశాడు. 

మురళీ విజయ్: 2011 సీజన్ లో కూడా చెన్నై ఫైనల్ చేరింది. ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్  చేసిన సీఎస్కే.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. CSK ఓపెనర్ MURALI VIJAY 52 బంతుల్లోనే 95 పరుగులు చేశాడు. ఇందులో 10 బౌండరీలు, 6 సిక్సర్లున్నాయి. అనంతరం బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. 8 వికెట్లు కోల్పోయి 147 పరుగుల వద్దే ఆగిపోయింది. 

మన్విందర్ బిస్లా: 2012 సీజన్ లో సీఎస్కే తో పాటు KOLKATA KNIGHT RIDERS ఫైనల్స్ కు  చేరింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన  CSK.. 191 పరుగులు చేసింది. అనంతరం ఛేదన చేపట్టిన KKR.. ఈ లక్ష్యాన్ని అందుకుంది. కేకేఆర్ బ్యాటింగ్ లో మన్వీందర్ బిస్లా రెచ్చిపోయి ఆడాడు. 48 బంతుల్లోనే 89 పరుగులు చేసి కోల్కతా కు తొలి ఐపీఎల్ కప్ అందించాడు. 

కీరన్ పొలార్డ్: 2013 సీజన్ లో ఫైనల్ కు చేరిన ముంబై ఇండియన్స్.. సీఎస్కే కు చుక్కలు చూపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై..  20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసింది. అనంతరం చెన్నైని 125 పరుగులకే కట్టడి చేసింది. ఆ మ్యాచ్ లో ముంబై ఆటగాడు KIERON POLLARD.. 32 బంతుల్లో 60 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.
 

మనీష్ పాండే: 2014 సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ సూపర్ కింగ్స్ మధ్య ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ తరఫున ఆడిన మనీష్ పాండే.. 50 బంతుల్లోనే 94 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ నిర్దేశించిన 200 పరుగుల లక్ష్యం ఆవిరైపోయింది. 

రోహిత్ శర్మ: 2015 సీజన్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ అవార్డు అందుకున్నాడు.  ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. 5 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ROHIT SHARMA హాఫ్ సెంచరీ కొట్టాడు. లక్ష్య ఛేదనలో చెన్నై  161 పరుగులే చేసింది. 

బెన్ కటింగ్ : 2016 లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్ రౌండర్ బెన్ కటింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఆర్సీబీ తో జరిగిన ఆ ఫైనల్ లో ఫస్ట్ బ్యాటింగ్ లో 15 బంతుల్లోనే 39 పరుగులు చేసిన కటింగ్.. తర్వాత బౌలింగ్ లో రెండు కీలక వికెట్లు తీసి హైదరాబాద్ కు  రెండో ఐపీఎల్ ట్రోఫీ అందించడంలో ముఖ్యపాత్ర పోషించాడు. 

కృనాల్ పాండ్యా : 2017 ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణె సూపర్జేయింట్స్ మధ్య ఫైనల్ జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో పూణె ఒక్క పరుగుతోనే ఓడిపోయింది. ముందు బ్యాటింగ్ కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 129 పరుగులే చేసింది.  అనంతరం ఛేదనకు దిగిన పూణె.. 128 పరుగులు మాత్రమే  చేయగలిగింది. ముంబై బ్యాటింగ్ లో కృనాల్.. 38 బంతుల్లో 47 పరుగులు చేయడమే గాక పూణె బ్యాట్స్మెన్ ను కట్టడి చేశాడు. 

షేన్ వాట్సన్: 2018  ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు షేన్ వాట్సన్ ఈ అవార్డు దక్కించుకున్నాడు. సన్ రైజర్స్ తో జరిగిన ఫైనల్లో వాట్సన్ రెచ్చిపోయి ఆడాడు. ఆ మ్యాచ్ లో వాట్సన్ ఏకంగా సెంచరీ (117) చేసి చెన్నైకి మరో ట్రోఫీ అందించాడు. 

జస్ప్రీత్ బుమ్రా: 2019 సీజన్ లో ముంబై-చెన్నైల మధ్య ఐపీఎల్ ఫైనల్ జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై.. 149 పరుగులే చేసింది. కానీ ఈ లక్ష్యాన్ని కూడా చెన్నై ఛేదించలేకపోయింది.  ఆ మ్యాచ్ లో బుమ్రా.. నాలుగు ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. 

ట్రెంట్ బౌల్ట్: ఇక గతేడాది జరిగిన ఐపీఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో.. ఈ కివీస్ ఫాస్ట్ బౌలర్ నాలుగు ఓవర్లు వేసి మూడు వికెట్లు తీసుకున్నాడు. దీంతో తొలి కప్పు గెలవాలనుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఓటమితోనే వెనుదిరిగింది. 

2021: ఇక తాజా సీజన్ లో ఈ అవార్డు ఎవరు సొంతం చేసుకుంటారో మరో కొద్దిగంటల్లో తేలిపోతుంది. చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న పోరులో ఏ ఆటగాడు అద్భుతంగా ఆడి తమ జట్టును గెలిపించుకుంటాడో చూడాలి మరి..!

click me!