India vs New Zealand : 147 ఏళ్లలో తొలిసారి - సొంతగడ్డపై టీమిండియా వైట్‌వాష్‌

First Published | Nov 3, 2024, 3:56 PM IST

India vs New Zealand: ముంబై టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్లు ఘోరంగా విఫ‌లమయ్యారు. ఈ ఒక్క మ్యాచ్ మాత్ర‌మే కాదు ఈ సిరీస్ మొత్తం దారుణ ప్ర‌ద‌ర్శ‌న‌ కారణంగా భార‌త జ‌ట్టును న్యూజిలాండ్ వైట్ వాష్  చేసింది. 
 

India vs New Zealand : న్యూజిలాండ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు పూర్తిగా లొంగిపోయింది. మూడు టెస్టుల సిరీస్‌లో టీమిండియా 0-3 తేడాతో ఓడిపోయింది. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా, భారత్ తన సొంత మైదానంలో 3 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లో వైట్‌వాష్ కావ‌డం ఇదే తొలిసారి.

Rohit Sharma

కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ గౌతమ్ గంభీర్ నాయకత్వంలో ఈ అవమానకరమైన ఓటమి భార‌త్ కు ఎదురైంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ 6 వికెట్లు, రైట్ ఆర్మ్ స్పిన్నర్ గ్లెన్ ఫిలిప్స్ 3 వికెట్లు తీయడంతో కివీస్ మూడో రోజు ముంబై టెస్టులో 25 పరుగుల తేడాతో భార‌త్ పై విజయం సాధించింది.

అత్యంత అవమానకరమైన ఓటమి

వాంఖ‌డే స్టేడియం వేదిక‌గా జ‌రిగిన‌ ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేశాడు. అతని జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులు చేసింది. ఆ త‌ర్వాత టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భార‌త్ కు 28 పరుగుల ఆధిక్యం ల‌భించింది.  ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ను 174 పరుగులకు ఆలౌట్ చేసింది భార‌త్. దీతో న్యూజిలాండ్ టీమ్ టీమిండియా ముందు 147 పరుగుల స్వ‌ల్ప‌ లక్ష్యాన్ని ఉంచింది. కానీ, టీమిండియా ఈజీ టార్గెట్ ను ఛేదించే క్ర‌మంలో 29.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది.


కేవలం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు

రెండో ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ మైదానంలో ఉన్నంతసేపు భారత్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. అతను అవుటైన వెంటనే మ్యాచ్ భారత్ చేతుల్లోంచి పూర్తిగా జారిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగారు.

దీని బ‌ట్టి భార‌త బ్యాట‌ర్లు ఎంత దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇచ్చారో తెలుసుకోవ‌చ్చు. రిష‌డ్ పంత్ పంత్ 57 బంతుల్లో 68 పరుగులతో బలమైన ఇన్నింగ్స్ ఆడాడు, కానీ అతను జట్టును గెలిపించ‌లేక‌పోయాడు. 

అంచ‌నాలు తారుమారు చేశారు

ఈ సిరీస్ లో స్టార్ ప్లేయ‌ర్లు పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయారు. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బయలుదేరిన టీమ్ ఇండియాకు ఆరంభం మంచిగా ల‌భించ‌లేదు. 8 ఓవర్లలో 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. భార‌త వికెట్ల ప‌త‌నం కెప్టెన్ రోహిత్ శర్మతో ప్రారంభమైంది. అతను బాధ్యతా రహితంగా కనిపించాడు.

మాట్ హెన్రీ బౌలింగ్ లో బౌండరీ కొట్టే ప్రయత్నంలో గ్లెన్ ఫిలిప్స్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్ చేరాడు. రోహిత్ 11 పరుగులు మాత్ర‌మే చేశాడు. శుభ్‌మన్ గిల్ 1, విరాట్ కోహ్లీ 1, యశస్వి జైస్వాల్ 5, సర్ఫరాజ్ ఖాన్ 1 పరుగు చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు. స్టార్ బ్యాట‌ర్లు అంచ‌నాలను మొత్తం తారుమారు చేశారు. 

పంత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు, కానీ గెలిపించ‌లేక పోయాడు

ఆరో వికెట్‌కి రవీంద్ర జడేజాతో కలిసి 42 పరుగులు, ఏడో వికెట్‌కు వాషింగ్టన్ సుందర్‌తో కలిసి 35 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా పంత్ మ్యాచ్‌ను కాపాడాడు. ఒక పరుగు చేసిన తర్వాత జడేజా ఔటయ్యాడు. అతని తర్వాత పంత్ కూడా పెవిలియ‌న్ బాట‌ప‌ట్టాడు. వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్ ఎనిమిదో వికెట్‌కు 15 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్‌ను విజయానికి చేరువ చేశారు, అయితే ఇద్దరూ మ్యాచ్‌ను ముగించలేకపోయారు. 4 బంతుల్లోనే టీమిండియా చివరి 3 వికెట్లు పడ్డాయి.

India vs New Zealand

స్పిన్నర్ల ముందు మోకరిల్లిన టీమిండియా 

స్పిన్ బౌలర్లకు భారత జట్టు లొంగిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముంబై మారథాన్‌లో అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్ జోడీ టీమిండియా సింహాలను ధ్వంసం చేసింది. ఇజాజ్, సాంట్నర్, ఫిలిప్స్‌ల ముందు భారత బ్యాట్స్‌మెన్ ప్రదర్శించిన పేలవమైన ప్రదర్శనతో భార‌త్ కు ఓట‌మి త‌ప్ప‌లేదు. 

కాగా, ఈ ఓటమితో భారత్ 14 మ్యాచ్‌లు ముగిసేసరికి 58.33 శాతంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్లలో రెండో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా 62.50తో అగ్రస్థానంలో ఉండగా, శ్రీలంక 55.56తో మూడో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు, భారత్ WTC ఫైనల్‌కు చేరుకోవడానికి బలమైన స్థితిలో ఉన్నట్లు అనిపించింది. వచ్చే ఏడాది లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో టైటిల్ మ్యాచ్ జరగనుంది.
 

Latest Videos

click me!