10 వికెట్లు - న్యూజిలాండ్ పై జ‌డేజా సూప‌ర్ బౌలింగ్ - బిషన్ సింగ్ బేడీ రికార్డు బ్రేక్

First Published | Nov 3, 2024, 3:33 PM IST

Ravindra Jadeja : ముంబై టెస్టు మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన చేసి 10 వికెట్లు పడగొట్టాడు. ఈ క్ర‌మంలోనే దిగ్గ‌జ ప్లేయ‌ర్ ను అధిగ‌మించాడు. 
 

Ravindra Jadeja : న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రెండు ఐదు వికెట్లు తీసి బిషన్ సింగ్ బేడీ రికార్డును బద్దలు కొట్టాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. మూడో రోజు ఉదయం సెషన్‌లో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్‌ను జడేజా ఎనిమిది పరుగుల వద్ద అవుట్ చేసి, ఈ టెస్టులో తన రెండో ఐదు వికెట్ల ప్రదర్శనను సాధించాడు.

3వ టెస్టులో జడేజా అద్భుత ప్రదర్శన

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 22 ఓవర్లలో 65 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. అతను తన అద్భుతమైన ఫామ్‌ను రెండవ ఇన్నింగ్స్‌లోనూ కొన‌సాగించాడు. రెండో ఇన్నింగ్స్ మొత్తం 55 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి ఐదుగురు కివీ బ్యాటర్‌లను పెవిలియ‌న్ కు పంపాడు. దీంతో ఒక ఇన్నింగ్స్ లో ఐదుకంటే ఎక్కువ వికెట్లు తీసుకోవ‌డం 15వ సారి కావ‌డంతో బిష‌న్ సింగ్  బేడీ సాధించిన 14 సార్లు 5 వికెట్ల రికార్డును అధిగ‌మించాడు. 

బేడీ తన కెరీర్‌లో 67 టెస్టుల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి 14 సార్లు ఐదు వికెట్లు పడగొట్టాడు.
అయితే జడేజా తన 77 మ్యాచ్‌ల్లో 15 సార్లు ఐదు వికెట్లు సాధించాడు. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధికంగా ఐదు వికెట్లు తీసిన ఆటగాడిగా ఆర్ అశ్విన్ 105 మ్యాచ్‌ల్లో 37 సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. అత‌ని త‌ర్వాత లెజెండ‌రీ బౌల‌ర్ అనిల్ కుంబ్లే (35), హర్భజన్ సింగ్ (25), కపిల్ దేవ్ (23), భగవత్ చంద్రశేఖర్ (16) ఉన్నారు. వారి త‌ర్వాత ర‌వీంద్ర జ‌డేజా(15) ఉన్నాడు.


ముంబయి టెస్టులో జడేజా జంటగా ఐదు వికెట్లు పడగొట్టడంతో  టెస్టు మ్యాచ్‌లో మూడో సారి 10 వికెట్లు తీసుకున్న ఘ‌న‌త సాధించాడు. జడేజా కంటే ముందు ముగ్గురు భారతీయులు ఈ రికార్డును సాధించారు. ర‌విచంద్ర‌న్ అశ్విన్ (8), అనిల్ కుంబ్లే (8), హర్భజన్ (5) మాత్రమే ఒక టెస్ట్ మ్యాచ్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసుకున్న భార‌త బౌల‌ర్లుగా ఉన్నారు. ఈ ఫీట్ తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో జ‌డేజా మొత్తం వికెట్ల సంఖ్యను 127కు చేరుకుంది. జడేజా ఒక‌ టెస్ట్ మ్యాచ్‌లో ట్విన్ ఫైఫర్‌లు సాధించడం ఇదే తొలిసారి.

జ‌డేజా ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో 5/65 వికెట్లు తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ లో కూడా 5/55 కీల‌క‌మైన వికెట్లు తీశాడు. దీంతో త‌న టెస్టు కెరీర్ లో ఇప్పుడు 23.76 సగటుతో 319 టెస్ట్ వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. 15 సార్లు ఐదు వికెట్లు, మూడు సార్లు 10 వికెట్లు తీశాడు.

జ‌డేజా న్యూజిలాండ్ తో ఆడిన మొత్తం 11 మ్యాచ్‌లలో 27.48 స‌గ‌టుతో 41 వికెట్లు తీసుకున్నాడు. న్యూజిలాండ్ టీమ్ పై ఐదు వికెట్లు తీసుకోవ‌డం ఇది మూడోసారి.  ఇక 49 హోమ్ మ్యాచ్‌లలో జడేజా ఆకట్టుకునే ప్ర‌ద‌ర్శ‌న‌తో 20.71 స‌గ‌టుతో 12 సార్లు ఐదు వికెట్లు తీసుకోవ‌డంతో పాటు మొత్తం 238 వికెట్లు సాధించాడు.

అత్యంత అవమానకరమైన ఓటమి

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేశాడు. అతని జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు చేసి 28 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ను 174 పరుగులకు ఆలౌట్ చేసింది భార‌త్. దీంతో భారత్ ముందు 147 పరుగుల స్వ‌ల్ప‌ లక్ష్యాన్ని ఉంచింది. కానీ, టీమిండియా దానిని కూడా అందుకోలేక‌పోయింది. 29.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది.

Latest Videos

click me!