మార్పు మంచిదే.. అయినా ఇదేం ఆశ్చర్యమనిపించలేదు.. భారత వన్డే కెప్టెన్సీ మార్పుపై పాక్ మాజీ సారథి వ్యాఖ్యలు

First Published Dec 9, 2021, 5:49 PM IST

Rohit Sharma-Virat Kohli: భారత వన్డే జట్టు పగ్గాలను కోహ్లీ నుంచి రోహిత్ శర్మకు బదిలీ చేయడం  తనకు ఆశ్చర్యం కలిగించలేదని  పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ అంటున్నాడు. ఇదేం కొత్త విషయం కాదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

టీమిండియా వన్డే కెప్టెన్సీ మార్పుపై భారత మాజీ క్రికెటర్లే కాదు.. పొరుగు దేశంలో ఉన్న  ఆటగాళ్లు కూడా స్పందిస్తున్నారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్ణయం ఏమంత ఆశ్చర్యం కలిగించలేదని, ఇది ఊహించిందేనని పాక్ మాజీ  సారథి సల్మాన్ భట్ అన్నాడు. 

బుధవారం భారత వన్డే కెప్టెన్సీ బాధ్యతలను కోహ్లీ నుంచి రోహిత్ శర్మకు బదిలీ చేసిన నేపథ్యంలో సల్మాన్ భట్ స్పందించాడు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా భట్ మాట్లాడాడు. 

‘ఈ నిర్ణయం (వన్డే కెప్టెన్సీ మార్పు) నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఇది కార్డులపై ఉంది.  భారత జట్టు టీ20 ల కంటే వన్డేలు,  టెస్టులు ఎక్కువగా ఆడుతున్నది. అలాంటి సందర్భంలో అన్ని ఫార్మాట్లలో విరాట్ కెప్టెన్ గా ఉంటే అతడి మీద ఒత్తిడి పెరుగుతున్నది. 

విరాట్ మీద పని ఒత్తిడిని తగ్గించడానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందని నేను భావిస్తున్నాను. కెప్టెన్సీ భారం లేకపోవడంతో ఇకనుంచి కోహ్లీ స్వేచ్ఛగా ఆడే అవకాశముంది.

ఇక రోహిత్ శర్మ ఎంతమాత్రమూ స్టాండ్ బై కెప్టెన్ కాదు. ప్రజలు ఇకనుంచి అతడి గురించి మాట్లాడతారు.  మంచో చెడో.. జరిగిందేదో జరిగిపోయింది. మార్పు మంచిదే..’ అని అన్నాడు. 

విరాట్ కోహ్లీ గానీ,  రోహిత్ శర్మ గానీ చాలా అనుభవజ్ఞులైన ఆటగాళ్లని, వారి అప్స్ అండ్ డౌన్స్ లో ఒకరికొకరు తోడుగా ఉంటారని తాను ఆశిస్తున్నానని భట్ చెప్పాడు. 
 

కాగా.. విరాట్ నేతృత్వంలో భారత్ 95 వన్డేలు ఆడింది. అందులో 65 విజయాలుండగా.. 27 ఓటములున్నాయి.  విజయాల శాతం 72.65 గా ఉంది.  కెప్టెన్ గా ఉన్నా కోహ్లీ.. 5,449 పరుగులు చేశాడు. కానీ ఐసీసీ ట్రోఫీలలో వైఫల్యం కోహ్లీకి మాయని మచ్చలా మారింది. ఇదే కారణంతో విరాట్.. వన్డే కెప్టెన్సీ కోల్పోయాడని వార్తలు వినిపిస్తున్నాయి. 

మరోవైపు రోహిత్ శర్మ ఇప్పటివరకు 10 వన్డేలలో సారథిగా ఉండగా.. అందులో 8 విజయాలు దక్కాయి. 2018లో  హిట్ మ్యాన్ నేతృత్వంలోని భారత జట్టు ఆసియాకప్ ను గెలుచుకుంది. దాంతో పాటు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను  ఐదు సార్లు విజేతగా నిలిపిన రోహిత్..  ఐసీసీ ఈవెంట్లలో భారత కథ మారుస్తాడని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. 

click me!