147 ఏళ్లలో తొలిసారి - య‌శ‌స్వి జైస్వాల్ చారిత్రాత్మక రికార్డు

First Published | Sep 19, 2024, 10:59 PM IST

IND vs BAN - Yashasvi Jaiswal : చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు భార‌త యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ మ‌రోసారి ఆక‌ట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను చారిత్రాత్మక ఫీట్ సాధించాడు. 
 

Yashasvi Jaiswal

IND vs BAN - Yashasvi Jaiswal : చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక‌గా భారత్-బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జ‌రుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ భార‌త్ కు బ్యాటింగ్ అప్ప‌గించింది. బంగ్లాదేశ్ బౌల‌ర్లు మ్యాచ్ ప్రారంభం నుంచి అద్భుత‌మైన బౌలింగ్ లో భార‌త్ ను ఇబ్బంది పెట్టారు. అయితే, ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్, పంత్, అశ్విన్, జ‌డేజాల ఇన్నింగ్స్ ల‌తో భార‌త్ మంచి స్కోర్ దిశ‌గా ముందుకు సాగింది.

గురువారం చెన్నైలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో మొదటి రోజు భార‌త ఓపెన‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ చారిత్రాత్మక రికార్డును సాధించాడు. వ‌రుస‌గా వికెట్లు ప‌డుతున్న స‌మ‌యంలో  జైస్వాల్ ఒక ఎండ్‌లో నిలకడగా ఆడాడు. వికెట్లు ప‌డ‌కుండా అడ్డుకుని భార‌త ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దే ప్ర‌యత్నం చేశాడు. బంగ్లాదేశ్ నిప్పులు చెరిగే బౌలింగ్ ను ఎదుర్కొని జైస్వాల్ హాఫ్ సెంచరీ (56  ప‌రుగులు) సాధించాడు. 

దీంతో జైస్వాల్ 147 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో స్వదేశంలో తన మొదటి 10 ఇన్నింగ్స్‌లలో 750 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి బ్యాటర్‌గా నిలిచాడు. గతంలో 1935లో 747 పరుగులు చేసిన వెస్టిండీస్‌కు చెందిన జార్జ్ హెడ్లీ పేరిటే ఈ రికార్డు వుండ‌గా, ఇప్పుడు జైస్వాల్ బ్రేక్ చేశాడు. 


స్వదేశంలో తొలి 10 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక టెస్టు పరుగులు చేసిన ప్లేయర్లు వీరే : 

755* - యశస్వి జైస్వాల్ (భారతదేశం)

747 - జార్జ్ హెడ్లీ (వెస్టిండీస్)

743 - జావేద్ మియాందాద్ (పాకిస్థాన్)

687 - డేవ్ హౌటన్ (జింబాబ్వే)

680 - సర్ వివ్ రిచర్డ్స్ (వెస్టిండీస్)

బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ హసన్‌ మహమూద్‌ నాలుగు వికెట్లతో భారత్‌ను దెబ్బ‌కొట్టాడు. దీంతో చెన్నై వేదికగా గురువారం జరిగిన తొలి టెస్టు తొలి రోజు టీ విరామానికి భార‌త్ 176-6 ప‌రుగులు చేసింది. ప్రారంభంలోనే మూడు వికెట్లు పడగొట్టి, లంచ్ తర్వాత మరో వికెట్ పడగొట్టడంతో భార‌త్ క‌ష్టాల్లో ప‌డింది.

కానీ, రెండో విరామ సమయానికి రవీంద్ర జడేజా ఏడు పరుగులతో, రవిచంద్రన్ అశ్విన్ 21 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆ త‌ర్వాత వీరి జోరును ఆప‌డం బంగ్లాదేశ్ బౌల‌ర్ల‌కు చాలా క‌ష్టంగా మారింది. అశ్విన్ త‌న బ్యాట్ ప‌వ‌ర్ ను చూపిస్తూ త‌న కెరీర్ లో ఫాస్టెస్ట్ సెంచ‌రీ (102* ప‌రుగులు) బాదాడు.

అలాగే, ర‌వీంద్ర జ‌డేజా కూడా సూప‌ర్ బ్యాటింగ్ తో సెంచ‌రీ దిశ‌గా ముందుకు సాగుతున్నాడు. జ‌డేజా 86* ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ తో 10 ఫోర్లు, 2 సిక్స‌ర్లు బాదాడు. అంతకుముందు జైస్వాల్, రిషబ్ పంత్ ల మంచి ఇన్నింగ్స్ లతో భారత్ తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి 6 వికెట్లు కోల్పోయి 339 ప‌రుగులు చేసింది. 

కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సహా భారత టాప్ ఆర్డర్‌ను బంగ్లాదేశ్ యంగ్ పేసర్ మహమూద్ దెబ్బకొట్టాడు. ఈ ఇద్దరూ స్టార్ ప్లేయర్లు కేవలం చెరో ఆరు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరారు. శుభ్ మన్ గిల్ ఒక్క పరుగు కూడా చేయకుండానే ఔట్ అయ్యాడు. దీంతో భారత జట్టు ఆట ప్రారంభమైన మొదటి గంటలోపు 34-3 పరుగులతో కష్టాల్లో పడింది. 

56 పరుగులు చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్, తోటి లెఫ్ట్ హ్యాండర్ రిషబ్ పంత్‌తో కలిసి 62 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత ఇన్నింగ్స్‌లో కొంత ఊపు వచ్చింది. 

ఇక ఘోర 2022 కారు ప్రమాదం తర్వాత తన మొదటి టెస్ట్ ఆడుతున్న వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్, లూజ్ షాట్ ఆడి క్యాచ్ రూపంలో పెవిలియన్ కు చేరాడు. తన ఇన్నింగ్స్ లో 6 బౌండరీలతో 39 పరుగులు చేశాడు. ఆ తర్వాత జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని ఔట్ అయ్యాడు. బంగ్లా స్పిన్నర్ మెహిదీ హసన్ మిరాజ్ బౌలింగ్ లో 16 పరుగుల వద్ద కేఎల్ రాహుల్‌ను అవుట్ అయ్యాడు. ఆ తర్వాత అశ్విన్, జడేజాలు భారత ఇన్నింగ్స్ ను కొనసాగించారు. 

Latest Videos

click me!